Ts news: సాగర్ ఎడమ కాలువను ఇష్టారీతిగా పెంచుకున్నారు: తెలంగాణ ఈఎన్‌సీ

ఉమ్మడి రాష్ట్రాల ప్రభుత్వాలు తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికలు బేఖాతరు చేసి నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఇష్టారీతిగా పెంచుకుంటూ పోయారని తెలంగాణ

Updated : 26 Oct 2021 16:48 IST

హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రాల ప్రభుత్వాలు తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికలు బేఖాతరు చేసి నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఇష్టారీతిగా పెంచుకుంటూ పోయారని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ ఆరోపించారు. 1952లో హైదరాబాద్ రాష్ట్రం తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికలో ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు నందిగామ తాలుకాలోని కట్లేరు వాగు వరకు మాత్రమే ప్రతిపాదించారన్నారు. మద్రాసు రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆయకట్టు 1.3 లక్షల ఎకరాలు మాత్రమేనని ఈఎన్‌సీ గుర్తు చేశారు. ఈ మేరకు కే‌ఆర్‌ఎం‌బీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్‌ రెండు వేర్వేరు లేఖలు రాశారు.

‘‘1956లో రాష్ట్రాల పునర్విభజన అనంతరం ఏపీ ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టు నివేదికకు భిన్నంగా ఆంధ్ర ప్రాంతంలోని ఆయకట్టును 1.3 లక్షల ఎకరాల నుంచి 3.78 లక్షల ఏకరాలకు పెంచింది. అదే సమయంలో తెలంగాణ ఆయకట్టును 6.6 లక్షల ఎకరాల నుంచి 6.02 లక్షల ఎకరాలకు తగ్గించింది. లక్ష ఎకరాలను లిఫ్ట్ పథకాల ద్వారా సాగులోకి తీసుకురావాల్సి ఉండగా.. ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. 53వేల ఎకరాల ఆయకట్టును చిన్న చెరువుల కింద స్థిరీకరించాల్సి ఉండగా.. ఈ అంశాన్నీ ఏపీ ప్రభుత్వం విస్మరించింది. పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రెగ్యులేటర్ గేట్ కనీస మట్టాన్ని 13 మీటర్లు తగ్గించినందు వల్ల తెలంగాణ చాలా ఆయకట్టును కోల్పోయింది. 1969 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో ఏపీ ప్రభుత్వం ఉమ్మడి నివేదికకు అనుగుణంగా ఆంధ్ర ప్రాంతంలో ఆయకట్టును 1.3 లక్షల ఏకరాలకు కుదిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలో ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పందం లేదు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ ముందు 1954లో చేసిన ఉమ్మడి నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రాంతంలోని ఆయకట్టును కట్లేరు వాగు వరకు 1.3 లక్షల ఎకరాలకు పరిమితం చేయాలి. జులై 15 గెజిట్‌ నోటిఫికేషన్‌ షెడ్యూల్-2లో పేర్కొన్న 4.8 నుంచి 4.14 వరకు ఉన్న అంశాలను తొలగించాలి. ఈ అంశాలను కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు నివేదించండి’’ అని ఈఎన్‌సీ లేఖలో పేర్కొన్నారు.

కృష్ణా బోర్డు నుంచి స్పందన రాలేదు..

‘‘ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి ఎత్తిపోసిన నీటితో చేపట్టిన పిన్నపురం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసినప్పటికీ కృష్ణా బోర్డు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఏపీ ప్రభుత్వం పెన్నా బేసిన్‌లో నాలుగు స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టులను చేపట్టారు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల పనులు చేపట్టడానికి కే‌ఆర్‌ఎం‌బీ, ఆపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు పొందలేదు. హైడల్ ప్రాజెక్టులన్నీ కృష్ణా నది నుంచి ఎత్తిపోసిన నీటి ఆధారంగానే ప్రతిపాదించారు. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ ప్రభుత్వం కేవలం 34 టీ‌ఎం‌సీలు (15 టీఎంసీలు చెన్నై తాగునీటికి + 19 టీఎంసీలు శ్రీశైలం కుడి కాలువకు) మాత్రమే తరలించాలి. కానీ పోతిరెడ్డిపాడు ద్వారా దాని కింద ఉన్న బనకచెర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ ద్వారా పెద్ద ఎత్తున నీటిని ఎత్తిపోసి ఆయా రిజర్వాయర్ల నుంచి జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. తద్వారా తెలంగాణ లో ఉన్న ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది’’ అని రాసిన రెండో లేఖలో వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని