Third wave: కొవిడ్‌థర్డ్‌ వేవ్‌ గ్యారెంటీ.. మెజారిటీ ప్రజల మనోగతమిదే: సర్వే

దేశంలో మూడో వేవ్‌ అనివార్యమని అనేక మంది భారతీయులు భావిస్తున్నారట. వచ్చే మూడు నెలల్లో దేశంలో థర్డ్‌ వేవ్‌ వస్తుందని ముగ్గురిలో ఇద్దరు భారతీయులు భావిస్తున్నారని ఓ సర్వేలో తేలింది.....

Updated : 02 Jan 2022 04:39 IST

దిల్లీ: కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తితో దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే కేసులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో మూడో వేవ్‌ అనివార్యమని అనేక మంది భారతీయులు భావిస్తున్నారట. వచ్చే మూడు నెలల్లో దేశంలో థర్డ్‌ వేవ్‌ వస్తుందని ముగ్గురిలో ఇద్దరు భారతీయులు భావిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. లోకల్‌ సర్కిల్స్‌ (LocalCircles) అనే డిజిటల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫాం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

దేశవ్యాప్తంగా 377 జిల్లాల్లోని 37 వేల మందిపై ఓ సర్వే నిర్వహించినట్లు లోకల్‌ సర్కిల్స్‌ వెల్లడించింది. ఇందులో 68 శాతం పురుషులు, 32 శాతం మహిళలు పాల్గొన్నట్లు తెలిపింది. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో నిధుల మంజూరుపై ప్రభుత్వం తక్షణం దృష్టిసారించాలని, ప్రతి జిల్లాలో ఆరోగ్య సిబ్బందిని నియమించాలని 81 శాతం మంది పౌరులు అభిప్రాయపడినట్లు పేర్కొంది. అంకితభావంతో పనిచేసే పిల్లల ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ప్రతి జిల్లాలో ప్రారంభించాలని కోరినట్లు వెల్లడించింది.

ఈ సర్వేలో పాల్గొన్న ముగ్గురిలో ఇద్దరు దేశంలో కొవిడ్‌ మూడో దశ అనివార్యమన్నారు. కాగా థర్డ్‌ వేవ్‌ తీవ్రత ‘చాలా అధికంగా’ ఉంటుందని వీరిలో 20 శాతం మంది అభిప్రాయపడగా.. 43 శాతం మంది ‘అధికంగా’ ఉంటుందన్నారు. తీవ్రత తక్కువగానే ఉండనుందని 17 శాతం మంది పేర్కొనగా.. అసలు ఎలాంటి తీవ్రత ఉండబోదని  4 శాతం మంది వెల్లడించారు. డిసెంబర్‌ మొదటి వారంలోనూ లోకల్‌ సర్కిల్స్‌ ఇదే తరహా సర్వే నిర్వహించింది. అప్పుడు 38 శాతం మంది మాత్రమే మూడో వేవ్‌ వస్తుందని అభిప్రాయపడగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 63 శాతానికి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని