Ramappa temple: రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

కాకతీయ శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రామప్ప..

Updated : 25 Jul 2021 21:47 IST

వరంగల్‌: కాకతీయ శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. అత్యద్భుత శిల్ప సంపదకు చిరునామాగా నిలిచిన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో వర్చువల్‌గా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్‌ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవగా.. మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది.  ములుగు జిల్లా పాలంపేటలో క్రీ.శ.1213లో నిర్మితమైన అపురూప కట్టడం రామప్ప ఆలయం. శిల్పి రామప్ప పేరుతో ఈకాకతీయ కట్టడం ప్రాచుర్యంలోకి వచ్చింది.

చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, జలపాతాలు క్రీస్తుపూర్వం నుంచి తెలంగాణలో ఎన్నో ఉన్నా.. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు. తాజాగా రామప్ప ఆలయం ఆగుర్తింపు సాధించి కాకతీయ శిల్ప కళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. 2019లో రామప్ప ఆలయాన్ని సందర్శించిన యునెస్కో ప్రతినిధుల బృందం ఆ ప్రాంత పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కొన్ని ప్రతిపాదనలు చేసింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆ దిశగా 3 కీలక నిర్ణయాలు తీసుకుంది. రామప్ప దేవాలయానికి సమీపంలోని రెండు ఆలయాలను రామప్ప దేవాలయ ఆస్తి పరిధిలోకి తెచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంత పరిరక్షణకు ప్రత్యేక అభివృద్ధి అథారిటీ, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటుచేసింది.

యునెస్కో గుర్తింపుపై ప్రధాని హర్షం

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపిన ప్రధాని.. కాకతీయ వారసత్వానికి రామప్ప ఆలయం ప్రతీక అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ రామప్ప ఆలయాన్ని సందర్శించాలన్నారు. ఈ గుర్తింపు లభించిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతి.. తెలంగాణ వారసత్వ సంపదకు గొప్ప గుర్తింపు లభించిందన్నారు.

ఇది దేశం గర్వించదగిన క్షణం: అమిత్‌ షా

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు యావత్‌ దేశానికే గర్వించదగిన విషయమన్నారు. రామప్ప ఆలయ నిర్మాణం భారతీయ ఇంజినీరింగ్‌ నైపుణ్యానికి ప్రతీక అని.. భారతీయ హస్తకళకు చక్కటి ఉదాహరణ అని అన్నారు.

రామప్ప దేవాయలం విశేషాలు..

* కాకతీయుల రాజధాని వరంగల్‌ (ప్రస్తుతం ములుగు జిల్లా , పాలంపేట గ్రామం)లో కీ.శ.1213లో కాకతీయ గణపతి దేవుడి కాలంలో రేచర్ల రుద్రుడు.. రామప్ప ఆలయాన్ని నిర్మించారు.

* ఈ ఆలయంలో రామలింగేశ్వరుడు(ఏకశిల) ప్రధాన దేవుడు. ఆలయ గోపురాన్ని నీటిపై తేలియాడే ఇటుకలతో నిర్మించారు.

* ఆలయ నిర్మాణానికి నల్ల డోలోమైట్‌, గ్రానైట్‌, శాండ్‌స్టోన్‌ను వినియోగించారు. ఆలయం చుట్టూ ఉన్న మదనికలు కాకతీయ అద్భుత శిల్పకళా చాతుర్యానికి ప్రతీకలు.

* ఇప్పటి వరకు తెలంగాణలో హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌కు సాంస్కృతిక, వారసత్వ పరిరక్షణకు సంబంధించి ఆసియా పసిఫిక్‌ హెరిటేజ్‌ మెరిట్‌ అవార్డు లభించింది. తాజాగా ఇప్పుడు రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని