
భూముల వేలం ఆపలేం: హైకోర్టు
హైదరాబాద్: కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ప్రక్రియను ఆపేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల భూమిని గురువారం వేలం వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వేలం ప్రక్రియ ఆపాలని కోరుతూ భాజపా నేత విజయశాంతి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. భూముల విక్రయానికి సబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 13 కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. నిధుల సమీకరణతో పాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉన్నందున వేలం వేస్తున్నామని విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక అమ్ముకోవడమేంటని ఈ సందర్భంగా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూ బ్యాంకు ఏర్పాటుపై పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.
కోకాపేట.. కాసుల పంట
కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములు రూ.వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి. 49.92 ఎకరాలను ఈనెల 15వ తేదీన ఆన్‌లైన్ ద్వారా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) వేలం వేయబోతోంది. ఇప్పటికే వేలం ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ భూములను కొనుగోలు చేయడానికి భారీ డిమాండ్ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఎకరా రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య ధర పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా సర్కారుకు రూ.2500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. బాహ్యవలయ రహదారి నుంచి ఈ వెంచర్‌లోకి వచ్చేందుకు ప్రత్యేకంగా ట్రంపెట్ నిర్మాణాన్ని కూడా అధికారులు మొదలుపెట్టారు.