Telangana: సెప్టెంబర్‌లో రెవెన్యూ శాఖలో పదోన్నతుల ప్రక్రియ: ట్రెసా

సెప్టెంబర్ నెలలోనే రెవెన్యూ శాఖలోని అన్ని స్థాయిల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేస్తామని.. ఆ తర్వాత బదిలీలు చేపడతామని...

Published : 28 Aug 2021 02:11 IST

హైదరాబాద్‌: సెప్టెంబర్ నెలలోనే రెవెన్యూ శాఖలోని అన్ని స్థాయిల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేస్తామని.. ఆ తర్వాత బదిలీలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్ కుమార్ తెలిపినట్లు రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) తెలిపింది. ట్రెసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, బృందం సచివాలయంలో శుక్రవారం సీఎస్‌ను కలిసి పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు సహా ఇతర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల బదిలీలకు ఐదు ఐచ్ఛికాలు ఇస్తామని.. మండల స్థాయిలో రెవెన్యూ విధుల నిర్వహణకు కేడర్ నిర్ధారిస్తామని సీఎస్ చెప్పినట్లు తెలిపారు.

కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా త్వరలో ఉద్యోగుల విభజన కొలిక్కి రానున్నందున రెవెన్యూ శాఖలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను సెప్టెంబర్‌లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వీఆర్ఓలను త్వరలోనే సర్దుబాటు చేస్తామని, వీఆర్ఏల వేతన స్కేలు సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పారన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యలు, కార్యాలయ బడ్జెట్ వంటి ఇతర పెండింగ్ సమస్యలనూ త్వరలో పరిష్కరిస్తామన్నారని చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఆప్షన్స్ ప్రకారం భూసమస్యలు సకాలంలో పరిష్కరించేందుకు రెవెన్యూ ఉద్యోగులు మరింత కృషి చేయాలని ఈ సంర్భంగా సీఎస్ సూచించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని