Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లో పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 02 Sep 2021 22:22 IST

1. పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట

పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల పరంపర కొనసాగుతోంది. పురుషుల హైజంప్‌-టీ47 విభాగంలో భారత అథ్లెట్‌ నిషాద్‌ కుమార్‌ 2.06 మీటర్ల ఎత్తు దూకి రెండో స్థానంలో నిలిచాడు. ఫలితంగా భారత్‌కు రజతం సాధించి పెట్టాడు. ఇది జరిగిన గంటలోనే మరో అథ్లెట్‌ వినోద్‌ కుమార్‌ డిస్కస్‌త్రో విభాగంలో కాంస్యం సాధించాడు. దాంతో భారత్‌కు ఒకేరోజు మూడో పతకం ఖాయం చేశాడు. అంతకుముందు మహిళల టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో ఈ ఉదయం భవీనా పటేల్ రజతం సాధించిన సంగతి తెలిసిందే. 

2. ‘రాముడు లేకుండా అయోధ్య లేదు..!’

రాముడు లేకుండా అయోధ్య లేదని.. రాముడు నివసించిన చోటే అయోధ్య ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ‘రాముడు లేకుండా అయోధ్య అసలు ఆయోధ్యనే కాదు. రాముడు నివసించిన చోటే అయోధ్య ఉంది. ఈ ప్రాంతంలో ఆయన శాశ్వతంగా నివసిస్తాడు. అందుకే ప్రదేశం చిరస్థాయిగా ఆయోధ్యగా ఉండిపోతుంది’ అని రామాయణ్‌ కాంక్లేవ్‌ ప్రారంభోత్సవ సందర్భంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు.

3. Mann Ki Baat: దేశయువత ఆలోచన ధోరణి మారింది..

దేశంలో స్టార్టప్‌ సంస్కృతి చాలా శక్తివంతంగా మారిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేవలం నగరాలకే కాకుండా చిన్న పట్టణాల్లోనూ ఈ తరహా కల్చర్‌ మరింత పెరిగిందని.. ఇది దేశ యువత ఉజ్వల భవిష్యత్తును సూచిస్తోందన్నారు. దేశ యువత ఆలోచన ధోరణి మారిందన్న మోదీ.. నూతనంగా, భారీ స్థాయిలో ఏదైనా చేయాలన్న తపన వారిలో పెరిగిందని మన్‌ కీ బాత్‌ ప్రశంసించారు. 

4. రైతుల సమస్యలపై రైతులతోనే కమిటీ వేయాలి: పాలగుమ్మి సాయినాథ్‌

దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతోనే కమిటీ వేయాలని ప్రముఖ పాత్రికేయుడు, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ డిమాండ్‌ చేశారు.  స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను 14 ఏళ్లు అయినా ఏ ప్రభుత్వం అమలు చేయడం లేదని గుర్తు చేసిన సాయినాథ్‌.. ఇప్పటికైనా రైతులకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్‌ సదుపాయం పెంచాలని డిమాండ్‌ చేశారు. 

5. దేవాదుల జలాలు సద్వినియోగం చేసుకోవాలనేదే సీఎం ఆలోచన: ఎర్రబెల్లి

దేవాదుల రిజర్వాయర్‌ పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో దేవాదుల ప్రాజెక్టుపై మంత్రి సత్యవతి రాథోడ్‌, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో కలిసి ఎర్రబెల్లి సమీక్షించారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్‌ పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించారు. 60 టీఎంసీల దేవాదుల నీటిని వరంగల్‌ జిల్లాకే పూర్తిగా వాడుకోవాలని సీఎం కేసీఆర్‌ చెప్పారని తెలిపారు.

6. పాదయాత్రలు, సభలు చూస్తుంటే విడ్డూరంగా ఉంది: మోత్కుపల్లి

ప్రతిపక్షాల దగ్గర నీతి లేదని.. ఒక్కసారిగా దళితులపై ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు దళితబంధును వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ బేగంపేటలోని ఆయన నివాసంలో తలపెట్టిన ఒక్కరోజు దీక్షను మోత్కుపల్లి విరమించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దళితుల కోసం పాదయాత్రలు చేయడం, సభలు నిర్వహించడం చేస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు.

7. హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌పై సండే స్పెషల్‌
వారాంతంలో ట్యాంక్‌బండ్‌ అందాలను వీక్షించేవారి కోసం ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ను దారి మళ్లించేందుకు మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఈ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. దీంతో సందర్శకులు ఇవాళ ట్యాంక్‌బండ్‌కు భారీగా తరలివచ్చారు. ఇకపై ప్రతి ఆదివారం వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. 

తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం

8. అంక్లేశ్వర్‌లో తొలి బ్యాచ్‌ కొవాగ్జిన్‌ టీకాలు విడుదల

భారత్‌ బయోటెక్‌ గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంటు నుంచి కొవాగ్జిన్‌ తొలి బ్యాచ్‌ టీకాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ విడుదల చేశారు. అంక్లేశ్వర్‌ పర్యటనలో భాగంగా ఆయన భారత్‌ బయోటెక్‌ యూనిట్‌ను ఆదివారం సందర్శించారు. వైరస్‌ బారి నుంచి ప్రజలను రక్షించడానికి టీకా ఒక్కటే ప్రధాన మార్గమని.. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ అందించేలా సన్నాహాలు చేపట్టామని తెలిపారు.

9. కాబుల్‌లో రాకెట్‌ దాడి.. చిన్నారి మృతి.. అమెరికా సైన్యం మరో దాడి!

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో రాకెట్‌ దాడి జరిగింది. మరో ఉగ్రదాడి జరగొచ్చన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఘటన వెలుగు చూడడంతో కలకలం రేగింది. అమెరికా సైనికులే లక్ష్యంగా ఐసిస్‌ ఉగ్రవాదులు ఈ రాకెట్‌ దాడికి పాల్పడి ఉండొచ్చని తెలుస్తోంది. 

అఫ్గాన్‌ విడిచి వెళ్లేందుకు.. 2వేల మంది జర్నలిస్టులు సిద్ధం!

10. టీమిండియా నాలుగు కుందేళ్లను ఆడించకూడదు: వాన్

టీమ్‌ఇండియా లోయర్‌ ఆర్డర్‌లో ఏకంగా నాలుగు కుందేళ్లను (స్పెషలిస్టు బౌలర్లు షమి, బుమ్రా, ఇషాంత్‌, సిరాజ్‌) ఆడించకూడదని ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఏ జట్టూ అలా చేయదని గత రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీసేన ఇలా ఎందుకు ఆడిందో అర్థం కాలేదని అన్నాడు. ఇరుజట్ల మధ్య ముగిసిన మూడో టెస్టుపై స్పందించిన వాన్‌.. తమ సారథి జోరూట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతూ కోహ్లీ నిర్ణయాలను తప్పుబట్టాడు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని