Ts News: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయి: డీజీపీ కార్యాలయం

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ డీజీపీ కార్యాలయం స్పందించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. అవన్నీ నిరాధార ఆరోపణలని పేర్కొంటూ డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది...

Updated : 25 Oct 2021 20:38 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ డీజీపీ కార్యాలయం స్పందించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. అవన్నీ నిరాధార ఆరోపణలని పేర్కొంటూ డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘డీజీపీ, మంత్రుల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని, ఉన్నతాధికారుల మధ్య విభేదాలు ఉన్నాయనేది అవాస్తవం. అన్ని విభాగాల మధ్య మంచి సమన్వయం ఉంది. ప్రతిభ, సామర్థ్యం ఆధారంగానే పోలీసు శాఖలో పోస్టింగులు ఇచ్చాం. నిరాధార ఆరోపణల వల్ల పోలీసుల ఆత్మస్థైర్యం, మనోధైర్యం దెబ్బతింటుంది. మావోయిస్టులు ఉంటే బాగుండేదని రేవంత్‌ అనటం సరైంది కాదు. ప్రజాప్రతినిధులను కూడా మావోయిస్టులు బలితీసుకున్నారు. మావోయిస్టుల ఏరివేతలో 350 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయి. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమాజంలో శాంతిభద్రతలపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదముంది. ఇండియన్ టెలిగ్రాఫ్‌ యాక్ట్ ప్రకారమే పోలీసు శాఖ నడుచుకుంటోంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు’’ అని డీజీపీ కార్యాలయం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని