Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Published : 05 Dec 2021 08:57 IST

1. అడుగడుగునా నిలదీద్దాం!

ధాన్యం సేకరణ అంశంపై కేంద్రాన్ని అడుగడుగునా నిలదీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ ఎంపీలకు సూచించారు. పార్లమెంటు లోపల, బయట సాగుతున్న నిరసనలను ఉద్ధృతం చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర వైఖరిని ఎండగట్టాలని, విభజన హామీల అమలు వైఫల్యాలు, నిధుల విడుదలలో నిర్లక్ష్యంపైనా ప్రశ్నించాలని ఆదేశాలిచ్చారు. ఇదే అంశంపై పార్టీ ఆధ్వర్యంలో దిల్లీలో ప్రత్యక్ష ఆందోళనకు దిగడంపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు.

2. ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు

ఉత్తరాంధ్రకు జవాద్‌ తుపాను ముప్పు తప్పింది. శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి చేరనుంది. అప్పటికి ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుందని వాతావరణశాఖ తెలిపింది. తుపాను బలహీనపడినా దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాలపూర్‌ ఐఎండీ అధికారి ఉమాశంకర్‌దాస్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.

3. జవాద్‌ తుపాన్‌ ఎఫెక్ట్‌.. పలు రైళ్లు రద్దు

జవాద్‌ తుపాను తీవ్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేపు బయలుదేరాల్సిన భువనేశ్వర్‌- సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌(17015), పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌(17479), పలాస -విశాఖపట్నం (18531), కిరండోల్‌- విశాఖపట్నం(18552), తిరుపతి -హౌరా ఎక్స్‌ప్రెస్‌(20890), భువనేశ్వర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌(22819), భువనేశ్వర్‌ -తిరుపతి ఎక్స్‌ప్రెస్‌(22871), హౌరా-తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్‌(12663), భువనేశ్వర్‌ - బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (12845) రైళ్లు రద్దు చేసినట్టు రైల్వేశాఖ తెలిపింది.

4. పెరిగిన కేసులు, మరణాలు.. అయిదు రాష్ట్రాలకు కేంద్రం లేఖ

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉందని ఊరట చెందుతున్న సమయంలో.. ఒమిక్రాన్ ఆందోళన మొదలైన విషయం తెలిసిందే. ఇదే తరుణంలో రోజురోజుకి కొత్త కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం శనివారం ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మిజోరాం, జమ్మూ-కశ్మీర్‌లకు లేఖ రాసింది. హాట్‌స్పాట్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అందులో సూచించింది.

5. బస్సు ఎక్కాలంటే మాస్కు ఉండాల్సిందే

సరైన మాస్క్‌ ఉంటేనే ప్రయాణికులను బస్సుల్లోకి అనుమతించాలి. డ్రైవర్‌, కండక్టర్‌ విధిగా మాస్క్‌ ధరించాలి. శానిటైజర్‌ సీసాను అందుబాటులో ఉంచుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ‘డిపో నుంచి బస్సులు బయటకు వచ్చే ప్రతిసారీ పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలి. బస్‌స్టాండు ఆవరణలో ప్రయాణికులు మాస్కులు ధరించడం అనివార్యమని స్పష్టంచేసే బ్యానర్లు ఏర్పాటుచేయాలి’ అని సజ్జనార్‌ ఆదేశించారు.

6. ఆరోగ్య ఓరుగల్లు

వరంగల్‌ను ఆరోగ్య నగరం(హెల్త్‌ సిటీ)గా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలోనే అతి పెద్ద, అత్యాధునిక వసతులతో కూడిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.1,100 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వు(జీవో నం.158) జారీ చేసింది. 15 ఎకరాల్లో, 24 అంతస్తులతో రెండు వేల పడకల సామర్థ్యంతో నిర్మించేందుకు అనుమతించింది. ఆసుపత్రి భవన నిర్మాణ నమూనాను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం విడుదల చేశారు.

7. ఎత్తిపోతలకు కరెంటు భారీ వినియోగం

తెలంగాణలో సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాలకు కరెంటు వినియోగం భారీగా ఉంది. గత ఏప్రిల్‌ నుంచి అక్టోబరు నాటికే 261.60 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. ఈ పథకాలకు వినియోగించే కరెంటుకు యూనిట్‌కు రూ.5.80 చొప్పున ఛార్జీ చెల్లించాలి. ఇది పెరగదు, తగ్గదు. అదనంగా ఎత్తిపోతల మోటార్ల సామర్థ్యాన్ని బట్టి నెలకు కిలోవాట్‌కు రూ.165 చొప్పున ఏటా జులై నుంచి నవంబరు దాకా ...మోటార్లు నడిపినా నడపకపోయినా స్థిరఛార్జీ కింద విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు నీటిపారుదల శాఖ చెల్లించాలి.

8. ఆర్బిట్రేషన్‌లో కొత్త పంథా

హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న ఐఏఎంసీ (ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌) ఆర్బిట్రేషన్‌ ప్రక్రియను ఆసాంతం మార్చనుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. సింగపూర్‌, లండన్‌ కేంద్రాల స్థాయిలో హైదరాబాద్‌లో ఈ నెల 18న ఐఏఎంసీ ప్రారంభమవుతోందన్నారు. ఇక్కడి ప్యానల్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేటర్లు, పరిపాలనా సిబ్బంది, మౌలిక వసతులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌లో శనివారం ఐఏఎంసీ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది.

9. క్రిప్టో కరెన్సీ కాదు.. క్రిప్టో అసెట్‌

క్రిప్టో కరెన్సీని ‘క్రిప్టో అసెట్‌’గా పేరు మార్చడంతో పాటు, మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ పరిధిలోకి దీనిని తీసుకురావాలని మోదీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని సమాచారం. అంటే సెబీ దగ్గర నమోదైన ప్లాట్‌ఫాంలు, ఎక్స్ఛేంజీల ద్వారా మాత్రమే క్రిప్టో లావాదేవీలు జరగాలి. సెబీ వద్ద నమోదు కావడానికి ప్రస్తుత క్రిప్టో ఎక్స్ఛేంజీలకు గడువు తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇవన్నీ అమల్లోకి రావడానికి వీలుగా ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒక బిల్లును ప్రతిపాదించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అత్యున్నతాధికారి తెలిపారు. 

10. రష్యాతో బంధం మరింత బలోపేతం

భారత్‌-రష్యాల బంధం మరింత బలపడేలా సోమవారం ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదరనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆ రోజున భారత పర్యటనకు రానున్నారు. ఆ దేశంలో కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ దిల్లీ రానుండడం విశేషం. ‘‘డిసెంబరు 6 పూర్తిగా రష్యా రోజు’’గా ఉండనుంది. ఆ రోజంతా పలు స్థాయిల్లో చర్చలు జరగనున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ-పుతిన్‌ల శిఖరాగ్ర సదస్సు సాయంత్రం 5.30కు ప్రారంభమవుతుంది
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని