Published : 28/11/2021 17:02 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. దిల్లీలో విందు చేసుకొని వచ్చారు: రేవంత్‌రెడ్డి

ధాన్యం సేకరణపై కేంద్రానికి, రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇందిరాపార్క్‌ వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్ష ముగింపులో రేవంత్‌ మాట్లాడారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్‌ ధర్నాలు చేశారని పేర్కొన్నారు. దిల్లీ వెళ్లిన కేసీఆర్‌.. ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా కోరలేదన్నారు. కేసీఆర్‌, మంత్రులు రెండ్రోజులు దిల్లీలో విందు చేసుకుని వచ్చారని వ్యాఖ్యానించారు. 

2. వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేపట్టాలి : చంద్రబాబు

వరదల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేపట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎస్‌ సమీర్‌శర్మకు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ.6,054 కోట్ల నష్టం వాటిల్లిందని తేలితే.. కేవలం రూ.35 కోట్లు విడుదల చేయడం సరికాదన్నారు.. ప్రకృతి వైపరీత్యాల  నిధులనూ దారి మళ్లించినట్లు కాగ్‌ తప్పుబట్టినట్లు పేర్కొన్నారు.

3. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: డీహెచ్‌

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) డా.శ్రీనివాస్‌ తెలిపారు. కరోనా పరిస్థితులు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై, ప్రభుత్వ సన్నద్ధతపై  వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. 

4. ‘సిద్ధ’ టీజర్‌.. వేట మొదలెట్టిన రామ్‌చరణ్‌!

చిరంజీవి, రామ్‌ చరణ్‌ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రంలో చిరంజీవి ఆచార్యగా, రామ్‌ చరణ్‌ సిద్ధగా కనిపించనున్నారు. ఆచార్య పాత్రకు సంబంధించిన టీజర్‌ ఇప్పటికే విడుదలకాగా తాజాగా సిద్ధ క్యారెక్టర్‌ టీజర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శక్తిమంతమైన పాత్రలో చరణ్‌ ఒదిగిపోయారు. ఆయన గెటప్‌, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

5. భారత్‌ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్‌

తొలి టెస్టులో న్యూజిలాండ్‌కు భారత్‌ 284 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టీమ్‌ఇండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 234/7 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి భారత్‌ 283 పరుగుల ఆధిక్యం సాధించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్ (65), వృద్ధిమాన్‌ సాహా (61*) అర్ధశతకాలు సాధించారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (32), అక్షర్‌ పటేల్ (28*), పుజారా (22) ఫర్వాలేదనిపించారు.

6. స్టార్టప్‌ల రంగంలో భారత్‌దే అగ్రాసనం: మోదీ

ప్రస్తుతం అంకుర సంస్థ(స్టార్టప్‌)ల యుగం నడుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌లో దాదాపు 70 కంటే ఎక్కువ స్టార్టప్‌ల విలువ 1 బిలియన్ డాలర్లు దాటడంతో ఈ రంగంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని అన్నారు. ప్రతినెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. యువత అధిక సంఖ్యలో ఉన్న ఏ దేశంలోనైనా, మూడు అంశాలు- ఆలోచనలు-ఆవిష్కరణలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, ఏదైనా చేయగలమనే స్ఫూర్తి చాలా ముఖ్యమైనవని మోదీ హితబోధ చేశారు

7. ఆయుర్వేదిక్‌ సిగరెట్‌కు పేటెంట్‌

తాము తయారు చేసిన సిగరెట్‌ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అంటోంది ఓ ఆయుర్వేద సంస్థ. పుణెకు చెందిన అనంత్‌వేద ఆయుర్వేద సంస్థ పదేళ్ల క్రితం తయారు చేసిన ఆయుర్వేదిక్‌ సిగరెట్‌కు ఇప్పుడు ‘ఇండియన్‌ పేటెంట్‌’ హక్కులు అందాయి.  ధూమపానానికి అలవాటు పడిన వారికి.. ఈ ఆయుర్వేద సిగెరెట్‌ ఓ వరం లాంటిదని ఆ సంస్థకు చెందిన వైద్యుడు రాజేశ్‌ నిత్సురే పేర్కొన్నారు.

8. పార్లమెంటు శీతాకాల సమావేశాలు... అఖిలపక్ష భేటీ ప్రారంభం!

సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్షం నేడు సమావేశమయ్యింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో జరుగుతోన్న ఈ భేటీకి పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ముఖ్యంగా సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఆయా రాజకీయ పార్టీలు తమ డిమాండ్లను ప్రభుత్వం ఎదుట ఉంచాయి. ఇదే సమయంలో సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కూడా కోరనుంది.

9. ఆస్ట్రేలియాలో కొత్త వేరియంట్‌ కలకలం

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ రకం వైరస్‌ దక్షిణాఫ్రికా మొదలు బోట్స్‌వానా, ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌ తదితర దేశాలకు విస్తరించింది. ఇదే క్రమంలో తాజాగా ఆస్ట్రేలియాలోనూ ఈ వేరియంట్‌కు సంబంధించిన రెండు కేసులు బయటపడటం స్థానికంగా కలవరానికి దారితీసింది. 

10. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గవచ్చు..!

అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో పతనం మరికొంతకాలం కొనసాగితే పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గే అవకాశం ఉంది. దేశీయంగా ఇంధన ధరల నిర్ణయించే సమయంలో 15 రోజుల రోలింగ్‌ యావరేజ్‌ ఆధారంగా నిర్ణయిస్తారు. నవంబర్‌ నెలలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 80 డాలర్ల నుంచి 82 డాలర్ల మధ్యలోనే ఉంది. గత శుక్రవారం ఒక్కరోజే అమెరికా మార్కెట్లు మొదలుకాగానే 4 డాలర్ల మేరకు చమురు ధరలు పతనమయ్యాయి. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని