Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Published : 25 Sep 2021 17:01 IST

1. రేవంత్‌ తప్పేమి లేదు..తప్పంతా నాదే: జగ్గారెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యల్లో రేవంత్‌ తప్పు లేదని.. తప్పంతా తనదేనని ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఒప్పుకొన్నారు. నిన్న తాను మీడియా ముందు వచ్చి నేరుగా మాట్లాడటం తప్పని.. తన తప్పును ఒప్పుకొని పార్టీకి క్షమాపణ చెప్పారు. రేవంత్‌రెడ్డి, తాను అన్నదమ్ముల్లాంటి వాళ్లమని తెలిపారు. 

హెచ్‌ఎండీఏ పరిధి పెరిగే అవకాశం: మంత్రి తలసాని

2. ఖాకీ డ్రెస్‌లో సేవ చేయాల్సింది ప్రజలకి : రామ్మోహన్‌ నాయుడు

ఏపీలో డ్రగ్స్‌ మాఫియా నడుస్తోందని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నారో డీజీపీ తేల్చాలని డిమాండ్‌ చేశారు. తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏం అంశంపై అయినా తెదేపా సాక్ష్యాధారాలతో మాట్లాడుతుందని.. ఈ విషయాన్ని డీజీపీ గుర్తుంచుకోవాలన్నారు.

3. తెలంగాణ వచ్చి ఏడేళ్లయినా క్రీడా పాలసీ లేదు: రఘునందన్‌

తెలంగాణ ఆవిర్భవించి ఏడేళ్లయినా ఇంత వరకూ రాష్ట్రానికి క్రీడా పాలసీ లేదని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్టేడియాలను ప్రైవేటు వ్యాపార సంస్థలకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గచ్చిబౌలి స్టేడియాన్ని టిమ్స్‌కు ఇవ్వడాన్ని భాజపా వ్యతిరేకిస్తోందని చెప్పారు.

4. దేశ ప్రయాణంలో మీదే కీలక పాత్ర

సివిల్ సర్వీస్‌ పరీక్షలో ర్యాంకులు సాధించి విజేతలుగా నిలిచిన అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ‘మీరంతా ప్రతిభావంతులు. మరికొన్నిసార్లు ప్రయత్నించే వీలుంది. అలాగే భారత్ అనేక విభిన్న అవకాశాలకు నెలవు. వాటిని అన్వేషించడానికి వేచి చేస్తోంది. మొత్తానికి మీరు విధించుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు. 

5. అఫ్గాన్‌ గడ్డ.. ఉగ్రవాదుల అడ్డాగా మారొద్దు!

అఫ్గానిస్థాన్‌లో పాలనను చేజిక్కించుకున్న తాలిబన్లు.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని భారత్‌, అమెరికా సూచించాయి. మహిళలు, చిన్నారులు సహా పౌరుల హక్కులను గౌరవించాలని హితవు పలికాయి. అఫ్గాన్‌ను ఉగ్రవాదుల శిక్షణకు స్థావరంగా మార్చొద్దని తేల్చి చెప్పాయి. ఇతర దేశాలకు ముప్పు తలపెట్టే శక్తులకు అఫ్గాన్ భూభాగాన్ని కేంద్రంగా మార్చొద్దని సూచించాయి. 

6. భారత్‌కు యూఎన్‌ఎస్సీలో శాశ్వత సభ్యత్వం ఉండాలి: బైడెన్‌

ప్రపంచ శాంతిలో కీలక పాత్ర పోషిస్తున్న భారత్‌కు ‘ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్సీ)’లో శాశ్వతసభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. తాజాగా ఈ ప్రతిపాదనపై అమెరికా సైతం సానుకూలంగా స్పందించింది. స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ భారత్‌కు శాశ్వతసభ్యత్వం ఉండాలని ఉద్ఘాటించినట్లు విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు. 

7. ఈ బక్క పల్చని అమ్మాయి.. పాక్‌ నోరు మూయించింది..!

‘పాకిస్థాన్.. తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకొంటోంది.. కానీ ఆ దేశం ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తోంది.. అమెరికా జంట భవనాలపై ఉగ్రదాడికి పాల్పడిన ఒసామా బిన్‌లాడెన్‌కు ఆశ్రయమిచ్చింది.. తనవైపు ఇన్ని తప్పులు పెట్టుకొని అంతర్జాతీయ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేస్తోంది’.. అంటూ పదునైన వ్యాఖ్యలతో పాకిస్థాన్‌కు ఐరాస వేదికగా దిమ్మతిరిగిపోయే బదులిచ్చింది మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన స్నేహా దూబే.

8. ప్రియురాలితో విడిపోయిన ఎలాన్‌ మస్క్‌!

టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ తన ప్రియురాలితో విడిపోయారా? మూడేళ్ల తమ బంధానికి స్వస్తి పలికాడా? అనే ప్రశ్నకు అంతర్జాతీయ మీడియా అవుననే అంటోంది. 2018 నుంచి గ్రైమ్స్‌ అనే యువతితో ఎలాన్‌ మస్క్‌ డేటింగ్‌లో ఉన్నాడు. వారికి ఏడాది వయసు గల కుమారుడు ఉన్నాడు. కాగా ఈ జంట విడిపోయినట్లు ‘పేజ్‌ సిక్స్‌’ అనే వార్తా సంస్థ వెల్లడించింది.

9. టిప్పు దోచేయడం తప్పు.. త్వరలో యూకే చట్టం 

‘నగదు మారకం వద్దు.. ఈ-కామర్స్‌ (ఆన్‌లైన్‌ చెల్లింపులు) ముద్దు’ అంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారం బ్రిటన్‌లో కార్మికుల కడుపు కొడుతోంది. దేశంలో 80 శాతం బిల్లులు కార్డుల ద్వారానే (టిప్పుతో కలిపి) చెల్లిస్తున్నారు. రెస్టారెంట్లు, కేఫ్‌లు, పబ్బుల యజమానులు చాలామంది ఈ టిప్పులను తిరిగి కార్మికులకు ఇవ్వడం లేదని ఇటీవల చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది.

10. ‘కోహ్లీ జట్టులో ఏదో సమస్య ఉంది’

విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో ఏదో సమస్య ఉందని, లేకపోతే ఇలా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అంత మంచి ఆరంభం దక్కినా ఓటమిపాలవ్వడం సరికాదని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ విశ్లేషించాడు. శుక్రవారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడిన మ్యాచ్‌లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని