Delta variant: డెల్టాను సమర్థంగా ఎదుర్కొంటున్న టీకాలు..!

అమెరికాలో చేపట్టిన తాజా అధ్యయనంలో.. ప్రమాదకర డెల్టా వేరియంట్‌ను టీకాలు సమర్థంగానే ఎదుర్కొంటున్నట్లు తేలింది.

Updated : 14 Sep 2021 01:56 IST

అమెరికా అధ్యయనంలో వెల్లడి

వాషింగ్టన్‌: వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ కొత్త వేరియంట్ల రూపంలో పుట్టుకొస్తూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లపై టీకాలు పనిచేస్తున్నాయా లేదా అనే అంశంపై అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా అమెరికాలో చేపట్టిన తాజా అధ్యయనంలో.. ప్రమాదకర డెల్టా వేరియంట్‌ను టీకాలు సమర్థంగానే ఎదుర్కొంటున్నట్లు తేలింది. ముఖ్యంగా కొవిడ్‌ సోకిన వారికి ఆస్పత్రిలో చేరే ముప్పు నుంచి కూడా తప్పిస్తున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడికావడం ఊరట కలిగిస్తోంది.

కొత్త వేరియంట్‌లపై వ్యాక్సిన్‌ల పనితీరును తెలుసుకునేందుకు అమెరికా శాస్త్రవేత్తలు వాస్తవ సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో డెల్టా రకానికి చెందిన దాదాపు 32వేల కేసులను పరిగణలోకి తీసుకున్నారు. వీరిలో వ్యాక్సిన్‌ తీసుకున్న వారితో పోలిస్తే వ్యాక్సిన్‌ తీసుకోని వారికి ఆస్పత్రి చేరిక, ఎమర్జెన్సీ చికిత్స 5 నుంచి 7రెట్లు ఎక్కువగా అవసరం అయినట్లు గుర్తించారు. ఇప్పటివరకు అమెరికాలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లలో కొవిడ్‌ను నిరోధించడంలో మెడెర్నా అత్యధికంగా 95శాతం సమర్థత చూపిస్తున్నట్లు కనుగొన్నారు. ఇక ఫైజర్‌ 80శాతం, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ 60శాతం ప్రభావశీలత కలిగి ఉన్నట్లు వెల్లడించారు.

కొవిడ్‌-19ను నిరోధించడంలో వ్యాక్సిన్‌లు భిన్న సామర్థ్యాలు కలిగి ఉన్నప్పటికీ.. వైరస్‌ బారినపడిన తర్వాత ఆస్పత్రి చేరిక, అత్యవసర పరిస్థితులు ఏర్పడకుండా నిరోధించడంలో వ్యాక్సిన్‌లు సమర్థంగా పనిచేస్తున్నాయని అమెరికాలోని రీజెన్‌స్ట్రైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన నిపుణుడు షాన్‌ గ్రానీస్‌ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత వైరస్‌ బారినపడినా (బ్రేక్‌త్రూ) లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కొవిడ్‌ ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు ఎక్కువగా వ్యాక్సిన్‌ లేనివారిలోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మహమ్మారి పోరులో వ్యాక్సిన్‌లే శక్తివంతమైన ఆయుధాలని పేర్కొన్న గ్రానీస్‌.. అర్హత కలిగిన వారందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని