Omicron vs Vaccines: రెండు డోసులతో.. ఒమిక్రాన్‌ నుంచి పాక్షిక రక్షణే..?

ఒమిక్రాన్‌ వేరియంట్‌పై రెండు డోసులతో లభించే రక్షణ పాక్షికమేనని తాజా అధ్యయనం వెల్లడించింది.

Updated : 15 Dec 2021 01:38 IST

ఆక్స్‌ఫర్డ్‌ నిపుణుల తాజా అధ్యయనం

లండన్‌: విస్తృత వేగంతో వ్యాపిస్తోన్న ఆందోళనకర వేరియంట్‌ ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. పలు దేశాల్లో ఈ వేరియంట్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే అందుబాటులో ఉన్న టీకాలు ఈ వేరియంట్‌ను ఏమేరకు ఎదుర్కొంటాయనే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌పై రెండు డోసులతో లభించే రక్షణ పాక్షికమేనని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా తక్కువ ప్రతినిరోధకాలను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇదివరకు ఇన్‌ఫెక్షన్‌ బారినపడి కోలుకున్న వారితోపాటు వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్‌తో ముప్పు పొంచివుందని బ్రిటన్‌ పరిశోధకుల తాజా అధ్యయనం హెచ్చరించింది.

ఇప్పటికే వాడుకలో ఉన్న వ్యాక్సిన్‌లు ఒమిక్రాన్‌ను ఎంతవరకు తటస్థీకరిస్తున్నాయనే విషయంపై యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ నిపుణులు అధ్యయనాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఫైజర్‌ లేదా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారి రక్త నమూనాలను తీసుకొని పరీక్షించారు. వీటివల్ల పొందిన యాంటీబాడీలు ఒమిక్రాన్‌ నుంచి పాక్షిక రక్షణ మాత్రమే ఇస్తున్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌తో ఆస్పత్రిలో చేరికలు, మరణాల ముప్పు తగ్గించిన ఈ వ్యాక్సిన్‌లు.. ఒమిక్రాన్‌ను మాత్రం తటస్థీకరించడంలో తక్కువ సామర్థ్యాన్ని కనబరుస్తున్నట్లు గుర్తించారు. అయితే, మూడో డోసు తీసుకున్న వారిలో మాత్రం మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని.. వీటి ఫలితాలు మరింత విశ్లేషించాల్సి ఉందని వెల్లడించారు. అయినప్పటికీ ఒమిక్రాన్‌ వల్ల ఇన్‌ఫెక్షన్‌ కేసులు అధికంగా ఉండనున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలలా వచ్చిపడుతోన్న ఈ వేరియంట్‌ ప్రవాహం నేపథ్యంలో బూస్టర్‌ డోసుల అవసరాన్ని తాజా అధ్యయన ఫలితాలు నొక్కి చెబుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, తీవ్ర వ్యాధి నుంచి ఏమేరకు రక్షణ కల్పిస్తాయనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్‌ల సామర్థ్యం విషయంలో మరికొన్ని వారాల్లోనే అర్థవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆస్ట్రాజెనెకా టీకా రూపకర్తల్లో ఒకరైన థెరిసా లాంబే స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌ వల్ల తీవ్ర వ్యాధి, ఆస్పత్రుల్లో చేరికలు లేదా మరణం ముప్పు నుంచి మాత్రం ప్రస్తుత వ్యాక్సిన్‌లు రక్షణ కల్పిస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొత్త రకాలకు మరో వ్యాక్సిన్‌ కావాల్సి వస్తే వాటిని వేగంగా రూపొందించేందుకు తమతో పాటు ఇతర వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏదేమైనా మన చేతిలో ఉన్న వ్యాక్సిన్‌ ఆయుధంతోనే మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లడమే ఉత్తమ మార్గమని డాక్టర్‌ లాంబే అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని