Covid: చిన్నారులకు కొవిడ్‌ సోకినా వంద శాతం కోలుకుంటున్నారు: డీహెచ్‌ శ్రీనివాస్‌

తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కొవిడ్‌ నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) డా.శ్రీనివాస్‌ తెలిపారు....

Updated : 01 Sep 2021 16:11 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కొవిడ్‌ నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) డా.శ్రీనివాస్‌ తెలిపారు. కోఠిలోని ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో డీహెచ్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మరణాల శాతం కేవలం 0.5 శాతం మాత్రమే ఉండగా.. రికవరీ రేటు 98.5 శాతం ఉందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1 నుంచి 10 ఏళ్లలోపు వారిలో కేవలం 3 శాతం మాత్రమే కొవిడ్‌ బారినపడినట్లు చెప్పారు. 20 ఏళ్ళలోపు వారిలో 13 శాతం మందికి వైరస్‌ సోకినట్లు వెల్లడించారు. వైరస్‌ సోకినవారిలో అత్యధికంగా 73 శాతం మంది 20 నుంచి 65 ఏళ్ళలోపు వారు ఉన్నట్లు వివరించారు. చిన్నారులకు కొవిడ్‌ సోకినా వంద శాతం కోలుకుంటున్నారని స్పష్టం చేశారు.

ప్రజల ఆరోగ్యాన్ని బాధ్యతగా తీసుకోవాలి..

‘‘తెలంగాణలో వైరస్ పూర్తిగా అదుపులో ఉంది. గతంలో కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాల్లో సైతం వైరస్‌ ప్రభావం అదుపులోకి వచ్చింది. రాష్ట్రంలో 63 లక్షల మంది చిన్నారులు పాఠశాలలకు వెళ్తున్నారు. పెద్దల్లో 63శాతం, పిల్లల్లో 50శాతం పైగా వైరస్ బారిన పడినట్లు సీరో సర్వేలో తేలింది. కేరళలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా వస్తున్న కేసుల్లో 60 నుంచి 70 శాతం కేరళలోనే నమోదవుతున్నాయి. గత వారం నుంచి అక్కడ కేసులు పెరగడానికి పండుగలు కూడా ఒక కారణం. తెలంగాణలో బతుకమ్మ వేడుకలు జరిగినా కేసులు పెరగలేదు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు భయపడాల్సిన పనిలేదు. కొవిడ్ వాక్సినేషన్ వేగంగా సాగుతోంది. జీహెచ్‌ఎంసీలో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపడుతున్నాం. అన్ని విభాగాల అధికారులతో చర్చించాకే పాఠశాలలు తెరవాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. తెలంగాణ మొదటి నుంచి శాస్త్రీయ పద్ధతిలో కొవిడ్ కట్టడికి చర్యలు తీసుకుంది. పిల్లల ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత. మళ్ళీ కొత్తరకం, ప్రస్తుతం ఉన్న వేరియంట్ల కన్నా శక్తిమంతమైంది వస్తే తప్ప థర్డ్‌ వేవ్ వచ్చే అవకాశం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని కూడా రాజకీయ నాయకులు బాధ్యతగా తీసుకోవాలి. రాజకీయ కార్యకలాపాల వల్ల భవిష్యత్తులో కేసులు పెరిగితే కచ్చితంగా నేతలే బాధ్యత తీసుకోవాలి.

ఐదు కేసులు నమోదైతే క్లస్టర్‌గా గుర్తిస్తాం..

రాష్ట్రంలో ఎనిమిది నెలల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పిల్లలను పాఠశాలలకు పంపించే విషయంలో తల్లిదండ్రుల్లో భయాలు నెలకొన్నాయి. మొదటిరోజు తక్కువ సంఖ్యలో విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. పాఠశాలల్లో 5 మంది కంటే ఎక్కువ మంది ఒకేసారి వైరస్‌ బారిన పడితే ఆ పాఠశాలని క్లస్టర్‌గా గుర్తించి పిల్లలు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. జీహెచ్‌ఎంసీ పరిధిలో 175 మొబైల్‌ వాహనాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాం. ఇప్పటివరకు 95 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. 60 శాతం కాలనీల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయింది. మొబైల్ వాహనాల ద్వారా 5.16 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశాం. జీహెచ్‌ఎంసీలో పూర్తయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర కార్పొరేషన్లు, గ్రామీణ ప్రాంతాలకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం.

సెప్టెంబర్ చివారి నాటికి వంద శాతం వ్యాక్సినేషన్‌

సెప్టెంబర్ చివారి నాటికి వంద శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెలలో 50 లక్షల డోస్‌లు వేయాలని ప్రణాళిక రూపొందించాం. సెప్టెంబర్‌లో చిన్నారులకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రెండేళ్లు పైబడిన పిల్లలకు వచ్చే రెండు నెలల్లో భారత్ బయోటెక్ వ్యాక్సిన్  అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్న ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్‌ని మాత్రమే పాఠశాలలోకి అనుమతించాలని ఆదేశాలు జారీ చేశాం. భవిష్యత్తులో సాధారణ ప్రజలు సైతం వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటేనే బహిరంగ ప్రదేశాల్లో అనుమతి ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం’’ అని డీహెచ్‌ తెలిపారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని