Tankbund - Hyderabad: హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌పై సండే స్పెషల్‌

వారాంతంలో ట్యాంక్‌బండ్‌ అందాలను వీక్షించి ఆస్వాదించేందుకు ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఒక నెటిజన్‌ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావుకు విజ్ఞప్తి చేయగా... దానిపై ఆయన వెంటనే స్పందించారు..

Updated : 29 Aug 2021 23:03 IST

హైదరాబాద్‌: వారాంతంలో ట్యాంక్‌బండ్‌ అందాలను వీక్షించి ఆస్వాదించేందుకు ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఒక నెటిజన్‌ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావుకు విజ్ఞప్తి చేయగా... దానిపై ఆయన వెంటనే స్పందించారు. ప్రతి ఆదివారం సాయంత్రం అయిదు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ను దారి మళ్లించాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ను ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఈ ఆదివారం సాయంత్రం అయిదు గంటల నుంచి ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. దీంతో సందర్శకులు ఇవాళ ట్యాంక్‌బండ్‌కు భారీగా తరలివచ్చారు. ట్యాంక్‌ బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలను సీపీ అంజనీకుమార్‌ పరిశీలించారు. ఇకపై ప్రతి ఆదివారం వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. 

నగరవాసులు సహకరించాలి: సీపీ అంజనీకుమార్‌

‘‘రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ సుందరీకరణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్‌లో చారిత్రక ప్రదేశం ట్యాంక్‌ బండ్‌. ఎన్నో ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు.  ట్యాంక్‌  బండ్‌ సుందరీకరణ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. అంతర్జాతీయ నగరాల్లో వాటర్‌ ఫ్రాంట్ ఏరియాలో పాదచారులకు మాత్రమే అనుమతి ఉంటుంది. హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద కూడా అలా చేయాలని యోచన. నగరానికి చెందిన ఓ వ్యక్తి కోరిక మేరకు మంత్రి కేటీఆర్‌ ప్రయోగాత్మకంగా చేయాలని సూచించారు.  ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ డైవర్షన్‌ ఎలా చేయాలనేదానిపై సుదీర్ఘంగా సమీక్ష చేశాం. ఈరోజు ప్రయోగాత్మకంగా అమలు చేశాం. సాయంత్ర వేళ నగరవాసులు కుటుంబ సమేతంగా వచ్చి గడిపే వాతావరణం ఇక్కడ ఉంది. ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలకు నగరవాసులు సహకరించాలి’’ అని సీపీ అంజనీకుమార్‌ కోరారు.

ట్యాంక్‌బండ్‌పై సండే సందడి (చిత్రమాలిక)


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని