Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Published : 06 Aug 2021 20:59 IST

1. TS news: 16 నుంచి రైతు ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము

రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,006 కోట్లు జమ చేయనున్నట్లు మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. రూ.50 వేల వరకు రుణమాఫీ పూర్తి చేయాలని ఇటీవల కేబినెట్‌ నిర్ణయించిన నేపథ్యంలో బ్యాంకర్లతో మంత్రులు సమావేశమయ్యారు. రుణమాఫీ అమలు, రైతుల ఖాతాల్లో నగదు జమ సంబంధిత అంశాలపై చర్చించారు. ఆగస్టు 16 నుంచి రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయనున్నట్లు మంత్రులు వెల్లడించారు.

2. నాస్కామ్‌ కృత్రిమ మేధ అవార్డుకు తెలంగాణ ఎంపిక

కృత్రిమ మేధపై పరిశోధన, ప్రాజెక్టులపై అవలంభించిన విధానాలకు గానూ తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు లభించింది. ఎక్స్‌పీరియన్స్‌-ఏఐ సదస్సులో ప్రభుత్వ ఐటీ విభాగానికి ‘నాస్కామ్‌ కృత్రిమ మేధ గేమ్‌ ఛేంజర్‌ అవార్డు’ దక్కింది. ఈ అవార్డు కోసం మొత్తం 300 దరఖాస్తులు రాగా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుకు ఈ అవార్డు లభించింది. 

తెలంగాణలో ఆర్టీసీ కార్గో సేవల విస్తరణ

3. వైకాపా ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నం : పేర్ని నాని

యాంత్రిక తప్పిదం వల్లే పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు విరిగినట్లు ప్రాథమికంగా నిర్ధరణ అయిందని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు.  ఈఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరైనా  విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  మాన్యువల్‌ గేట్ల స్థానంలో హైడ్రాలిక్‌ గేట్ల ఏర్పాటుకు అధ్యయనం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారని తెలిపారు. 

4. రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు పేరు మార్చడం దారుణం: రేవంత్‌రెడ్డి

రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు పేరు మార్చి ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డుగా నామకరణం చేయడం దారుణమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఇది భాజపా పాలకుల సంకుచిత బుద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. దేశంలో క్రీడాభివృద్ధికి ఎంతో కృషి చేసిన స్వర్గీయ రాజీవ్‌గాంధీ పేరు ఖేల్‌రత్నగా ఉండడం సముచితమన్నారు.

5. కేంద్రమంత్రి నిర్మలను అడ్డుకునేందుకు ఉక్కు కార్మికుల యత్నం

విశాఖ విమానాశ్రయం వద్ద ఉక్కు పరిరక్షణ సమితి ఆందోళన చేపట్టింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన కార్మిక సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయం ముట్టడికి యత్నించిన ఉక్కు ఉద్యోగులను విమానాశ్రయం ప్రవేశమార్గం వద్ద అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి వాహనాల్లో ఎక్కించారు.

6. ట్ర్రైబ్యునల్స్‌ ఉండాలా? వద్దా?.. అధికారుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

దేశంలో ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీకి సంబంధించి అధికారుల తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ట్రైబ్యునళ్లు ఉండడం అధికారులకు ఇష్టం లేనట్లు కనిపిస్తోందంటూ వ్యాఖ్యానించింది. ట్రిబ్యునళ్లలో ఖాళీలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అధికారుల తీరుపై సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు.

7. భారత్‌లో తొలి ‘ఈటా’ వేరియంట్‌ కేసు

కరోనా వైరస్​ జన్యు క్రమాన్ని మార్చుకుంటూ పంజా విసురుతోంది. రోజుకో రూపాన్ని ధరిస్తూ విస్తరిస్తోంది. బ్రిటన్​లో తొలిసారి గుర్తించిన ‘ఈటా వేరియంట్​’ భారత్​కూ పాకింది. కర్ణాటక మంగళూరులోని ఓ వ్యక్తిలో ఈ కొత్త రకాన్ని గుర్తించినట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుడు నాలుగు నెలల క్రితం దుబాయ్​ నుంచి దక్షిణ కన్నడ జిల్లాలోని మూదబిద్రే గ్రామానికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

8. మోదీ జీ! ముందు.. నరేంద్రమోదీ స్టేడియం పేరు మార్చండి

క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నగా మారుస్తున్నామని... ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్దిసేపట్లోనే సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు స్వాగతం పలికారు. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన నెటిజన్లు మరో ఆలోచనను పంచుకున్నారు. అదేంటంటే.. ఇక పై క్రీడా పురస్కారాలన్నింటికి.. రాజకీయనేతల పేర్లు కాకుండా క్రీడాకారుల పేర్లే పెట్టాలన్నారు.

9. ప్రపంచ కుబేరుడు బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ చెప్పిన 3 విజయ సూత్రాలు!

ఇప్పటి వరకు ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ను ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపారవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ వెనక్కి నెట్టారు. ఆయా కంపెనీల రోజువారీ షేరు కదలికల్ని బట్టి మారే ‘ఫోర్బ్స్‌ రియల్‌-టైమ్‌ బిలియనీర్స్’ జాబితాలో 198.9 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆర్నాల్ట్‌ తొలి స్థానంలో నిలిచారు. 

10. ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా కీలక ఆధిక్యం..

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టుపై 95 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. కేఎల్‌ రాహుల్‌ (84; 214 బంతుల్లో 12x4), రవీంద్ర జడేజా (56; 86 బంతుల్లో 8x4, 1x6) అర్ధశతకాలతో రాణించగా చివర్లో జస్ప్రిత్‌ బుమ్రా (28; 34 బంతుల్లో 3x4, 1x6) ధాటిగా ఆడాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో రాబిన్‌సన్‌ ఐదు వికెట్లతో చెలరేగగా అండర్సన్‌ నాలుగు వికెట్లు సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని