Published : 30/11/2021 16:55 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. సినీ గేయరచయిత ‘సిరివెన్నెల’ కన్నుమూత

తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రఖ్యాత గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి ఇకలేరు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఆయన ఇవాళ సాయంత్రం కన్నుమూశారు. సీతారామశాస్త్రి మృతితో చిత్ర పరిశ్రమలో విషాధ చాయలు అలముకున్నాయి. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రంలో ‘విధాత తలపున’ గేయంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా టైటిల్‌నే ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు.

2. కోస్తాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన

దక్షిణ థాయిలాండ్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి డిసెంబరు 4వ తేదీ నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరాలకు దగ్గరగా వచ్చే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో డిసెంబరు 2 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. 3, 5 తేదీల్లో కోస్తాంధ్ర జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. 

3. అసత్య ప్రచారాలు నమ్మొద్దు: డీహెచ్‌ శ్రీనివాస్‌రావు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల నమోదుపై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) డాక్టర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాలేదని.. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానాలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త రకమైన కేసులు వస్తే ప్రభుత్వమే నేరుగా ప్రకటిస్తుందని చెప్పారు. 

4. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోతే ఊరుకోం: బండి 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ భాష జుగుప్సాకరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా దిల్లీ వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. నిన్నటి కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌పై స్పందించారు. ‘‘సీఎం వాడే భాష తెలంగాణలో ఎవరైనా మాట్లాడతారా?కేంద్రం రా రైసు కొంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టంగా చెప్పారు. రా రైసు కూడా కొనేది లేదని సీఎం చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోతే మేం ఊరుకునేది లేదు.

5. వరదలతో నష్టపోయాం.. కేంద్రం చేయూత అందించాలి: విజయసాయిరెడ్డి

వర్షాలతో ఏపీలో కొన్ని జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో ఏపీ వరదల అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఆకస్మికంగా వచ్చిన వరదలతో వేలమంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. వరదల వల్ల 44 మంది చనిపోయారని.. 16 మంది గల్లంతైనట్లు వివరించారు. 1.85లక్షల హెక్టార్లలో రూ.654 కోట్ల విలువైన పంటలు వరదల పాలయ్యాయని సభ దృష్టికి తీసుకెళ్లారు. 

6. మళ్లించిన నిధులు పంచాయ‌తీల ఖాతాల్లో జ‌మ‌ చేయాలి: లోకేశ్‌

గ్రామ పంచాయతీల నుంచి మ‌ళ్లించిన రూ.1,309 కోట్లు త‌క్షణ‌మే పంచాయ‌తీల ఖాతాల్లో జ‌మ‌ చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్‌కు లోకేశ్‌ బహిరంగ లేఖ రాశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అప్పులు తేవడం, ఆస్తులు అమ్మేయడం, భూములను తాకట్టు పెట్టడం.. ఈ మూడింటిపై ఆధారపడి పాల‌న సాగిస్తున్నారన్నారని ఆరోపించారు.

7. ఒమిక్రాన్‌తో భయం.. కొవిడ్‌ ఆంక్షల్ని మళ్లీ పొడిగించిన కేంద్రం

గత కొన్నాళ్లుగా తగ్గుముఖం పట్టినట్టే కనిపించిన కొవిడ్‌ మహమ్మారి భయాలు.. మళ్లీ ఒమిక్రాన్‌ రూపంలో గుబులు రేపుతున్నాయి. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగుచూసి పలు ప్రపంచ దేశాలకు వ్యాప్తిచెందుతున్న ఈ కొత్త వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న కొవిడ్‌ నిబంధనలు, మార్గదర్శకాల్ని డిసెంబర్‌ 31వరకు పొడిగించింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది.

8. భారత నావికాదళాధిపతిగా అడ్మిరల్‌ హరికుమార్‌

భారత నావికాదళ 25వ చీఫ్‌ ఆఫ్‌ నావెల్‌ స్టాప్‌గా అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ బాధ్యతలు స్వీకరించారు.  ఆయన అడ్మిరల్‌ కరమ్‌బీర్‌సింగ్‌ నుంచి ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అడ్మిరల్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘చీఫ్‌ ఆఫ్‌ నావెల్‌ స్టాప్‌గా బాధ్యతలు స్వీకరించడం నాకు గొప్ప గౌరవం. భారత ప్రయోజనాలు, సవాళ్లపై నేను దృష్టిపెడతాను’’ అని పేర్కొన్నారు.

9. పీఎం సార్‌.. ఇంకా ఎందుకు ఆలస్యం? విమానాలు ఆపండి..!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనల మధ్య.. అంతర్జాతీయ విమానాలపై కేంద్రం ఆంక్షలు విధించాలని మంగళవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. గత ఏడాది కరోనా మొదటి దశ సమయంలో కూడా అంతర్జాతీయ విమాన ప్రయాణాలను నియంత్రించడంలో భారత్ ఆలస్యంగా స్పందించిందని ట్వీట్ చేశారు.

10. భాజపా రాష్ట్రాల్లోనే టీకా జోరు!

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే.. భాజపా పాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతోందని అధికార వర్గాలు తెలిపాయి. ఎనిమిది భాజపా పాలిత రాష్ట్రాల్లో అర్హులైన జనాభాలో 50 శాతం మందికి వ్యాక్సినేషన్‌ ఇప్పటికే అందింది. అందులో ఏడు రాష్ట్రాల్లో 90 శాతానికిపైగా మొదటి డోసు పూర్తయింది. కాంగ్రెస్‌ పాలిత ఏ రాష్ట్రంలోనూ టీకా ప్రక్రియ ఆశించిన స్థాయిని అందుకోలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని