Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Published : 09 Nov 2021 16:56 IST

1. తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ‘ఎమ్మెల్సీ’ షెడ్యూల్‌ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలో 12, ఏపీలో 11 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 16న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణకు గడువు ఇచ్చారు. డిసెంబర్‌ 10న పోలింగ్‌ నిర్వహించి 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

అమల్లోకి ఎన్నికల కోడ్‌..  తెరాస విజయగర్జన సభ వాయిదా

2. ఏపీ మంత్రి సురేశ్‌ను అడ్డుకున్న విద్యార్థి సంఘాలు

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం ఘటనపై విజయవాడ అర్‌అండ్‌బీ భవనంలో మీడియా సమావేశం నిర్వహించేందుకు వచ్చిన మంత్రి సురేశ్‌ను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. అనంతపురం లాఠీఛార్జి ఘటనపై విద్యార్థులు నిరసన తెలిపారు. ప్రైవేటు యాజమాన్యాలు అధిక ఫీజు వసూలు చేస్తే పేదలు ఎలా భరిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు విద్యార్థులు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

3. తెలంగాణ అభివృద్ధి వీళ్లకు కనిపించడం లేదు: కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతగానో కృషి చేస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. కామారెడ్డిలో తెరాస శ్రేణులతో మంగళవారం సమావేశమైన ఆయన.. పొరుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలు, నేతలు మన పాలనను పొగుడుతున్నారని గుర్తుచేశారు. అభివృద్ధిపై కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతుంటే గమ్మత్తుగా అనిపిస్తోందని ఎద్దేవాచేశారు. 

4. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఖర్చు ప్రపంచంలోనే అత్యధికం: జేపీ

ప్రపంచంలోనే అత్యధిక ఖర్చును కేవలం హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో చేశారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ పేర్కొన్నారు. బ్రిటన్‌ ..భారత దేశానికంటే 18 నుంచి 20 రెట్లు ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశం.. అక్కడ పార్లమెంట్‌ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు పెట్టిన ఖర్చుకంటే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పెట్టిన ఖర్చు చాలా ఎక్కువని అభిప్రాయపడ్డారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఇస్తున్నారంటే ప్రపంచంలోనే అది అత్యధికమన్నారు.

చరిత్ర వక్రీకరణకు భాజపా యత్నం: ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

5. స్థానికులకే మద్యం దుకాణాలు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణలో నూతన మద్యం దుకాణాలకు షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్రంలో ఈరోజు నుంచే నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. గౌడ కులస్తులకు 15శాతం రిజర్వేషన్‌ కల్పించామని మంత్రి పేర్కొన్నారు. కులవృత్తి రీత్యా గౌడ కులస్తులకు ఇదొక చారిత్రాత్మకమైన నిర్ణయమని మంత్రి తెలిపారు. వందశాతం లాభాలతో నడిచే వ్యాపారమైన మద్యం దుకాణాలను స్థానికులకే కేటాయిస్తామని స్పష్టం చేశారు.

6. మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై 6 గంటల నుంచే!

మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌. ఇకపై ఉదయం ఆరు గంటల నుంచే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌) వేళల్లో మార్పులు చేసింది. రేపటి ( నవంబర్‌ 10) నుంచే ఉదయం 6 గంటలకు తొలి మెట్రో రైలు ప్రారంభం కానుంది. అలాగే రాత్రి 10.15 గంటలకు చివరి స్టేషన్‌ నుంచి మెట్రో రైలు బయలుదేరి.. రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది.

7. కొవాగ్జిన్‌కు యూకే గుర్తింపు.. నవంబర్‌ 22 నుంచి అనుమతి

అంతర్జాతీయ రాకపోకలను సులభతరం చేసేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం తాజాగా మరిన్ని నిర్ణయాలు వెలువరించింది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ‘గుర్తించిన కొవిడ్‌ టీకాల జాబితా’లో భారత్‌కు చెందిన కొవాగ్జిన్‌ను చేర్చుతున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 22 నుంచి ఈ టీకా తీసుకున్నవారు బ్రిటన్‌కు చేరుకున్న తర్వాత ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ను ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర వినియోగ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే.

8. చెప్పినట్టే.. నవాబ్‌ మాలిక్‌పై దీపావళి బాంబు పేలింది..!

ముంబయిలోని క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసు అనేక మలుపులు తీసుకుంటోంది. దానిలో భాగంగానే మంగళవారం మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ గురించి మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ పలు సంచలన విషయాలు వెల్లడించారు. చెప్పినట్లుగానే దీపావళి తర్వాత బాంబు పేల్చారు. ‘‘ నవాబ్‌ మాలిక్‌కు చీకటి సామ్రాజ్యం(అండర్ వరల్డ్)తో సంబంధాలున్నాయి. 1993లో ముంబయి పేలుళ్ల కేసులో దోషిగా తేలిన అండర్‌ వరల్డ్ వ్యక్తితో మాలిక్ ఆస్తి ఒప్పందాలు చేసుకున్నారు’’ అని చెప్పారు.

9. మా మంత్రులకు హిందీ అర్థం కాదు.. ఇంగ్లిష్‌ కూడా రాదు..!

మిజోరం ప్రధాన కార్యదర్శిగా రేణు శర్మను నియమిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగా కోరారు. ఇలాంటి ఉన్నతమైన పదవికి మిజో భాష తెలిసిన వ్యక్తిని నియమిస్తే బాగుంటుందని, ఎందుకంటే తన కేబినెట్‌ మంత్రులకు హిందీ, ఇంగ్లిష్‌ అర్థం కాదని అన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

10. టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మే సరైనోడు: సునీల్ గావస్కర్‌

టీ20ల్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో కొత్త సారథి ఎంపికపై బీసీసీఐ దృష్టిసారించింది. కెప్టెన్సీ రేసులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్‌ పంత్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది భారత మాజీ ఆటగాళ్లు కూడా పలువురి పేర్లను సూచిస్తున్నారు. భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ కూడా ఓ పేరుని సూచించారు. టీ20ల్లో విరాట్‌ కోహ్లీ నుంచి సారథిగా బాధ్యతలు స్వీకరించడానికి రోహిత్ శర్మే సరైన వ్యక్తి అని గావస్కర్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని