Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Published : 03 Oct 2021 16:57 IST

1. జేఎన్‌టీయూహెచ్‌లో స్వర్ణోత్సవాలను ప్రారంభించిన తమిళిసై

దేశంలోనే మొట్టమొదటి టెక్నలాజికల్‌ యూనివర్సిటీ జేఎన్‌టీయూ హైదరాబాద్‌ అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. దేశంలోనే జేఎన్‌టీయూహెచ్‌కు మంచి పేరుందని కితాబిచ్చారు. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌ 50వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాలను ఆమె ప్రారంభించారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థికి కావాల్సిన అన్ని విద్యా సౌకర్యాలు జేఎన్‌టీయూలో ఉన్నాయని గవర్నర్ తెలిపారు. 

2. భవానీపుర్‌లో మమతా బెనర్జీ ఘన విజయం

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  భవానీపుర్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై భారీ ఆధిక్యాన్ని నమోదు చేశారు. తొలి రౌండ్‌ నుంచీ మమత ఆధిపత్యం కొనసాగింది. రౌండ్‌ రౌండుకు దీదీ మెజారిటీ పెరిగి 50 వేలకుపైగా చేరింది. 58,832 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. ఈ విజయంతో మమత సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారు.

3. బండి సంజయ్‌ పాదయాత్రకు స్పందన రాలేదు: వినోద్‌ కుమార్‌

తెలంగాణ ప్రభుత్వం పట్ల భాజపా నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అగ్రహం వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాలేదని స్పష్టం చేశారు. అయన పాదయాత్రలో ఎటు చూసినా పచ్చదనమే కనిపించిందని.. అందుకే సంజయ్‌కు ఏమి మాట్లాడాలో తెలియలేదని ఎద్దేవా చేశారు. 

4. జగదీశ్ రెడ్డి.. సూర్యాపేటలో ఎలా గెలుస్తావో చూస్తా: రాజగోపాల్‌ రెడ్డి

నల్గొండ జిల్లా చండూరులో కాంగ్రెస్‌ కార్యకర్తలతో రాజగోపాల్‌ రెడ్డి సమావేశమయ్యారు. మునుగోడు అభివృద్ధిని మంత్రి జగదీశ్‌రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగదీశ్ రెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానని.. సూర్యాపేటలో ఆయన ఓటమికి కృషి చేస్తానని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

5. ‘డ్రగ్స్‌తో సంబంధం లేకపోతే విజయసాయి ఎక్కడ?’

ఏపీలోని డ్రగ్స్‌ దందాలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రమేయముందని తెదేపా సీనియర్‌ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘డ్రగ్స్‌తో సంబంధం లేకపోతే విజయసాయి ఎక్కడున్నారు. విజయసాయిరెడ్డి తన పార్టీకి కూడా అందుబాటులో లేరు. అతని అల్లుడికి రాష్ట్ర పోర్టుల్లో వాటాలున్నాయి. పోర్టుల ద్వారా వారికి తెలిసే డ్రగ్స్‌ సరఫరా జరుగుతోందని సమాచారం.

6. అసెంబ్లీలో ఆర్‌ఆర్‌ఆర్‌లు ప్రజాగళం వినిపిస్తారు: బండి సంజయ్‌

తెలంగాణ అసెంబ్లీలో ఆర్‌ఆర్‌ఆర్‌లు ప్రజాగళం వినిపిస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన భాజపా ఎన్నికల శంఖారావ సభలో బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. ఉద్యమకారుడైన ఈటల రాజేందర్‌ను గెలిపించాలని హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

7. ‘ప్రపంచ ఫార్మసీ’గా భారత్‌..!

ప్రజారోగ్యరంగంలో గత కొన్నేళ్లుగా భారత్‌ పురోగతి సాధిస్తున్నట్లు అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా పోలియో నిర్మూలన, శిశు మరణాల రేటును తగ్గించడంలో భారత్‌ మెరుగైన పనితీరు కనబరిచిందని చెబుతున్నారు. ఇలా ‘ఫార్మసీ ఆఫ్‌ ది వరల్డ్‌’గా అవతరించడం గడిచిన 75ఏళ్లలో భారత్‌ సాధించిన లక్ష్యాల్లో అతిపెద్దదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు.

8. నచ్చినవారికి  మెచ్చిన ర్యాంకులు!

సులభతర వాణిజ్య విధానాల అమలులో వివిధ దేశాలకు ప్రపంచ ర్యాంకులను ప్రకటించే ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు బహిర్గతం కావడం సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ వాణిజ్య రంగాన్ని ప్రభావితం చేసే ర్యాంకులు కొన్ని దేశాలకు కోరుకున్నట్లు దక్కడంపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రపంచబ్యాంకు ఏటా విడుదల చేసే ఈ ర్యాంకులకు చాలా ప్రాధాన్యముంది. వివిధ దేశాలలో పెట్టుబడులు పెట్టే సంస్థలు వీటిని పరిగణనలోకి తీసుకుంటాయి. 

9. అదను చూసి.. దాడి చేసి..!

ముంబయి తీరంలోని కార్డెలియా క్రూయిజ్‌ ఎంప్రెస్‌ నౌకపై శనివారం రాత్రి మాదకద్రవ్యాల నిరోధక శాఖ హఠాత్తుగా దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ నౌకలో రేవ్‌ పార్టీ జరుగుతోన్న సమయంలో అధికారులు అక్కడి వారిని అదుపులోకి తీసుకొన్నారు. ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్న వారిలో బాలీవుడ్‌లోని ఓ సూపర్‌ స్టార్‌ కుమారుడు కూడా ఉన్నాడు. వీరి వద్ద నుంచి కొకైన్‌, గంజాయి, ఎండీఎంఏ వంటి మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకొన్నారు.

10. పేరు మార్చుకున్న సామ్‌

విడిపోతున్నట్లు ప్రకటించిన అనంతరం నెట్టింట్లో నాగచైతన్య, సమంత హాట్‌ టాపిక్‌గా మారారు. దీంతో, నెటిజన్ల చూపు వాళ్లిద్దరి సోషల్‌మీడియా ఖాతాలపైనే పడింది. ఈ క్రమంలోనే తాజాగా నటి సమంత తన పేరు మార్చుకున్నారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ఖాతాలకు ‘Samantha’ అని పేరు పెట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని