Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 02 Nov 2021 17:10 IST

1. తెదేపా నేతలపై రాష్ట్రపతికి వైకాపా ఫిర్యాదు

తెదేపా నేతలపై వైకాపా ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌ లక్ష్యంగా తెదేపా నేతలు చేసిన వ్యాఖ్యలను వివరించినట్టు రాష్ట్రపతితో భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. తప్పుచేసి దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే ఆయన దిల్లీకి వచ్చారని ఆరోపించారు. 

2. బండి సంజయ్‌కు హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌

హుజూరాబాద్‌ ఉప పోరులో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌కి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయటం వల్లే హుజూరాబాద్‌లో భాజపా గెలుస్తోందని సంజయ్‌ పేర్కొన్నారు.

దళితబంధు మొదలెట్టిన చోటా భాజపాదే ఆధిక్యం: డీకే అరుణ

3. తెరాస అభ్యర్థి గెల్లుకు స్వగ్రామం, అత్తగారి ఊరిలో ఝలక్

హోరాహోరీగా సాగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు తన స్వగ్రామం హిమ్మత్‌నగర్‌లో ఓటర్లు షాకిచ్చారు. ఇక్కడ గెల్లుకు 358 రాగా, ఈటల రాజేందర్‌కి 549 ఓట్లు పోలయ్యాయి. గెల్లు అత్తగారి గ్రామం హుజూరాబాద్‌ మండలం పెద్దపాపయ్యపల్లెలోని ఓటర్లు కూడా ఆయనకు హ్యాండ్‌ ఇచ్చారు. ఇక్కడ ఈటలకే 76 ఓట్ల అధిక్యం వచ్చింది. యాదవ సామాజిక వర్గం అధికంగా ఉన్న వెంకటరావుపల్లెతో పాటు సీఎం కేసీఆర్‌ దళితబంధు ప్రకటించిన శాలపల్లిలో కూడా ఓటర్లు తెరాసను ఆదరించలేదు.

4. కమలం కోటలో దీదీ పాగా.. హిమాచల్‌లోనూ భాజపాకు భంగపాటు

దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ స్థానాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. ఇందులో కొన్ని చోట్ల భాజపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ చేయగా.. పశ్చిమ బెంగాల్‌లో భాజపాకు గట్టి పట్టున్న దిన్‌హటా నియోజకవర్గం దీదీ వశమైంది. కర్ణాటకలోనూ కాషాయ పార్టీకి మిశ్రమ ఫలితాలు దక్కాయి. 

5. మహా డిప్యూటీ సీఎంకు ఐటీ షాక్‌.. రూ.1000కోట్ల ఆస్తుల జప్తు

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌కు ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ గట్టి షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన దాదాపు రూ.1000కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ముంబయిలోని నారిమన్‌ పాయింట్‌లో గల నిర్మల్‌ టవర్‌తో పాటు మహారాష్ట్ర, దిల్లీ, గోవాల్లో ఆయనకు సంబంధించిన పలు ఆస్తులను ఐటీ శాఖ అధికారులు అటాచ్‌ చేసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

6. అఫ్గాన్‌లో ‘చిన్నారి పెళ్లికూతుళ్లు’.. డబ్బు కోసం తండ్రులే అమ్మేస్తున్నారు..

పర్వానా మాలిక్‌కు తొమ్మిదేళ్లు.. బాగా చదువుకుని టీచర్‌ అవ్వాలని తన కల. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమె కలలను తుడిచేశాయి. పేదరికం ఆమెను వివాహ బంధంలోకి నెట్టేసింది. అభం శుభం తెలియని పసి ప్రాయంలో 55ఏళ్ల వ్యక్తికి ఇల్లాలిని చేసింది. ఒక్క పూట తిండికి కూడా డబ్బుల్లేని పర్వానా తండ్రి.. కుటుంబాన్ని బతికించుకోవడం కోసం గత్యంతరం లేక తన 9ఏళ్ల కుమార్తెను పెళ్లి పేరుతో అమ్మకానికి పెట్టారు. ఒక్క పర్వానానే కాదు.. అఫ్గాన్‌లో అనేక మంది బాలికల దయనీయ పరిస్థితి ఇది..!

7. నేడు మళ్లీ నష్టాల్లోకి సూచీలు!

వరుస నష్టాల నుంచి సోమవారం కోలుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు మళ్లీ నేలచూపులు చూశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు కాసేపటికే కిందకు దిగజారుతూ వెళ్లాయి. అలా చివరి గంట వరకు ఒడుదొడుకుల్లో కొనసాగి.. చివరకు నష్టాలతో ట్రేడింగ్‌ ముగించాయి. సెన్సెక్స్‌ 30 సూచీలోని కీలక కంపెనీలన్నీ నష్టాలు మూటగట్టుకున్నాయి. అలాగే లోహ ఇంధనం వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.

8. చైనా ఒంటెద్దు పోకడ.. టిబెటన్లకు తిప్పలు!

వాతావరణ మార్పులపై పోరాటానికి ప్రపంచ దేశాలన్నీ గళమెత్తుతోన్న విషయం తెలిసిందే. అయితే.. ఇదే ముసుగులో చైనా తమ భూములను లాక్కోవడానికి యత్నిస్తోందని టిబెటన్లు ఆరోపిస్తున్నారు. తద్వారా తమ ప్రాథమిక హక్కులను, జీవనోపాధిని దెబ్బతీస్తోందని వాపోతున్నారు. ఇప్పటికే తమ భూములపై యాజమాన్య హక్కులను బలవంతంగా వదులుకోవాల్సి వచ్చిందని, దీంతోపాటు పశువుల మేతకు గడ్డి మైదానాలనూ వినియోగించుకోలేక పోతున్నామని చెబుతున్నారు.

9. కొవిడ్‌ యాంటీబాడీలు ఎవరిలో ఎక్కువగా ఉంటున్నాయ్‌..?

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఎంతకాలం రక్షణ కల్పిస్తున్నాయనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా వైరస్‌ బారినపడి కోలుకున్న తర్వాత రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకునే వారిలో అత్యధిక యాంటీబాడీలు ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో మరోసారి వెల్లడైంది. ఈ అధ్యయనం జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (JAMA)లో ప్రచురితమైంది.

10. బుమ్రా కాదు.. రవిశాస్త్రి మాట్లాడాల్సింది: అజహరుద్దీన్‌

పొట్టి ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌కు ఎదురైన రెండు వరస పరాజయాలు భారత క్రీడాభిమానులకు మింగుడుపడట్లేదు. మరోవైపు న్యూజిలాండ్‌ మ్యాచ్‌ అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కాకుండా.. బుమ్రా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మాజీ భారత క్రికెటర్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ స్పందిస్తూ.. బుమ్రా బదులు కోచ్‌ రవిశాస్త్రి మీడియాతో మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని