Ts News: ధాన్యం కొనుగోళ్లకు సాధ్యమైనన్ని చర్యలు తీసుకోవాలి: హైకోర్టు

వానాకాలం పంటను కొనుగోలు చేసేందుకు వీలైనన్ని చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జనవరి 22వ తేదీ వరకు ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతాయని...

Published : 06 Dec 2021 19:23 IST

హైదరాబాద్‌: వానాకాలం పంటను కొనుగోలు చేసేందుకు వీలైనన్ని చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జనవరి 22వ తేదీ వరకు ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతాయని ప్రభుత్వ వివరణను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. వానాకాలం పంట కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయ విద్యార్థి శ్రీకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారణ చేపట్టింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ధాన్యం పాడయిపోతోందన్న ఆందోళనతో రైతులు కనీస మద్దతు ధరకన్నా తక్కువకు దళారులకు అమ్ముకుంటున్నారని.. ఆందోళనతో ఇద్దరు రైతులు మరణించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందని.. వానాకాలం ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేలా ఆదేశించాలని పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు.

ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని ఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలో చెప్పాలని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఉద్యమంలో మరణించిన ఇతర రాష్ట్రాల రైతులకు 3 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపింది. రాష్ట్రంలో 6,439 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు వివరించారు. ఇప్పటికే 27 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి.. నాలుగున్నర లక్షల రైతులకు రూ.2,800 కోట్లను ప్రభుత్వం చెల్లించిందన్నారు. రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కూడా కోరినట్లు ఏజీ తెలిపారు. పిటిషనర్ పేర్కొన్న ఇద్దరు రైతులు గుండెపోటుతో మరణించినట్లు ఏజీ తెలిపారు. జనవరి 22 వరకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని రైతులు ఆందోళన పడవద్దని ఏజీ హామీ ఇచ్చారు. ఏజీ వివరణను నమోదు చేసిన ధర్మాసనం.. ధాన్యం కొనుగోళ్లకు సాధ్యమైనన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విచారణను జనవరి 22కి వాయిదా వేసిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని