Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 07 Sep 2021 21:00 IST

1. తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. 

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది. రోజుకు 2వేల సర్వదర్శనం టోకెన్లను మాత్రమే జారీ చేయనున్నట్లు తెలిపింది. తిరుపతి శ్రీనివాసం కాంప్లెక్స్‌లోని కౌంటర్లలో టోకెన్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది.

ఏడు కొండలు.. 7 అగరబత్తుల బ్రాండ్లు ఇవే..

2. ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ

వెలిగొండ ప్రాజెక్టుతో పాటు తెలుగు గంగ ప్రాజెక్టు విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్‌లు తక్షణమే సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే ఏపీ ఇంజినీర్ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ)కి లేఖ రాశారు.  తెలంగాణ చేసిన ఫిర్యాదు లేఖను కూడా లేఖతో పాటు జతపరిచి ఏపీకి పంపించారు.

3. డిగ్రీ కళాశాలల అధ్యాపకుల బదిలీలకు సీఎం ఆమోదం

డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సాధారణ బదిలీలకు అవకాశం కల్పించే ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆమోదం తెలిపారు. రెండేళ్ల సర్వీసు పూర్తయిన వారికి బదిలీ అర్హత కల్పించారు. ఐదేళ్ల సర్వీసు ఒకే చోట పూర్తి అయిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

4. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కేటీఆర్‌

తెలంగాణలో చేనేత, జౌళి శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించిన సంఘాలు, లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.73.50 కోట్లు విడుదల చేసింది. పథకాల అమలు, కార్యక్రమాల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో మంత్రి కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చేనేత కార్మికులకు సంబంధించిన పలు అంశాలపై రెండు వారాల క్రితం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుతో కలిసి నిర్వహించిన సమీక్షకు కొనసాగింపుగా అధికారులతో కేటీఆర్ ఇవాళ మరోమారు సమీక్షించారు.

5. అధికారం కాపాడుకొనేందుకు భాజపాతో కేసీఆర్‌ దోస్తీ: జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ ఎదుగుదలను అడ్డుకోవడానికి తెరాస, భాజపా కుట్రలు చేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆడే ఆటలో బండి సంజయ్‌ బలికాక తప్పదన్నారు. గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారం కాపాడుకోవడానికి భాజపాతో కేసీఆర్‌ దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. 

6. పింఛన్ల నిలిపివేత.. వృద్దులు, దివ్యాంగుల ఆక్రందన

పింఛన్ల రద్దుతో బాధితులంతా కలెక్టర్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. కర్నూలు కలెక్టరేట్‌కు పెద్దసంఖ్యలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తరలివస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న పింఛన్ అర్థాంతరంగా నిలిపివేసినట్లు బాధితులు వాపోయారు. అన్ని అర్హతలు ఉన్నా పింఛన్ ఆపేశారని కన్నీటి పర్యంతమయ్యారు. 

7. కాలానికి అనుగుణంగా బోధనా పద్ధతులు మారాల్సిందే..!

వేగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన-అభ్యసన పద్ధతులను ఎప్పటికప్పుడు నిర్వచించుకోవాల్సి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తద్వారా మన విద్యా రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టుకోగలమని ఉద్ఘాటించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన ‘శిక్షక్‌ పర్వ్‌’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

8. థర్డ్‌వేవ్‌ రావడం కాదు.. అది ఇక్కడే ఉంది.. జాగ్రత్త!

కరోనా మూడో దశ ఇప్పటికే వచ్చేసిందని ముంబయి మేయర్‌ కిశోరి పెండేకర్‌ అన్నారు. వినాయక చవితి వేడుకలు ఇంట్లోనే జరుపుకొంటానన్న ఆమె.. తానెక్కడికీ వెళ్లడం లేదన్నారు. ‘కరోనా థర్డ్‌ వేవ్‌ రావడం కాదు.. అది ఇక్కడే ఉంది’ అంటూ మంగళవారం ఆమె మీడియాతో అన్నారు. నాగ్‌పూర్‌లో కూడా ఇప్పటికే దీన్ని ప్రకటించారని తెలిపారు. ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

9. ప్రభుత్వాన్ని లొంగదీసుకునేందుకే ఈడీ చర్యలు: శరద్‌ పవార్‌

మహారాష్ట్ర ప్రభుత్వాన్ని లొంగదీసుకునే ప్రయత్నాల్లో భాగంగానే అధికార కూటమి నాయకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చర్యలు చేపడుతోందని ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కాలరాయడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే ప్రయత్నమేనని విమర్శించారు. మనీ లాండరింగ్‌ కేసులో భాగంగా అధికారంలో ఉన్న మహా వికాస్‌ అగాడీకి చెందిన పలు పార్టీల నేతలపై ఈడీ దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో శరద్‌ పవార్‌ ఈ విధంగా స్పందించారు.

10. టీమ్‌ఇండియా ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్టు జట్టు: షేన్‌ వార్న్‌
ఓవల్‌ వేదికగా  జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై  157 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా ఘన  విజయం సాధించింది. దీంతో భారత జట్టుపై భారత మాజీ ఆటగాళ్లతోపాటు ఇతర దేశాల ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్ కూడా టీమ్‌ఇండియాను ట్విటర్ వేదికగా ప్రశంసించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని