KCR: నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి రూ.150 కోట్లు: కేసీఆర్‌

నల్గొండ జిల్లాలో 15 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వీటన్నింటినీ ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని

Updated : 24 Sep 2022 15:16 IST

హాలియా: నల్గొండ జిల్లాలో 15 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వీటన్నింటినీ ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని చెప్పారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని.. కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలపై రానున్న రోజుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో తెరాసను గెలిపించినందుకు ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తనకు కరోనా సోకడంతో నియోజకవర్గానికి రావడం ఆలస్యమైందన్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు చేయనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.  హాలియా, నందికొండ అభివృద్ధికి రూ.15 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. హాలియాలో డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం నిర్మిస్తామన్నారు.

ఆరునూరైనా దళితబంధు అమలు చేస్తాం

‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కార్యక్రమాలు చేపడుతున్నాం. నందికొండ మున్సిపల్‌ క్వార్టర్స్‌, ఇరిగేషన్‌ భూముల్లో ఉన్నవారికి క్రమబద్ధీకరిస్తాం. నెలరోజుల్లో లబ్ధిదారులకు పట్టాలిస్తాం. సాగర్‌ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బంజారాలు ఉన్నారు. వారి కోసం బంజారా భవనం నిర్మిస్తాం. రెండేళ్లలో విద్యుత్‌ వ్యవస్థను తీర్చిదిద్ది రైతాంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇస్తామని చెబితే ఆనాడు జానారెడ్డి ఎగతాళి చేశారు. చేసి చూపించాం. దళితబంధు కోసం రూ.లక్ష కోట్లయినా ఖర్చు చేస్తాం. తెలంగాణ ఎస్సీలు దేశానికి ఆదర్శమవుతారు. రాష్ట్రంలో సుమారు 17లక్షల మంది దళితులు ఉన్నారు. వీరిలో దాదాపు 12 లక్షల మంది దళితబంధుకు అర్హులు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి బ్యాంకుతో సంబంధం లేకుండా దళితబంధు కింద రూ.10లక్షలు వేస్తాం. ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 కుటుంబాలకు వచ్చేలా చర్యలు చేపడతాం. ఆరునూరైనా దళితబంధును అమలు చేసి చూపిస్తాం. మేథోమథనం చేసి ఈ పథకాన్ని తీసుకొస్తున్నాం. నేనే స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తా. తెలంగాణ దళితజాతి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ప్రజలు మా పట్ల బ్రహ్మాండమైన ఆదరణ చూపుతున్నారు. మీ దీవెనలు ఉన్నన్నాళ్లు ఇదే పద్ధతిలో ముందుకువెళ్తాం. కృష్ణా జలాల్లో మన వాటా తీసుకుని సాగర్‌ ఆయకట్టులో రెండు పంటలు పండేలా చేస్తాం’’ అని కేసీఆర్‌ అన్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts