Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 26 Sep 2021 21:07 IST

1. ‘గులాబ్‌’ తుపాను పరిస్థితిపై జగన్‌తో మాట్లాడిన ప్రధాని

‘గులాబ్‌’ తుపాను పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్‌లో తుపాను పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుంచి సహాయాన్ని తక్షణం అందేటట్లు చూస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అందరూ క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ప్రధాని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

2. మాకు పవన్‌కల్యాణ్‌.. సంపూర్ణేశ్‌బాబు ఇద్దరూ ఒకటే!

ప్రతిదీ పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎలా తప్పు అవుతుందని ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ ప్రశ్నించారు. ‘రిపబ్లిక్‌’ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక సందర్భంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో అనిల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా ఒకటేనని, పేర్కొన్నారు.

3. ‘గులాబ్‌’ ఎఫెక్ట్‌.. పలు రైళ్లు రద్దు

బంగాళాఖాతంలో ‘గులాబ్‌’ తుపాను దృష్ట్యా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఒడిశా నుంచి రాకపోకలు సాగించే రైళ్లను నేడు, రేపు రద్దు చేసినట్లు ప్రకటించింది. దీంతో పాటు కొన్నింటిని పాక్షికంగా రద్దు చేశామని.. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు తెలిపింది. వీటిలో భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌, భువనేశ్వర్‌-తిరుపతి తదితర రైళ్లు ఉన్నాయి. 

4. కోర్టుల్లో దసరా తర్వాత ప్రత్యక్ష విచారణ: సీజేఐ

దసరా తర్వాత కోర్టుల్లో ప్రత్యక్ష విచారణ ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మహిళా న్యాయవాదుల ఆధ్వర్యంలో ఇవాళ దిల్లీలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సీజేఐ మాట్లాడారు. ‘‘ లా కళాశాలల్లో మహిళకు రిజర్వేషన్లు కల్పించాలి. మహిళలంతా ఐక్యంగా ఉండాలి. కోర్టుల్లో మహిళా న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని’’ అని జస్టిస్‌ ఎన్వీరమణ అన్నారు.

5. ఎన్నికల వేళ.. యూపీ కేబినెట్‌ విస్తరణ..?

పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని వర్గాల వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఆయా రాష్ట్రాలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కేబినెట్‌ విస్తరణకు సిద్ధమైంది. దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మధ్యే కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన జితిన్‌ ప్రసాదకు కేబినెట్‌లో స్థానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

6. భారత్‌ చేరుకున్న మోదీ

మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భారత్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి నడ్డాతో సహా పార్టీకి చెందిన పలువురు నేతలు ఆయనకు స్వాగతం పలికారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మోదీ వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంతోపాటు క్వాడ్‌ సదస్సులో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే.

7. పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలకు మోహన్‌బాబు కౌంటర్‌

రిపబ్లిక్‌ ప్రీ రిలీజ్‌ వేడుకలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై సీనియర్‌ నటుడు మోహన్‌బాబు స్పందించారు. ‘నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్‌కల్యాణ్‌ నువ్వు నాకంటే చిన్నవాడివి. అందుకని ఏకవచనంతో సంభోదించాను. పవన్‌కల్యాణ్‌గారు అనడంలో కూడా తప్పేమీలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్‌. సంతోషమే. ఇప్పుడు ‘మా’ ఎలక్షన్స్‌ జరుగుతున్నాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకి సమాధానం చెబుతా’ అని ట్వీట్‌ చేశారు.

8. ఒక రోజు ముందే అమెజాన్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ విక్రయాలు

 ఏటా పండుగ సీజన్‌లో ప్రత్యేక విక్రయాలు చేపట్టే ఈ-కామర్స్‌ సంస్థలు.. ఈసారి నిర్వహణ తేదీల్లో పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ ఏటా నిర్వహించే ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ను అక్టోబరు 7-10 తేదీల్లో నిర్వహించనున్నట్లు తొలుత ప్రకటించింది. దీంతో వినియోగదారులను ముందుగానే ఆకట్టుకునే ఎత్తుగడతో అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ను అక్టోబర్‌ 4న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 

9. ఆకాశం నుంచి జారిపడ్డ ‘స్వర్ణశిల’

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా వశి తాలుకాలో ఆకాశం నుంచి అరుదైన రాయి కింద పడింది. స్థానిక రైతు ప్రభు నివృతి మాలి శుక్రవారం ఉదయం 6.30 గంటలకు పొలంలో పని చేసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఈదురు గాలుల మధ్య భారీ శబ్దంతో ఓ రాయి ఆయనకు ఎనిమిది అడుగుల దూరంలో పడింది. వెంటనే తహసీల్దార్‌ నర్సింగ్‌ జాదవ్‌కు ప్రభు సమాచారం ఇచ్చారు.

10. పవన్‌కల్యాణ్‌ మాటల్లో వాస్తవం ఉంది: నేచురల్‌ స్టార్‌ నాని

తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు వాస్తవమని నటుడు, నేచురల్‌స్టార్‌ నాని అన్నారు. శనివారం సాయంత్రం ‘రిపబ్లిక్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను సమర్ధించిన నాని తాజాగా ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని