Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 న్యూస్‌

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Published : 05 Oct 2021 20:55 IST

1. చంద్రబాబు ఆరోపణలపై న్యాయపరంగా చర్యలు: సజ్జల

తెదేపా నేతలు డ్రగ్స్‌ ఇష్యూని ఆంధ్రప్రదేశ్‌కు అంటగట్టాలని చూస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎక్కడ  ఏది జరిగినా ప్రభుత్వంపై బురద చల్లాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. ‘‘పాండోరా పత్రాల్లో జగన్‌ పేరు ఉండొచ్చన్న వ్యాఖ్యలు దారుణం. చంద్రబాబు ఆరోపణలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం’’ అని సజ్జల అన్నారు.

2. కేటాయింపుల మేరకే జలాలు: రజత్‌కుమార్‌

కేటాయింపుల మేరకే గోదావరి జలాలను తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటోందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఛైర్మన్‌కి లేఖ రాశారు. చనాఖా-కొరటా, చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం లేదని లేఖలో పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టులపై ఏపీ అభిప్రాయాలు అక్కర్లేదన్నారు.

3. తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్‌పై ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి సహా అధికారులు, సిబ్బందిని, బ్యాంకు అధికారులను విచారించిన కమిటీ.. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాల నిర్వహణలో శాఖాపరమైన నిర్లక్ష్యం జరిగిందని కమిటీ నిర్ధారించినట్లు సమాచారం. 

4. ఎంపీ అర్వింద్‌ పసుపు రైతులను మోసం చేశారు: షర్మిల

నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లిలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌ షర్మిల నిరుద్యోగ దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... ఎంపీ అర్వింద్‌ పసుపు రైతులను మోసం చేశారని విమర్శించారు. పసుపుబోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేశాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిన రూ.4లక్షల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయని ప్రశ్నించారు.

5. బ్యాలెట్‌ పద్ధతిలోనే ‘మా’ ఎన్నికలు: కృష్ణమోహన్‌

‘మా’ పోలింగ్‌పై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ వివరణ ఇచ్చారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే పోలింగ్‌ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ‘‘పోలింగ్‌ బ్యాలెట్‌ విధానంలోనే జరగాలని మంచు విష్ణు లేఖ రాశారు. ఈవీఎం ద్వారా పోలింగ్‌ జరపాలని ప్రకాశ్‌రాజ్‌ కోరారు. విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ ప్రతిపాదనలు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ కృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లాం. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ కూడా బ్యాలెట్‌కే మొగ్గు చూపారు’’ అని కృష్ణమోహన్‌ తెలిపారు.

6. లఖింపుర్‌ ఖేరి ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ ఉత్తర్‌ప్రదేశ్ న్యాయవాదులు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు మంగళవారం లేఖ రాశారు. రైతులపై దూసుకొచ్చిన వాహనం కేంద్రమంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ది అని, అందులో ఆయన కూడా ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

7. చైనా విషయంలో సిద్ధంగా ఉండాలి..!

చైనా విమానాల విషయంలో ఇక ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని తైవాన్‌ ప్రీమియర్‌ సూ త్సెంగ్‌ ఛాంగ్‌  మంగళవారం పేర్కొన్నారు. ‘‘తైవాన్‌ కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. చైనా మళ్లీ మళ్లీ మన గగనతంలోకి వస్తోంది. ప్రాదేశిక శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా తైవాన్‌ గగనతల రక్షణ జోన్లలోకి చైనా చొరబడటాన్ని ప్రపంచం చూస్తోంది. తైవాన్‌ రక్షణ విషయంలో సొంతంగానే బలోపేతం కావాలి. అప్పుడే చైనా ఆక్రమణను అడ్డుకోగలం’’ అని ఛాంగ్‌ పేర్కొన్నారు.

2022 తర్వాతే విమానయాన రంగానికి మంచి రోజులు!

8. షిర్డీ: దర్శనానికి అక్టోబర్‌7 నుంచి అనుమతి

ఎన్నో రోజులుగా షిర్డీ వెళ్లాలనుకుని.. ఎదురుచూసే బాబా భక్తులకు ఇది తీపి కబురు. కరోనా కారణంగా మూసివేసిన షిర్డీ ఆలయం మళ్లీ తెరుచుకోనుంది. నవరాత్రుల తొలిరోజైన అక్టోబర్ 7 నుంచి షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తులను అనుమతించాలని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌టీ) నిర్ణయించింది. ఈమేరకు పలు నియమ నిబంధనలు పాటిస్తూ సాయిబాబాను దర్శించుకోవచ్చని ఎస్‌ఎస్‌ఎస్‌టీ పేర్కొంది.

9. రేపటిలోగా ప్రియాంకను విడుదల చేయలేదో.. సిద్ధూ వార్నింగ్‌!

యూపీ లఖింపుర్‌ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ సీనియర్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్ధూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా ఆమెను విడుదల చేసి, నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పంజాబ్‌ నుంచి లఖింపుర్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తామని యూపీ పోలీసులను హెచ్చరించారు. 

భాజపా భారీ మూల్యం చెల్లించక తప్పదు: పవార్‌

10. టీవీఎస్‌-టాటా పవర్‌ మధ్య కీలక ఒప్పందం..!

టీవీఎస్‌ మోటార్స్‌ - టాటా పవర్‌ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ ఎంవోయూ ప్రకారం దేశ వ్యాప్తంగా విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌ వ్యవస్థల వృద్ధి కోసం ఇరు కంపెనీలు కలిసి పనిచేస్తాయి. టీవీఎస్‌ మోటార్స్ సంస్థల ప్రాంగాణాల్లో సౌరశక్తితో విద్యుత్తు ఉత్పత్తి ఏర్పాట్లు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని