Ts news: ఇంకా ఎంత మంది మరణించాక అత్యవసర జాబితాలో చేరుస్తారు?: హైకోర్టు

తెలంగాణలో రానున్న మూడు నెలల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యా సంస్థల్లోనూ సిబ్బందికి రెండు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పేర్కొంది....

Updated : 22 Sep 2021 16:24 IST

హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు నెలల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యా సంస్థల్లోనూ సిబ్బందికి రెండు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పేర్కొంది. రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కలర్ కోడెడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ (సీసీజీఆర్‌ఏ) కార్యాచరణ ప్రణాళికలో జాప్యంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రెండు సార్లు ఆదేశించినప్పటికీ ఎందుకు సమర్పించలేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) డా. శ్రీనివాస్‌ను ప్రశ్నించింది.

సీసీజీఆర్‌ఏపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని డీహెచ్‌ కోర్టుకు వివరించారు. ప్రభుత్వ పాలసీలే అమలు చేస్తారా?కోర్టు ఆదేశాలు అమలు చేయరా?అని ప్రశ్నించింది. న్యాయస్థానం ఆదేశాలు అమలు చేయకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈనెల 30లోగా సీసీజీఆర్ఏ రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా ఔషధాలను అత్యవసర జాబితాలో చేర్చడంలో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎంత మంది మరణించాక చేరుస్తారని కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది. అక్టోబరు 31లోగా అత్యవసర జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ అక్టోబరు 4కి వాయిదా వేసింది.

మూడో దశ ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు: డీహెచ్‌

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై డీహెచ్‌ శ్రీనివాస్‌ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ‘‘రాష్ట్రంలో ఇప్పటివరకు 2.58 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించాం. ఈనెల 19వ తేదీ వరకు 6,63,450 కేసులు నమోదయ్యాయి. గత రెండు నెలల్లో పాజిటివిటీ రేటు 0.51 శాతానికి తగ్గింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.20 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశాం. 180 మొబైల్ వ్యాక్సినేషన్‌ కేంద్రాల ద్వారా 10.07 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశాం. ఈనెల 16 నుంచి ప్రత్యేక డ్రైవ్ ద్వారా 25.10 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశాం. జీహెచ్ఎంసీ పరిధిలో 97 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. రాష్ట్రంలో 60శాతం మందికి మొదటి డోస్ పూర్తయింది. 38 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థల్లో 71 మందికి కరోనా నిర్ధారణ అయింది. మూడో దశ ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’’ అని హైకోర్టుకు అందించిన నివేదికలో డీహెచ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని