Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 09 Sep 2021 16:37 IST

1. సర్కారు వారి సినిమా టికెట్లు

అమరావతి: రాష్ట్రంలోని థియేటర్లలో సినిమా టికెట్లను ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే విక్రయించనుంది. సింగిల్‌ థియేటర్లలోనైనా, మల్టీప్లెక్స్‌లలో అయినా టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేందుకు వెబ్‌ పోర్టల్‌ రూపొందించనుంది. రైల్వే ఆన్‌లైన్‌ టికెట్‌ వ్యవస్థ తరహాలో ఇది ఉంటుంది. ఏపీ ఫిల్మ్‌, టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ దీన్ని నిర్వహించనుంది. ఆ పోర్టల్‌ ద్వారా సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మనుంది.

2. ఇకపై హైదరాబాద్ నుంచి లండన్‌కు నేరుగా..

లండన్‌కు రాకపోకలు సాగించే తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. ఇకపై హైదరాబాద్ నుంచి లండన్‌కు నేరుగా విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు లండన్ నుంచి మొదటి విమానం సెప్టెంబర్ 9న హైదరాబాద్ చేరుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 10వ తేదీన హైదరాబాద్ నుంచి లండన్ నాన్‌స్టాప్ విమానం టేకాఫ్ కానుందని వెల్లడించింది.

3. వినాయక మండపాలు ప్రైవేటు స్థలాల్లోనే

ప్రైవేటు ప్రదేశాల్లో వినాయకుడి విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. పూజా సమయంలో ఒక్కసారికి అయిదుగురిని మాత్రమే అనుమతించాలని నిర్వాహకులకు స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ మంది ఒకచోట చేరకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

4. పనులు ఆపామన్న ఏపీ... ఆపలేదన్న తెలంగాణ

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చెందిన పనులను జులై 7 నుంచి నిలిపివేశామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి నివేదించింది. పనులు ఆపలేదని, కొనసాగుతూనే ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. పనులు చేయడంలేదన్న ఏపీ తరఫు న్యాయవాది హామీని రికార్డు చేసిన ఎన్జీటీ తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. 

5. కోతకు తగ్గ వాత

అధ్యాపకులు లేని కళాశాలలకు జేఎన్‌టీయూ-హెచ్‌ గట్టి షాక్‌ ఇచ్చింది. ఇంజినీరింగ్‌ బ్రాంచీల వారీగా సీట్లను తగ్గించి కళాశాలలకు అఫిలియేషన్‌ జారీ చేసింది. జేఎన్‌టీయూ పరిధిలో 148 కళాశాలలు ఉన్నాయి. కరోనా మహమ్మారి సమయంలో అధ్యాపకులను కళాశాలలు విధుల్లోంచి తొలగించాయి. కొన్ని కోర్సులకు కనీస సంఖ్యలో అధ్యాపకులు లేరు. తాజాగా ఆయా కళాశాలపై జేఎన్‌టీయూ కఠిన చర్యలు తీసుకుంది. 

ఆకాశమార్గాన ఔషధాల సరఫరా

6. శతాబ్దపు చివరిలో...తీర ప్రాంతాలకు కష్టకాలం

తీర ప్రాంతాలకు మున్ముందు కష్టకాలం తప్పదట! ఉష్ణోగ్రతల పెరుగుదల, భూతాపం కారణంగా... ఈ శతాబ్దం చివరినాటికి ప్రపంచ వ్యాప్తంగా తీర ప్రాంతాలు తరచూ విపత్తులను ఎదుర్కోక తప్పదని తాజా అధ్యయనం హెచ్చరించింది. అమెరికాలోని ‘పసిఫిక్‌ నార్త్‌వెస్ట్‌ నేషనల్‌ లేబొరేటరీ’ నేతృత్వాన... అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ అధ్యయనం సాగించింది. ‘నేచర్‌ క్లైమేట్‌’ పత్రిక ఈ వివరాలు అందించింది.

7. చిన్నమ్మకు షాక్‌.. రూ.100కోట్ల విలువైన ఆస్తులు జప్తు!

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళకు ఆదాయపు పన్ను విభాగం అధికారులు గట్టి షాకిచ్చారు. అవినీతి కేసులో ఆమెకు చెందిన దాదాపు రూ. 100కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులోని పయనూర్‌ గ్రామంలో దాదాపు 24 ఎకరాల్లో ఉన్న 11 ఆస్తులను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 

8. ఎప్పట్లానే.. ఇస్లామిక్‌ రాజ్యం

అఫ్గానిస్థాన్‌లో ఇస్లామిక్‌ వ్యవస్థే కొనసాగుతుందని, షరియా చట్టం ప్రకారమే పాలన కొనసాగుతుందని తాలిబన్లు స్పష్టం చేశారు. తాము నెలకొల్పే వ్యవస్థకు అనుగుణంగానే తమ జీవితాలను అఫ్గాన్‌ ప్రజలు క్రమబద్ధీకరించుకోవాలని పేర్కొంది. ఇస్లామిక్‌ ఎమిరేట్‌ పేరుతో మంగళవారం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం.. తాలిబన్లు తమ పరిపాలన ఎలా ఉంటుందో స్పష్టం చేశారు. 

9. 18 నుంచి విలాస క్రూజ్‌ లైనర్‌: ఐఆర్‌సీటీసీ

తొలి స్వదేశీ క్రూజ్‌ లైనర్‌ సేవలను ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) బుధవారం వెల్లడించింది. వాటర్‌వేస్‌ లీజర్‌ టూరిజం కు చెందిన కార్డెలియా క్రూజెస్‌ అనే ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో దీన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ సంస్థ దేశంలో ప్రీమియం క్రూజ్‌ లైనర్‌గా ఉంది. గోవా, డయ్యు, లక్షద్వీప్‌, కోచి, శ్రీలంక తదితర ప్రాంతాలకు వీటిని నడపనుంది. 

10. మహి తోడుగా మహా సమరానికి..

టీ20 ప్రపంచకప్‌లో పోటీపడే జట్టులో ఎవరెవరుంటారని చర్చ జరుగుతుంటే బీసీసీఐ నిర్ణయం అందరి దృష్టిని మరో వైపు మళ్లించింది. ప్రపంచకప్‌లో పోటీపడే భారత జట్టుకు మాజీ కెప్టెన్‌ ధోనీని మెంటార్‌గా నియమించింది. ఇక టోర్నీ కోసం సెలక్షన్‌ కమిటీ బుధవారం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఆశ్చర్యకరంగా   సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు స్థానం లభించింది. టోర్నీ అక్టోబరు 17 నుంచి యూఏఈ, ఒమన్‌లో జరుగుతుంది. 

స్వితోలినాకు షాక్‌
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని