Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 24 Aug 2021 17:09 IST

1. Ap High Court: విచారణ పూర్తయ్యే వరకు ఉన్నతాధికారులు కోర్టుకు హాజరు కావాల్సిందే

జాతీయ ఉపాధి హామీ పెండింగ్‌ బిల్లులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే రూ.400 కోట్లు చెల్లించామని, మరో రూ.1100 కోట్లు వారం రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కోర్టు విచారణకు హాజరైన ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, ఎస్.ఎస్‌ రావత్‌.. పంచాయతీల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్టు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... గుత్తేదారులకు సొమ్ము చెల్లించి ఆ వివరాలు హైకోర్టుకు నివేదించాలని ఆదేశించింది. 

బంగాళాఖాతంలో భూకంపం.. ఏపీలో పలుచోట్ల ప్రకంపనలు

2. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. ఈ నెల 27న జరగాల్సిన బోర్డు సమావేశాన్ని సెప్టెంబర్ 1కి వాయిదా వేశారు. 27వ తేదీన జరగాల్సిన 14వ సమావేశం ఎజెండాను గతంలోనే ఖరారు చేసిన బోర్డు.. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సమాచారం అందించారు. రెండు రాష్ట్రాలకు చెందిన పలు అంశాలు, గెజిట్ నోటిఫికేషన్ పరిధి సంబంధిత అంశాలను ఎజెండాలో చేర్చారు. 

3. కేసీఆర్‌ దత్తత గ్రామంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధం: రేవంత్‌రెడ్డి

మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో దీక్షలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడారు.  కేసీఆర్‌ దత్తత గ్రామంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. మూడుచింతలపల్లిలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించారో ఇంటింటికీ తిరుగుదాం వస్తారా అంటూ తెరాస నేతలను నిలదీశారు. గ్రామంలో 57 ఏళ్లు నిండిన వారిలో ఎంతమందికి పింఛను ఇచ్చారని ప్రశ్నించారు.

ఆత్మగౌరవంతో బతకాలంటే కాంగ్రెస్‌కు మద్దతివ్వండి: భట్టి

4. బాక్సైట్‌ అక్రమ మైనింగ్‌ దందాను జగన్‌ అండ్‌ కో నిలిపివేయాలి: లోకేశ్‌

ఆదివాసులకు రక్షణగా ఉన్న చట్టాలను జగన్‌ ప్రభుత్వం కాలరాస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. రంపచోడవరం ఐటీడీఏ తీరుపై ఉద్యమిస్తున్న గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపడం దారుణమని మండిపడ్డారు. చర్చల పేరుతో ఆహ్వానించి, పోలీసులతో నిర్బంధించి, నేరం చేసిన వాళ్లలా నేలపై గిరిజన ప్రతినిధుల్ని కూర్చోబెట్టి తీవ్రంగా అవమానించడం జగన్‌ అధికార దర్పానికి పరాకాష్ట అని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

5. ఉద్యోగాల భర్తీ కోరుతూ.. ప్రగతి భవన్‌ ముట్టడికి నిరుద్యోగుల యత్నం

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డివైడర్ మధ్యలో ఉన్న గ్రిల్స్ ఎక్కి మరీ ప్రగతి భవన్ వైపు విద్యార్థి, యువజన సంఘ నేతలు పరుగులు తీయడంతో పోలీసులు అడ్డుకున్నారు.

హుజూరాబాద్‌కు మూడో విడత నిధులు మంజూరు

6. ‘చెంపదెబ్బ’ వ్యాఖ్యలు.. కేంద్రమంత్రి రాణే అరెస్టు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ రాణేను పోలీసులు అరెస్టు చేశారు. సీఎంకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని, అలాంటి వ్యక్తి చెంప పగలగొట్టాలని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు గానూ ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 

7. అఫ్గానిస్థాన్‌లో ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌!

కల్లోలిత అఫ్గానిస్థాన్‌ నుంచి తమ దేశ పౌరులను తీసుకెళ్లేందుకు వచ్చిన ఉక్రెయిన్‌ విమానం ఒకటి హైజాక్‌కు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలతో వచ్చి ఈ విమానాన్ని కాబుల్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఇరాన్‌ తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్‌ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్‌జెనీ యెనిన్‌ తెలిపారు. 

8. ఛత్తీస్‌గఢ్‌లో నాయకత్వ మార్పు ఉంటుందా?

ఛత్తీస్‌గఢ్‌లో రొటేషన్‌ ఫార్ములాలో భాగంగా ముఖ్యమంత్రి పదవిని తనకు అప్పగించాలంటూ ఓ మంత్రి డిమాండ్‌ చేయడం ఆ రాష్ట్ర కాంగ్రెస్‌లో విభేదాలకు కారణమయ్యింది. దీంతో ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌, ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్‌సింగ్‌ డియో వ్యవహారం దిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి పీఠంపై వాదన వినిపించేందుకు ఇరువురు నాయకులు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.

9. వరుసగా రెండోరోజూ కొనసాగిన లాభాల జోరు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజైన మంగళవారమూ లాభాలతో ముగిశాయి. లోహ, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు రాణించడం ఇందుకు దోహదం చేసింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 18.5 శాతంగా ఉండనుందన్న ఎస్‌బీఐ అంచనాలు కూడా మార్కెట్‌ సెంటిమెంటును బలోపేతం చేశాయి.

క్వారంటైన్‌లోకి మరియప్పన్‌ తంగవేలు.. పతాకధారిగా టెక్‌ చంద్

10. ముంబయి మేయర్‌ అభ్యర్థిగా సోనూసూద్‌.. స్పందించిన నటుడు!

రాబోయే ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థిగా సోనూసూద్‌ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ సెలబ్రిటీలని రంగంలోకి దించుతోందని ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ జాబితాలోని ముగ్గురిలో ఒకరిని మేయర్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించే అవకాశం ఉందని వినికిడి. అయితే, ఈ ఊహాగానాలపై నటుడు సోనూ క్లారిటీ ఇచ్చాడు. ఆ వార్తల్లో వాస్తవం లేదని, సామాన్యుడిగా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు