Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Published : 02 Dec 2021 16:59 IST

1. భారత్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్‌ భారత్‌లోకి ప్రవేశించింది. భారత్‌లో ఈ కొత్త వేరియంట్‌ కేసులు నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ రెండు కేసులూ కర్ణాటకలో వెలుగుచూసినట్టు తెలిపింది. భారత్‌ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 29 దేశాల్లో ఇప్పటివరకు 373 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

2. TS: మాస్క్‌ ధరించకపోతే ₹1000 జరిమానా!

కరోనా కొత్త వేరియంట్‌ భయాలు వెంటాడుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కొవిడ్‌ కట్టడి చర్యలపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. గడప దాటి బయట అడుగుపెడితే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ధ్రువీకరణపత్రం ఉండాలని సూచించారు. అలాగే, ఈ రోజు నుంచి మాస్క్‌ ధరించకపోతే ₹1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

3. మరింత బలపడిన అల్పపీడనం

బంగాళాఖాతంలో అండమాన్‌ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈరోజు సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అది వాయుగుండంగా  మారే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ రేపటికల్లా తుపానుగా మారే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. 

4. రేపు, ఎల్లుండి పలు రైళ్లు రద్దు

ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలకు జవాద్‌ తుపాను ముప్పు పొంచి ఉంది. అండమాన్‌ వద్ద బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారిన నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దక్షిణ ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

5. నేనున్నాను.. ధైర్యంగా ఉండండి: సీఎం జగన్‌

ఇటీవల కురిసిన వర్షాలు, వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న గ్రామాల్లో ఏపీ సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని పులపుత్తూరులో బాధితులతో సీఎం మాట్లాడారు. గ్రామంలో తిరుగుతూ వారిని పరామర్శించారు. ఇళ్లు కోల్పోయిన వరద బాధితులు సీఎం వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. వరదలతో సర్వం కోల్పోయామని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని జగన్‌ను వేడుకున్నారు.

6. గద్వాల ఎమ్మెల్యే కుటుంబానికి సీఎం కేసీఆర్‌ పరామర్శ

సీఎం కేసీఆర్‌ గద్వాలలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి ఇటీవల మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. అనంతరం కృష్ణమోహన్‌రెడ్డి కుటుంబసభ్యులతో కేసీఆర్‌ మాట్లాడారు. 

7. కాంగ్రెస్‌ 300 సీట్లలో గెలవడం కష్టమే..: గులాంనబీ ఆజాద్‌

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (2024) కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి రావడం కష్టమేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి  గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. 300లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్‌ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. 

8. దిల్లీలో రేపటి నుంచి పాఠశాలలు మూసివేత

వాయు కాలుష్య సంక్షోభంలో చిక్కుకున్న దిల్లీలో శుక్రవారం నుంచి పాఠశాలలు మూసివేయనున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలు మూసి ఉంటాయని దిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్ గురువారం వెల్లడించారు. కాలుష్య పరిస్థితుల్లో వాటిని తిరిగి తెరవడంపై ఈ రోజు దిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మూడు నాలుగు సంవత్సరాల పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. కానీ పెద్దలు ఇంటినుంచి పనిచేస్తున్నారు’ అంటూ మందలించింది. 

9. వరుసగా రెండో రోజూ లాభాలే..!

మొన్నటి దాకా భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొద్దీగా కుదుట పడ్డాయి. నిన్న మార్కెట్లో జోరు ప్రదర్శించిన బుల్‌.. ఇవాళ కూడా అదే జోష్‌ను కొనసాగించింది. మార్కెట్‌ ముగిసేసరికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 776 పాయింట్లు లాభపడి 58,461 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 234 పాయింట్లు లాభపడి 17,401 దగ్గర స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.99గా ఉంది. 

10. ఒమిక్రాన్‌ వైరస్‌ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటన ఆలస్యం?

టీమ్ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇటీవల అక్కడ ఒమిక్రాన్‌ వేరియంట్‌ బయటపడటంతో ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో టోర్నీని కొన్ని రోజులు వాయిదా వేయాలని బీసీసీఐ తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డును కోరిందని తెలిసింది. ఈనెల 17 నుంచి జనవరి 26 వరకు ఇరు జట్లూ.. జోహెనస్‌బర్గ్‌, సెంచూరియన్‌, కేప్‌టౌన్‌, పార్ల్‌ వేదికల్లో మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడాల్సిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని