Updated : 29 Sep 2021 17:00 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

1. విలీనానికి అంగీకరించని పాఠశాలలకు గ్రాంటు నిలిపివేస్తారా?: హైకోర్టు

ఏపీలో ఎయిడెడ్‌ పాఠశాలల విలీన ప్రక్రియ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వాడేపు చినవీరభద్రుడు విచారణకు హాజరయ్యారు. విలీనానికి అంగీకరించని పాఠశాలలకు గ్రాంటు నిలిపివేస్తారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంపై యాజమాన్యాలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని.. గ్రాంట్‌ కూడా నిలిపివేయమని చినవీరభద్రుడు కోర్టుకు వివరించారు. 

డిగ్రీ ప్రశ్నా పత్రం లీక్.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌

2. కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదు: పవన్‌ కల్యాణ్‌

కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ నేతలతో భేటీ అనంతరం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు.  వైకాపా  గ్రామ సింహాల ఘోంకారాలు సహజం.. జనసైనికుల సింహ గర్జనలు సహజం అని వ్యాఖ్యానించారు.

3. ఏడేళ్లలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించారు?: బండి సంజయ్‌

తెరాస అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో రెండు పడక గదుల ఇళ్లు ఎన్ని నిర్మించారని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. అందులో పేదలకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో లెక్కలు చెప్పగలరా అని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 2018 ఎన్నికల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల హామీని అందులో ప్రస్తావించారు. సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షల నుంచి రూ.6లక్షల ఆర్థికసాయం మాట ఏమైందని ప్రశ్నించారు.

4. రహదారులు నిర్మించలేని స్థితిలో ఏపీ సర్కార్‌: సోము వీర్రాజు

రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.2వేల కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన రహదారుల నిర్మాణాలనూ చేపట్టలేని స్థితిలో ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వేల కోట్ల రూపాయల జాతీయ రహదారులు, సడక్‌ యోజన పథకం కింద గ్రామాల్లో చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణాలపై బహిరంగ చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. 

5. నాది కృష్ణుడి పాత్ర... విష్ణు రథం ఎక్కుతున్నా : నరేశ్‌

‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) మసకబారింది అన్నప్పుడు నేను ఎన్నికల్లో నిలబడ్డా. జాయింట్‌ సెక్రటరీగా గెలిచా’ అని సీనియర్‌ నటుడు, ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌ అన్నారు. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తోన్న మంచు విష్ణు, అతని ప్యానల్‌తో కలిసి నరేశ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘మా అధ్యక్షుడిగా విష్ణు సరైనవాడు. నాది కృష్ణుని పాత్ర. ‘మా’ కోసం మంచు విష్ణు రథం ఎక్కుతున్నాను. విష్ణుకి నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా’’ అని నరేశ్‌ చెప్పారు.  

6. కాలుష్య కారకం కాని టపాసులు ఉన్నాయా?

కొంతమందికి ఉపాధి దొరుకుతుందన్న ముసుగులో.. ఇతరుల జీవించే హక్కును కాలరాయడం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అమాయక పౌరుల జీవించే హక్కును పరిరక్షించడంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించామని పేర్కొంది. బాణసంచాపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. 

7. జపాన్‌ నూతన ప్రధానిగా ఫ్యుమియో కిషిదా..!

జపాన్‌ ప్రధానమంత్రిగా ఉన్న యోషిహిడే సుగా బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన ప్రధానిమంత్రి అభ్యర్థి ఎంపిక చేపట్టారు. జపాన్‌ మాజీ విదేశాంగ మంత్రి ఫ్యుమియో కిషిదా ఇందులో విజయం సాధించారు. వచ్చే వారం ఆయన జపాన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

8. యెమన్‌లో అంతర్యుద్ధం.. 130 మందికి పైగా మృతి

యెమన్‌ రాజధాని సనాలో ప్రభుత్వ బలగాలకు, హౌతి తిరుగుబాటు దళాలకు మధ్య గత రెండు రోజులుగా జరుగుతున్న భీకర అంతర్యుద్ధంలో 130 మందికి పైగా మృతిచెందారు. యెమన్‌లో ఏళ్లతరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధంలో కాల్పుల విరమణ ప్రకటించేలా అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు జాతీయ భద్రతా సలహాదారు అయిన జేక్‌ సలివన్‌ రాకుమారుడైన మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో భేటీకి సౌదీ అరేబియాకు వెళ్లారు.  దీంతో యెమన్‌లో అంతర్యుద్ధాలు మరింత రాజుకున్నాయి.

9. అఫ్గాన్‌కు విమానాలు నడపండి.. భారత్‌కు తాలిబన్ల లేఖ

అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ల ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం భారత్‌తో అధికారిక సంప్రదింపులు జరిపింది. రెండు దేశాల మధ్య కమర్షియల్‌ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని భారత్‌ను కోరింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్(డీజీసీఏ)కు అఫ్గాన్‌ పౌరవిమానయాన శాఖ లేఖ రాసింది. ఈ లేఖను భారత పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సమీక్షిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

10. కెప్టెన్సీపై కోహ్లీ నిర్ణయం.. బీసీసీఐ కోశాధికారి ఏమన్నారంటే?

కోహ్లీ ప్రవర్తన బాగోలేదని, భారత జట్టుకు టీ20 కెప్టెన్‌గా తొలగించాలని పలువురు సీనియర్లు బీసీసీఐని కోరినట్లు వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశాడు. కోహ్లీ జట్టును బాగా నడిపిస్తున్నాడని, అలాంటప్పుడు తామెందుకు అతడిని తప్పుకోవాలని ఒత్తిడి తెస్తామని ఎదురు ప్రశ్నించాడు. అతడిని తప్పుకోవాలని బీసీసీఐ కోరలేదని వివరించాడు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని