Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 11 Nov 2021 17:31 IST

1. క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ చేయాలి‌: జగన్‌

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకు క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ పథకంపై మంత్రులు, ఉన్నధికారులతో సమీక్ష నిర్వహించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అనుమతి ఇవ్వాలని.. క్షేత్రస్థాయి పరిశీలనలను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తి చేయాలన్నారు.

2. ‘రాష్ట్రంలో కాదు.. దిల్లీలో భాజపా ధర్నాలు చేయాలి’

తెలంగాణలో నిరంతరం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోందని తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. రైతులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు కూడా చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ భవన్‌లో పల్లా మీడియాతో మాట్లాడారు. ‘‘భాజపా ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే 3,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో కాదు.. భాజపా దిల్లీలో ధర్నాలు చేయాలి’’ అని అన్నారు.

3. ఏపీ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల స్వీకరణకు నోడల్‌ అధికారి నియామకం

ఏపీ ఉద్యోగ సంఘాలతో రేపు మరోమారు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీ జరగనుంది. పీఆర్‌సీ నివేదిక, అమలు, ఫిట్‌మెంట్‌, ఉద్యోగ సంఘాల డిమాండ్లు, వాటి పరిష్కారంపై భేటీలో చర్చించనున్నారు. పీఆర్‌సీ అమలు విషయంలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగడంతో మరోసారి భేటీ కావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల స్వీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజ్ఞప్తులను స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ అధికారిని నియమించింది.

4. ఆన్‌లైన్‌ టికెట్‌ విధానానికి ఎగ్జిబిటర్ల ఆమోదం!

ఆన్‌లైన్‌ టికెట్‌ విధానంపై ఎగ్జిబిటర్లు తమ ఇబ్బందులను మంత్రి పేర్నినాని దృష్టికి తీసుకెళ్లారు. టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆ తరువాత రోజే నిర్మాతలు, ఎగ్జిబిటర్ల ఖాతాల్లో జమ అవుతుందని మంత్రి తెలిపారు. ఈ మేరకు ఎగ్జిబిటర్లందరూ ప్రభుత్వ ఆన్‌లైన్‌ టికెట్‌ విధానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు నిర్మాత, ఎగ్జిబిటర్‌ అంబికా కృష్ణ తెలిపారు. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు.

5. మహమ్మారి కొత్త పద్ధతిలో వేగంగా తిరిగివస్తోంది..! 

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కోరలు చాస్తోంది. మరీ ముఖ్యంగా ఐరోపా కేంద్రంగా విజృంభిస్తోంది. అందులోనూ జర్మనీ పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ కరోనా వైరస్ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉద్ధృతి చూపిస్తోంది. తాజాగా 50,196 కొత్త కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. జర్మనీలో కరోనా వైరస్ అడుగుపెట్టిన దగ్గరి నుంచి 50 వేల కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి.

6. తిరుమల- పాపవినాశనం రోడ్డు మూసివేత

తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. గాలుల ధాటికి పలు చోట్ల పదుల సంఖ్యలో భారీ వృక్షాలు, చెట్టు కొమ్మలు రోడ్లపై పడ్డాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తిరుమల- పాపవినాశనం రోడ్డును అధికారులు మూసివేశారు. అటవీ, తితిదే అధికారులు రంగంలోకి దిగి రోడ్లపై పడిన చెట్లను తొలగిస్తున్నారు. 

7. ‘స్వాతంత్ర్యం’పై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు.. వరుణ్‌ గాంధీ ఫైర్‌!

‘భారత్‌కు అసలైన స్వాతంత్ర్యం 2014లో వచ్చింది. అంతకుముందు 1947లో మనకు లభించింది భిక్షం. ఆ విధంగా దొరికినదాన్ని స్వాతంత్ర్యంగా పరిగణిస్తామా?’ అంటూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఇదే క్రమంలో భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ కంగనా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సంబంధిత వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసి.. ఇలాంటి ఆలోచనను ‘పిచ్చితనంగా భావించాలా.. లేదా దేశద్రోహంగానా’ అంటూ మండిపడ్డారు!

8. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో చైనా రహస్య సర్వే..!

భారత వ్యూహకర్తల నోటివెంట తరచూ వినిపించే పదం ‘టూఫ్రంట్‌ వార్‌’. అంటే ఏకకాలంలో చైనా, పాక్‌ సైన్యాలను భారత్‌ ఎదుర్కోవాల్సిరావడం. ఇటీవల కాలంలో చోటు చేసుకొంటున్న పరిణామాలు మన వ్యూహకర్తల అంచనాలకు తగ్గట్లే ఉంటున్నాయి. పాక్‌-చైనాల మధ్య సైనిక సహకారం పెరిగిపోయింది. ఇటీవలే చైనా అత్యాధునిక ఫ్రిగేట్‌ను పాకిస్థాన్‌కు బహూకరించింది. ఈ వార్త పూర్తిగా కనుమరుగు కాకముందే మరో విషయం బయటకు వచ్చింది.

9. చైనా హెచ్చరిక.. ప్రచ్ఛన్నయుద్ధం నాటి ఘర్షణలు తేవద్దు..!

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో గత కొంత కాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై చైనా మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి ఉద్రిక్త పరిస్థితులను మరోసారి తీసుకురావద్దని హెచ్చరించింది. ఇటీవల అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా దేశాల మధ్య భద్రతా ఒప్పందం జరిగినట్లు ప్రకటన వచ్చిన నేపథ్యంలో.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వాటిపై పరోక్ష హెచ్చరిక చేశారు.

10. సెమీస్ ముందు పాక్‌కు ఎదురుదెబ్బ.!

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుకు.. కీలకమైన సెమీ ఫైనల్స్‌కు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆటగాళ్లు మహమ్మద్‌ రిజ్వాన్‌, షోయబ్ మాలిక్‌లు ఫ్లూ బారిన పడ్డారు. దీంతో బుధవారం సాధనకు కూడా వీరిద్దరూ దూరంగా ఉన్నారు. దుబాయ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరగాల్సిన రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో వీరు ఆడతారా..? లేదా..? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని