Top Ten news @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 01 Oct 2021 17:02 IST

1. తెలంగాణలో ‘హరిత నిధి’ ఏర్పాటుకు యోచన: సీఎం కేసీఆర్‌

తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని.. అందుకు తెరాస ప్రజాప్రతినిధులు అంగీకరించారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. హరితహారంపై చర్చలో భాగంగా సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడారు. హరిత నిధిని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని సీఎం సభ్యులను కోరారు. అంతేకాకుండా హరితనిధి ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రతి నెల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హరితనిధికి రూ.500 జమ చేస్తారని కేసీఆర్‌ చెప్పారు. 

 

 

2. కృష్ణా బ్యారేజ్‌ల నిర్మాణంపై దృష్టిపెట్టాలి: జగన్‌

జలవనరులశాఖపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. పోలవరానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు వెంటనే వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రం చేస్తున్న ఖర్చు ఎప్పటికప్పుడు రీయంబర్స్‌ అయ్యేలా చూడాలన్నారు. కాఫర్‌డ్యాం పనులు పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. తాండవ విస్తరణ, కృష్ణా నదిపై బ్యారేజ్‌ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని జగన్‌ చెప్పారు. 

మంత్రులను కాదని సీఎం జోక్యం చేసుకోవడమేంటో!: సీతక్క

3. గడ్డి అన్నారం మార్కెట్‌ తరలింపు.. ఈనెల 4వరకు యథాతథ స్థితి..: హైకోర్టు

గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 4 వరకు యథాతథ స్థితి కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.  మార్కెట్‌ను బాటసింగారం తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఫ్రూట్‌ కమీషన్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

4. బ్యాంక్‌ అధికారులను విచారించిన సీసీఎస్‌ పోలీసులు

తెలుగు అకాడమీలో జరిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్యవహారంపై పలువురు బ్యాంక్‌ అధికారులను సీసీఎస్‌ పోలీసులు విచారిస్తున్నారు. యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మస్తాన్‌ వలి, చందానగర్‌ కెనరా బ్యాంక్‌ మేనేజర్‌లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డిపాజిట్ల గోల్‌మాల్‌లో ఎవరి హస్తం ఉందనే దానిపై బ్యాంకు అధికారుల నుంచి ఆరా తీస్తున్నారు. 

5. మళ్లీ నోరుపారేసుకున్న డ్రాగన్‌.. దీటుగా బదులిచ్చిన భారత్‌

వాస్తవాధీన రేఖను దాటి వచ్చి తమ భూభాగాన్ని ఆక్రమిస్తోందంటూ చైనా చేసిన ఆరోపణలపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. డ్రాగన్‌ కవ్వింపు చర్యలు, ఏకపక్ష నిర్ణయాల వల్లే సరిహద్దుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని దుయ్యబట్టింది. రెండు దేశాల సరిహద్దుల వెంట చైనా సైన్యమే నిరంతరంగా భారీ మోహరింపులకు దిగుతోందని, దానికి ప్రతిస్పందనగానే భారత దళాలు అప్రమత్తమయ్యాయని తెలిపింది. 

6. సైన్యం ఆధునికీకరణకు పురాతన విధానాలే అవరోధం

మన దేశ మిలిటరీ ఆధునికీకరణకు పురాతన కొనుగోలు విధానాలు అవరోధంగా నిలుస్తున్నాయని, వాటిని తక్షణమే విడనాడి ఆధునిక విధానాలను అనుసరించాల్సి ఉందని సైన్యాధిపతి జనరల్‌ నరవణే అభిప్రాయపడ్డారు. తక్కువ రేటుకు టెండర్లు వేసి ఎల్‌1గా నిలిచిన వారిని ఎంపిక చేయడమనేది వలస పాలకుల నాటి భావనగా పేర్కొన్నారు.

7. కొవిషీల్డ్‌ను గుర్తించిన ఆస్ట్రేలియా

భారత్‌లో అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్‌’ టీకాను అధికారికంగా గుర్తించిన దేశాల జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా చేరింది. కొవిషీల్డ్‌తోపాటు చైనాకు చెందిన సినోవాక్‌నూ గుర్తించింది. దేశానికి చెందిన ఔషధ నియంత్రణ మండలి ‘థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్’ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని స్కాట్ మోరిసన్ శుక్రవారం వెల్లడించారు.

8. ‘మొత్తం దిల్లీ గొంతు నొక్కారు’.. రైతులపై సుప్రీం ఆగ్రహం

దేశ రాజధాని దిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్‌మంతర్‌ వద్ద సత్యాగ్రహం చేయడానికి అనుమతి ఇవ్వాలన్న రైతు సంఘం అభ్యర్థనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మీరు మొత్తం దిల్లీ గొంతు నొక్కేశారు. ఇప్పుడు నగరం లోపలికి వచ్చి ఇక్కడ కూడా ఆందోళన చేయాలనుకుంటున్నారు’’ అని న్యాయస్థానం మండిపడింది.

9. నామినేషన్‌ ఉపసంహరించుకున్న బండ్ల గణేశ్‌ 

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ‘మా’ ఎన్నికలకి సంబంధించి తాను దాఖలు చేసిన నామినేషన్‌ని ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు. ‘నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను జనరల్‌ సెక్రటరీ నామినేషన్‌ ఉపసంహరించుకున్నా’ అని పేర్కొన్నారు.

పరిటాల రవి నా సోదరుడు.. భావోద్వేగానికి గురైన మోహన్‌బాబు

10. పింక్‌ బాల్‌ టెస్టులో సెంచరీ.. స్మృతి మంధాన కొత్త చరిత్ర

ఆస్ట్రేలియా గడ్డపై భారత ఓపెనర్‌ స్మృతి మంధాన (127; 216 బంతుల్లో 22x4, 1x6) దుమ్మురేపింది. తొలి పింక్‌బాల్‌ టెస్టులోనే శతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. అలాగే ఆసీస్‌ గడ్డపై ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. కార్రా వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా గురువారం టాస్‌ఓడి బ్యాటింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని