Published : 01/12/2021 16:55 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. సిరివెన్నెల చితికి ఆయన పెద్ద కుమారుడు సాయి వెంకట యోగేశ్వరశర్మ నిప్పంటించారు. ఈ ఉదయం సిరివెన్నెల భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి ఫిలింఛాంబర్‌కు తీసుకొచ్చారు. అక్కడ సిరివెన్నెల పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. 

2. రైతుల మరణాలపై సమాచారం లేదు: కేంద్రం

వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఆందోళనలో మరణించిన రైతులకు సంబంధించి తమ వద్ద తగిన సమాచారం లేదని కేంద్రం వెల్లడించింది. రైతుల మరణాలు, నిరసనల వల్ల ప్రభావితమైన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని విపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పార్లమెంట్‌కు ఈ మేరకు రాతపూర్వక సమాధానమిచ్చారు.  ‘రైతు ఉద్యమం అంశాలపై ప్రభుత్వం వద్ద తగిన సమాచారం లేదు. అలాంటప్పుడు సహాయం అనే దానికి తావే లేదు’ అని పేర్కొన్నారు. 

3. వాణిజ్య సిలిండర్‌పై మళ్లీ బాదుడు

దేశీయ చమురు సంస్థలు మరోసారి వాణిజ్య సిలిండర్ ధరను పెంచాయి. బుధవారం (డిసెంబర్‌ ఒకటో తేదీ) సిలిండర్‌పై రూ.100.50 పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. దాంతో 19 కేజీల సిలిండర్ ధర ఇప్పటికే రూ.రెండు వేల రూపాయలు దాటగా.. ఈ పెంపుతో దిల్లీలో ఆ ధర రూ.2,101కి చేరింది. కాగా, పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి

4. తెరాస ఎంపీలపై లోక్‌సభ స్పీకర్‌ అసహనం

లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన తెలియజేయడం పట్ల తెరాస సభ్యులపై స్పీకర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఆందోళన విరమించి కూర్చోవాలని చెప్పారు. అప్పటికీ తెరాస సభ్యులు శాంతించకపోవడంతో లోక్‌సభను అరగంట వాయిదా వేశారు. మూడు రోజుల నుంచి తెరాస ఎంపీలు లోక్‌సభలో నిరసన గళం వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. 

5. ఉద్యమబాట.. సీఎస్‌కు ఏపీ ఉద్యోగ సంఘాలు నోటీసు

పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తూనే ఉన్నామని ఏపీ జేఏసీ నేతలు తెలిపారు. స్నేహపూర్వక గవర్నమెంట్‌ అని చెప్పిన ప్రభుత్వ పెద్దల మాటలు కన్నీటి మూటలే అయ్యాయని మండిపడ్డారు. ఉద్యమ కార్యాచరణను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఐదు పేజీల ఉద్యమ కార్యాచరణ నోటీసును సీఎస్‌ సమీర్‌ శర్మకు అందజేసినట్లు జేఏసీ నేతలు తెలిపారు. 

6. నష్టాలు తగ్గించేందుకే ఆర్టీసీ ఛార్జీల పెంపు!

తెలంగాణ ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు ఛార్జీలు పెంపు తప్పడం లేదని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. పల్లె వెలుగుకు కి.మీ.కు రూ.25 పైసలు, మిగతా సర్వీసులకు కి.మీ.కు రూ.30 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు చెప్పారు. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో ఛార్జీల పెంపుపై ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌లతో మంత్రి సమీక్ష చేపట్టారు. 

7. ఎయిడ్స్‌ బాధితుల పట్ల చిన్నచూపు తగదు: మంత్రి హరీశ్‌

గాలి, తాకడం ద్వారా ఎయిడ్స్‌ సోకదని..ఆ బాధితుల పట్ల చిన్నచూపు తగదని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎయిడ్స్‌ బాధితులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని.. ఆ వ్యాధి సోకకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు ఆయన సూచించారు. హైదరాబాద్‌ ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.

8. నవంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.31 లక్షల కోట్లు

జీఎస్‌టీ వసూళ్లు వరుసగా ఐదో నెలా రూ.లక్ష కోట్లను అధిగమించాయి. నవంబరులో రూ.1.31 లక్షల కోట్లు వసూలయ్యాయి. 2017 జులైలో జీఎస్‌టీని అమల్లోకి తెచ్చిన తర్వాత ఇదే రెండో అత్యధిక ఆదాయం. నవంబరు నెలకుగానూ రూ.1,31,526 కోట్ల జీఎస్‌టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ బుధవారం వెల్లడించింది.

9. ఒమిక్రాన్‌ భయంతో కఠిన ఆంక్షలు సరికాదు: డబ్ల్యూహెచ్‌వో

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే 14 దేశాలకు విస్తరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ కట్టడిలో భాగంగా పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌పై అతిగా స్పందించొద్దని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ప్రపంచ దేశాలకు సూచించారు. కఠిన ఆంక్షలు అవసరం లేదన్నారు. 

10. జట్టు ప్రయోజనాల కోసమే కోహ్లి అలా చేశాడు : పార్థివ్‌ పటేల్

రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. జట్టు ప్రయోజనాల కోసమే తనకు చెల్లించే మొత్తాన్ని తగ్గించుకున్నాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ పార్థివ్ పటేల్ అన్నాడు. గత సీజన్‌లో రూ.17 కోట్లు తీసుకున్న విరాట్‌ కోహ్లి.. ఐపీఎల్-2022 సీజన్‌కి రూ. 15 కోట్లే తీసుకోనున్నాడు. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని