Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 24 Sep 2021 17:10 IST

1. హైకోర్టుకు హాజరైన ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌

నరేగా బిల్లుల చెల్లింపు అంశంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ హైకోర్టుకు హాజరయ్యారు. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుల్లో బకాయిలు లేవని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఉపాధి హామీ పనులపై విజిలెన్స్‌ విచారణ పెండింగ్‌లో లేదని సీఎస్‌ కోర్టుకు వెల్లడించారు. కాగా, ఈ కేసులో హైకోర్టు ఈనెల 29న తీర్పు వెలువరించనుంది.

ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

2. కేసీఆర్.. నియంతృత్వ పోకడలు వీడాలి: రఘునందన్‌

రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొన్నాయని.. వాటిపైన చర్చించేందుకు శాసనసభ సమావేశాలను నెల రోజుల పాటు నిర్వహించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్‌ మీడియాతో మాట్లాడారు. భాజపా ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి పిలవకపోవడం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వడమేనని వ్యాఖ్యానించారు. ఇకనైనా నియంతృత్వ పోకడలకు కేసీఆర్ మంగళం పాడి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని హితవు పలికారు.

హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలకు క్లబ్‌: బీఏసీ సమావేశంలో కేసీఆర్‌

3. తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణలో రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలు విడుదల చేశారు. ఎడ్‌సెట్‌లో 33,683 (98.53 శాతం) మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు చెప్పారు. ఉత్తీర్ణులైన వారిలో 25,983 మంది అమ్మాయిలు ఉన్నట్లు వెల్లడించారు. 

4. ఏపీ వదిలి తెలంగాణకు వస్తా: జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

‘‘నాగార్జునసాగర్‌లో జానారెడ్డి గెలవడం కష్టమని ముందే చెప్పా.. ఆయన ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక గురించి నాకు తెలియదు. రాజకీయాలు బాగోలేవు.. సమాజం కూడా బాగోలేదు. ఆంధ్రప్రదేశ్‌ను వదిలేసి తెలంగాణకు వస్తా. మేం తెలంగాణ వదిలిపెట్టి నష్టపోయాం. రాయల తెలంగాణ కావాలని నాడు జైపాల్‌రెడ్డిని అడిగితే ఒప్పుకోలేదు’’ అని తెదేపా నేత జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

5. యూపీలో పొత్తులపై భాజపా కీలక ప్రకటన

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై అధికార భాజపా కీలక ప్రకటన చేసింది. నిషద్‌ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగుతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు కేంద్రమంత్రి, యూపీ ఎన్నికల భాజపా ఇన్‌ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్‌, నిషద్‌ పార్టీ చీఫ్‌ సంజయ్‌ నిషద్‌లు లఖ్‌నవూలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని  అధికారికంగా ప్రకటించారు. 

6. బైడెన్‌ జీ.. మా రైతు సమస్యలపైనా దృష్టి పెట్టండి!

భారత ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దృష్టి సారించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు రైతు సంఘం నేత రాకేష్‌ టికాయిత్‌ విజ్ఞప్తి చేశారు. భారత ప్రధానితో జరిగే సమావేశంలో వీటిపై ప్రస్తావించాలని ట్విటర్‌లో పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీ.. నేడు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం కానున్న సందర్భంగా రాకేశ్‌ టికాయిత్‌ ట్విటర్‌లో ఈ విధంగా స్పందించారు.

7. ఆ హ్యాకింగ్‌తో మాకు సంబంధం లేదు..!

భారత్‌లో కీలక శాఖలపై జరిగిన సైబర్‌ దాడుల్లో చైనా హ్యాకర్ల పాత్ర లేదని బీజింగ్‌ తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. భారత్‌పై సైబర్‌ దాడుల విషయాన్ని వెల్లడించిన అమెరికన్‌ కంపెనీ నివేదికను శుద్ధ అబద్ధమని కొట్టిపారేసింది. ఇటీవల అమెరికాకు చెందిన ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌ ఏజెన్సీ .ఐఎన్‌సీ’ కంపెనీ మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది. 

8. తినడానికి, నిద్రపోవడానికే పుట్టలేదు.. నేనూ స్కూల్‌కెళ్లి చదువుకుంటా!

మగవారు మాత్రమే విద్యాసంస్థలకు హాజరు కావాల్సి ఉంటుందని తాలిబన్లు ప్రకటించిన నేపథ్యంలో అఫ్గాన్‌లో విద్యార్థులందరూ (అబ్బాయిలు, అమ్మాయిలు) కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అమ్మాయిలను కూడా తిరిగి చదువుకోవడానికి అనుమతించాలని డిమాండ్‌ చేశారు. తాజాగా మహిళలు చదువుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఓ అమ్మాయి భావోద్వేగంగా మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అయింది.

9. రోజంతా అదే జోరు.. 60వేల మార్కును నిలబెట్టుకున్న సెన్సెక్స్‌

ఆరంభంలోనే 60,000 పాయింట్ల ఎగువన ప్రారంభమై చరిత్ర సృష్టించిన సెన్సెక్స్‌ శుక్రవారం రోజంతా అదే జోరును కొనసాగింది. స్వల్పకాలం మినహా దాదాపు రోజంతా 60 వేల ఎగువనే ట్రేడింగ్‌ నమోదయ్యింది. నిఫ్టీ సైతం రికార్డు స్థాయి గరిష్ఠాల్లో పయనించింది. ఉదయం 60,158.76 పాయింట్ల వద్ద జోష్‌ మీద ప్రారంభమై సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 60,333 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.

10. అమెజాన్‌ సేల్‌ తేదీ వచ్చేసింది.. నెలరోజుల పాటు డీల్స్‌!

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ పండగ సేల్‌కు తెర తీసింది. ఏటా ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ పేరిట నిర్వహించే సేల్‌ తేదీలను తాజాగా ప్రకటించింది. అక్టోబర్‌ 4 నుంచి నెల రోజుల పాటు ఈ సేల్‌ నిర్వహించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రైమ్‌ మెంబర్లకు ముందుగానే డీల్స్‌ను అందుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని