AP News: తిరుమలకు ఐఐటీ దిల్లీ నిపుణులు : వైవీ సుబ్బారెడ్డి

తిరుమల ఘాట్‌ రోడ్డులో ఈ ఉదయం కొండ చరియలు విరిగి పడిన ప్రాంతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు...

Updated : 01 Dec 2021 15:15 IST

తిరుమల: తిరుమల ఘాట్‌ రోడ్డులో ఈ ఉదయం కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడుతున్నాయని తెలిపారు. అప్ ఘాట్ రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించామన్నారు. యుద్ధప్రాతిపదికన ధ్వంసమైన రోడ్డు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు.

కొండ చరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో ఈ సాయంత్రానికి దిల్లీ ఐఐటీ నిపుణులు తిరుమలకు చేరుకుంటారని సుబ్బారెడ్డి తెలిపారు. తితిదే ఇంజినీరింగ్‌, విజిలెన్స్‌ అధికారులతో కలసి వారు రహదారుల పరిశీలన చేస్తారన్నారు. కొండ చరియలు విరిగిపడకుండా తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పిస్తారని వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

మరోవైపు పాక్షికంగా ధ్వంసమైన ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తయ్యే వరకు డౌన్ ఘాట్ రోడ్డులోనే వాహనాల రాకపోకలు అనుమతిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు బుక్ చేసుకొని వాహనాల ద్వారా తిరుమలకు వచ్చే భక్తులు భారీ వర్షాల దృష్ట్యా ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే ఆరు నెలల్లోగా దర్శనం తేదీ మార్పు చేసుకునే అవకాశం ఉందన్నారు. నడకదారిలో తిరుమలకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని