Ts News: ‘ఈనాడు’ కథనానికి స్పందించిన హైకోర్టు.. న్యాయవిచారణకు ఆదేశం

వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో విచారణ పేరిట పోలీసులు వేధించారన్న ఆరోపణలపై హైకోర్టు న్యాయవిచారణకు ఆదేశించింది. హత్య కేసులో బాన్యా అనే వ్యక్తిని పోలీసులు

Updated : 06 Jan 2022 19:33 IST

హైదరాబాద్‌: వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో విచారణ పేరిట పోలీసులు వేధించారన్న ఆరోపణలపై హైకోర్టు న్యాయవిచారణకు ఆదేశించింది. హత్య కేసులో బాన్యా అనే వ్యక్తిని పోలీసులు చిత్రహింసలు పెట్టారన్న ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 3న ‘ఈనాడు’ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలీలతో కూడిన ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది.

చెన్నారావుపేట మండలం జీడితండాగడ్డాకు చెందిన బాన్య భార్య భూక్య కమలమ్మ ఇటీవల పోలీసు ఉన్నతాధికారులకు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాన్యా, కమలమ్మల కుమార్తె సంధ్యకు 2016లో గుగులోత్ సతీష్‌తో వివాహం జరిగింది. తర్వాత మరో యువతిని వివాహం చేసుకున్న సతీష్‌ను గత నెల 1న గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని కమలమ్మ చెబుతున్నారు. ఆ హత్య కేసులో తనను, తన భర్త, కుటుంబసభ్యులను 10 రోజుల పాటు పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టారని ఆమె ఆరోపించారు. తన భర్త బాన్యా కాళ్లు విరిగిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈనాడు’ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని సుమోటోగా పరిగణించిన హైకోర్టు.. సీఎస్ సోమేశ్‌కుమార్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, వరంగల్ సీపీ, నర్సంపేట ఏసీపీ, చెన్నారావుపేట ఎస్‌హెచ్‌ఓని ప్రతివాదులుగా చేర్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని