Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 21 Oct 2021 17:37 IST

1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కరవు భత్యం(డీఏ)ను 3శాతం పెంచింది. ఈ పెంపు జులై 2021 నుంచే అమలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 28శాతం ఉండగా.. తాజా నిర్ణయంతో 31శాతానికి చేరింది. కేంద్రం నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలగనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,488.70కోట్ల మేర అదనపు భారం పడనుంది.

2. సానుభూతి కోసమే చంద్రబాబు దీక్ష: పేర్ని నాని

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై అసభ్య వ్యాఖ్యలు చేయించడమే కాకుండా నిరసన దీక్ష పేరిట తెదేపా అధినేత చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే చంద్రబాబు సానుభూతి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష అని.. ఆ దీక్షకు కారణమేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

3. ఇంటర్‌ పరీక్షలకు గంట ముందొచ్చినా అనుమతిస్తాం: సబిత

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈ నెల 25 నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తు్న్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇంటర్‌ పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి వచ్చినా అనుమతిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల

4. ‘ఇంటికో ఓటు కాంగ్రెస్‌కు’.. నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలి: రేవంత్‌

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ‘ఇంటికో ఓటు కాంగ్రెస్‌కు’ అనే నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువత, విద్యార్థులు, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం ఉండాలని సూచించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలో ప్రజలకు వివరించాలన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఇంఛార్జ్‌లతో రేవంత్ రెడ్డి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

5. తెదేపా నేత బ్రహ్మం చౌదరికి రిమాండ్‌

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరికి మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. తెదేపా కార్యాలయంపై దాడి జరిగిన రోజు అక్కడికి వెళ్లిన తనను నిర్బంధించారని ఆర్ఐ సక్రూనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయగా ... అందులో బ్రహ్మం చౌదరి ఏ6గా ఉన్నారు. 

6. సీబీఎస్‌ఈ ప్రమాణాలకు అనుగణంగా పాఠ్యాంశాల మార్పు: సురేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో 8, 9, 10 తరగతుల పాఠ్యాంశాల్లో మార్పులు చేసే యోచనలో ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సీబీఎస్‌ఈ ప్రమాణాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించనున్నట్లు చెప్పారు. పాఠ్యాంశాల మార్పుపై 130 మంది ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. పాఠ్యాంశాల రూపకల్పనపై ఉపాధ్యాయులకు సూచనలు చేశామన్నారు.

7. ‘‘నాతో ఫొటో దిగడమే నేరమా? అయితే నాపైనా చర్యలు తీసుకోండి’’

తనతో ఫొటో దిగిన కొందరు మహిళా పోలీసులపై చర్యలు తీసుకొనేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ యోచిస్తున్నారని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఈ మేరకు కొందరు మహిళా పోలీసులు తనతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్‌ చేశారు. తనతో వారు ఫొటోలు దిగడం నేరమైతే.. అందుకు తనను కూడా శిక్షించాలన్నారు. 

8. 100కోట్ల డోసుల పంపిణీపై.. భారత్‌కు WHO ప్రశంసలు!

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ సాధించిన ఘనతను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. తాజాగా 100కోట్ల డోసులను పూర్తి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ‘వ్యాక్సిన్‌ సమానత్వ లక్ష్యాలను సాధించేందుకు మీరు చేస్తోన్న ప్రయత్నాలకు భారత ప్రధాని, శాస్త్రవేత్తలు, వైద్య ఆరోగ్య కార్యకర్తలు, దేశ ప్రజలకు అభినందనలు’ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ పేర్కొన్నారు. 

9. నటి అనన్య పాండే నివాసంలో ఎన్‌సీబీ సోదాలు..!

బాలీవుడ్‌ ఇండస్ట్రీని డ్రగ్స్‌ వ్యవహారం కుదిపేస్తోంది. ఇప్పటికే ముంబయిలోని క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయి జైల్లో ఉండగా.. తాజాగా మరో బాలీవుడ్‌ నటి పేరు తెరపైకి వచ్చింది. యువ నటి అనన్య పాండే నివాసంలో గురువారం ఎన్‌సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఉదయం అనన్య ఇంటికి వెళ్లిన ఎన్‌సీబీ అధికారులు అక్కడ సోదాలు చేపట్టారు. 

ఆర్యన్‌ సరిగా తింటున్నావా నాన్నా.. 

10. టీమ్‌ఇండియానే టైటిల్‌ ఫేవరెట్‌: స్మిత్

ఈ టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో టీమ్‌ఇండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని, దీంతో ఆ జట్టు టైటిల్‌ విజేతగా నిలవడానికి ఫేవరెట్‌గా అనిపిస్తుందని ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ అభిప్రాయపడ్డాడు. బుధవారం రాత్రి ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య రెండో వార్మప్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం స్మిత్‌ మాట్లాడాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని