TS News: థర్డ్‌వేవ్‌పై భయం వద్దు.. అప్రమత్తంగా ఉండండి: డీహెచ్ శ్రీనివాస్‌రావు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు దాస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు..

Published : 06 Dec 2021 01:28 IST

హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు దాస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డా.శ్రీనివాస్‌రావు తెలిపారు. కొవిడ్‌ను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని చెప్పారు.  దక్షిణాఫ్రికాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని.. అక్కడ కరోనా కేసులు 8నుంచి 16 శాతానికి చేరాయన్నారు. వీటిలో 75శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని చెప్పారు. వ్యాధి తీవ్రత తెలిసేందుకు మరో వారం రోజులు పడుతుందన్నారు. కరోనా కొత్త వేరియంట్‌ భయాందోళనల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘దక్షిణాఫ్రికాలో కేసులు పెరిగినా ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరగడం లేదు. విదేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేస్తున్నాం. 900 మందికి పైగా ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకోగా అందులో 13మందికి కొవిడ్‌ నిర్ధరణ అయింది. వారికి ఒమిక్రాన్ సోకిందా లేదా అనే విషయం ఒకట్రెండు రోజుల్లో తేలుతుంది. కొవిడ్ నిబంధనలు కాస్త మెరుగుపడ్డాయి.

వైరస్‌ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం. ఒకట్రెండు నెలల్లో భారత్‌లోనూ కేసులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దేశంలో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మనల్ని కాపాడుకోవచ్చు. మూడో వేవ్‌ను ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అప్రమత్తంగా ఉండాలి. ఒమిక్రాన్ సోకిన వారిలో తీవ్ర లక్షణాలు కనిపించడం లేదు. వైరస్‌ సోకితే తీవ్ర ఒళ్లునొప్పులు, తలనొప్పి, నీరసం ఉంటాయి.

తప్పుడు వార్తలతో వైద్యారోగ్యశాఖ మనోస్థైర్యం తగ్గుతుంది. కొవిడ్‌ కంటే తప్పుడు వార్తలు ప్రమాదకరం. తప్పుడు వార్తలతో ప్రజల్లో ఆందోళన పెంచుతున్నారు. ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశాం. నిన్న ఒక్క రోజే 3.7 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేశాం. ఈ నెలాఖరులోపు 100శాతం వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించాం’’ అని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని