Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 26 Jul 2021 17:12 IST

1. గ్రామ సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్‌ కావాలంటే ఆ పరీక్ష పాసవ్వాల్సిందే!

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ కావాలంటే డిపార్టుమెంట్ పరీక్ష తప్పక పాస్ కావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఐఎఎస్‌లు సహా అన్ని విభాగాల ఉద్యోగులకూ మొదట్నుంచీ ఈ విధానమే అమలవుతోందన్నారు. గ్రామవార్డు  సచివాలయాల్లో నియమితులైన వారిలో ఎవరి ఉద్యోగాలూ పోవని హామీ ఇచ్చారు.

2. కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు నూతన రేషన్‌పత్రాలను అందజేశారు. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ఇందులో భాగంగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన ఆహార భద్రతా కార్డులను ఇస్తున్నట్లు చెప్పారు. 

మంత్రి జగదీశ్‌రెడ్డి-ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం

3. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదు: కేంద్రం

విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో పునరాలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్‌సభలో వైకాపా ఎంపీ మాధవ్‌ ప్రశ్నకు కేంద్ర మంత్రి భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని గత కొన్ని నెలలుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

4. రూ.లక్ష రుణమాఫీ తక్షణమే చేయాలి: రేవంత్‌

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. వారం రోజులుగా రాష్ట్రంలో కురిసిన  భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఎకరాకు రూ.15 వేల చొప్పున చెల్లించాలని కోరారు. విత్తనాలు, ఎరువులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలన్నారు.

5. నాలుగు సార్లు సీఎం.. కానీ ఎన్నడూ ఐదేళ్లు ఉండలేదు
‘పదవిలో ఉన్న ప్రతిక్షణం అగ్నిపరీక్షను ఎదుర్కొన్నా’’.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ముందు యడియూరప్ప భావోద్వేగభరితంగా చెప్పిన మాటలివి. నిజమే.. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగడం అంతకంటే పెద్ద సవాలే. 

Karnataka: తదుపరి సీఎం ఎవరు.. రేసులో పలువురి పేర్లు

6. అమెరికాకు దీటుగా బదులిచ్చిన భారత్‌

మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో భారత్‌ సాధించిన విజయాలు దేశానికే గర్వకారణమని కేంద్రం తెలిపింది.  భారత్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలపై ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికా ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలకు భారత్‌ దీటుగా బదులిచ్చింది. జులై 27న భారత్‌కు రానున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఈ అంశాలను లేవనెత్తనున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్రం స్పందించింది.

పాక్‌కు చివరికి అవమానమే మిగిలింది..!

7. టిబెట్‌ పీఠభూమిలో 15వేల ఏళ్లనాటి వైరస్‌లు

ఇప్పటివరకూ తెలియని పురాతన వైరస్‌లను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి 15వేల సంవత్సరాల నాటివని తేల్చారు. టిబెట్‌ పీఠభూమిపైన ఉన్న ఒక హిమానీనదంలోని మంచు నమూనాల్లో ఇవి వెలుగు చూశాయి. పశ్చిమ చైనాలో 22వేల అడుగుల ఎత్తులో ఉన్న గులియా మంచు పర్వతం నుంచి శాస్త్రవేత్తలు రెండు మంచు కోర్‌ నమూనాలను సేకరించారు. శిఖారాగ్రం నుంచి 1,017 అడుగుల లోతులో వీటిని తీసుకొని, పరిశీలన జరిపారు.

8. Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ఊగిసలాటతో ప్రారంభమైన సూచీలు ఓ దశలో లాభాల్లోకి జారుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ నుంచి లభించిన మద్దతును రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నష్టాలు తగ్గించాయి. దీంతో సూచీలు తిరిగి నష్టాల్లోకి జారుకొని ఇంట్రాడే కనిష్ఠాల్ని నమోదు చేశాయి. 

9. Tollywood: ఈవారం విడుదలయ్యే సినిమాలివే!

చాలా కాలంగా థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మిస్‌ అవుతున్న సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడు సినిమాలు విడుదలవుతాయా? అని ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తగ్గట్టుగానే సినిమాలూ విడుదలకు సై అంటున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో మరికొన్ని సినిమాలు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

10. మీరాబాయి రజతం.. స్వర్ణంగా అప్‌గ్రేడ్‌ కానుందా?

మీరాబాయి చాను.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత కీర్తిపతాకను రెపరెపలాడించిన అథ్లెట్‌. మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ 49 కిలోల పోటీల్లో ఆమె రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. కరణం మల్లీశ్వరి తర్వాత దేశానికి పతకం అందించింది. అనూహ్య పరిణామాలు జరిగితే ఆమె పతకం వెండి నుంచి బంగారానికి అప్‌గ్రేడ్‌ కానుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని