Published : 05/12/2021 02:07 IST

Tirumala: కొండ చరియలు విరిగిపడినా.. శ్రీవారే భక్తులను కాపాడారు: తితిదే ఈవో జవహర్‌రెడ్డి

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి మనందరినీ రక్షించి భక్త వత్సలుడని మరోమారు చాటి చెప్పారని తితిదే ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యల గురించి స్వామి వారు తమను హెచ్చరించారన్నారు. ఆఫ్కాన్‌ సంస్థ ఇంజినీరింగ్‌ నిపుణులు, తితిదే ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని, లింక్‌ రోడ్డును ఈవో పరిశీలించారు. 

ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఒకటో తేదీ తెల్లవారుజామున రెండ‌వ‌ ఘాట్ రోడ్డులోని భాష్యకార్ల సన్నిధి సమీపంలో భారీ బండరాయి పడి నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఘాట్ రోడ్డు తీవ్రంగా దెబ్బతింద‌న్నారు. ఈ ఘటన జరిగినప్పుడు వాహనాలు ఉన్నాయ‌ని, కానీ శ్రీవారి అనుగ్రహంతో ఎవరికీ చిన్న ప్రమాదం లేకుండా అందరినీ రక్షించినందుకు వేంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు తెలిపారు. 

అప్ ఘాట్ రోడ్డు పూర్తిగా త‌నిఖీ చేశామ‌ని, దిల్లీ ఐఐటీ ప్రొఫెస‌ర్లు క్షుణ్ణంగా అధ్యయనం చేశార‌ని చెప్పారు. అప్ ఘాట్ రోడ్డులో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తామ‌ని, అప్పటి వరకు అప్ ఘాట్ రోడ్డులో వాహ‌నాల‌ను అనుమ‌తించి లింక్ రోడ్డు ద్వారా మోకాళ్ళ మిట్ట నుంచి తిరుమ‌ల‌కు అనుమ‌తించ‌డం ద్వారా భ‌క్తుల‌కు అసౌక‌ర్యం త‌గ్గించిన‌ట్లు  ఈవో వివ‌రించారు. కేర‌ళ రాష్ట్రం కొల్లంలోని అమృత  విశ్వవిద్యాలయం నుంచి వరల్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ల్యాండ్‌ స్లైడ్ డిజాస్టర్ రిడక్షన్ కింద ప్రాజెక్ట్ చేస్తున్న పరిశోధక నిపుణుల బృందం  రెండ‌వ ఘాట్ రోడ్డును ప‌రిశీలించ‌నున్నట్టు చెప్పారు.

దిల్లీ ఐఐటి నిపుణులు, కొల్లం ల్యాండ్‌స్లైడ్స్ నిపుణుల బృందం నివేదికలు ప‌రిశీలించి, వారి సాంకేతిక స‌ల‌హాల‌తో త‌దుప‌రి చర్యలు తీసుకుంటామ‌న్నారు. కొండ‌చ‌రియ‌లు విరిగిన ప్రాంతంలో పున‌రుద్ధరణ ప‌నులు, భ‌విష్యత్తులో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా అత్యాధునిక శాస్త్ర ప‌రిజ్ఞానం ఉప‌యోగించుకొని డ్రోన్ల ద్వారా క్షుణంగా స‌మ‌గ్ర స‌ర్వే నిర్వహించి చర్యలు తీసుకుంటామ‌న్నారు. అప్ ఘాట్ రోడ్డులో చేయ‌వ‌ల‌సిన సివిల్ ప‌నులు, మట్టి బంధాన్ని మెరుగుపరచడం, పచ్చదనం పెంపొందించ‌డం, జీయో ఇంజినీరింగ్ వాడుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు. తితిదే ఇంజినీరింగ్‌ అధికారులకు, సిబ్బందికి ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇందుకోసం హిమాలయాలు, కేరళ, పశ్చిమ కనుమలలోని ప్రాంతాలు, సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగే ప్రదేశాలలో కొండచరియలు విరిగిపడకుండా నిరోధించడానికి ఉపయోగించిన సాంకేతికతపై వారికి శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. త్వరలో అధికారులతో చర్చించి పాపవినాశనం, ఆకాశగంగ మార్గాల్లో భక్తులను అనుమతిస్తామని ఈవో తెలిపారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని