Published : 28/11/2021 20:56 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోటాప్ 10 వార్తలు

1. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ కన్నుమూత

ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివ శంకర్‌ మాస్టర్‌ ఇక లేరు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. తమిళ, తెలుగు చిత్రాలతో సహా 10 భాషల్లోని 800లకు పైగా చిత్రాల్లో పాటలకు శివశంకర్‌ మాస్టర్‌ నృత్యాలు సమకూర్చారు. 1975లో ‘పాట్టు భరతమమ్‌’ చిత్రానికి సహాయకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ‘కురువికూడు’ చిత్రంతో నృత్య దర్శకుడిగా మారారు. 

2. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ బాటలో జియో.. ఛార్జీలు పెంపు!

ప్రీపెయిడ్‌ ఛార్జీలను 20 శాతం మేర పెంచుతున్నట్లు జియో ప్రకటించింది. పెంచిన ఛార్జీలు డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. జియో ఫోన్‌ కోసం అందుబాటులో ఉన్న ప్రాథమిక ప్లాన్‌కు రూ.75 బదులు ఇకపై రూ.91 చెల్లించాల్సి ఉంటుంది. రూ.199 ప్లాన్‌ (28 రోజులకు 1.5జీబీ/రోజుకు) ధరను రూ.239కు పెంచింది. అలాగే, రూ.444 ప్లాన్‌కు రూ.533, రూ.555 ప్లాన్‌కు రూ.666 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

3. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలి: కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రగతి భవన్‌లో ముగిసింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోవాలని సూచించారు. ‘‘కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్‌ చట్టాల రద్దు కోసం పోరాడాలి. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం పట్టుబట్టాలి’’ అని చెప్పారు. 

4. ఏపీలో ఉద్యోగ సంఘాల పోరుబాట

పీఆర్సీతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం ఏపీలో ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఇవాళ ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. పీఆర్‌సీ నివేదిక ఇస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. 

5. ఏపీలో మళ్లీ వాన... కడప జిల్లాలో పాఠశాలలకు సెలవు

ఇటీవల కురిసన వర్షాల నుంచి జనం ఇంకా తేరుకోక ముందే మళ్లీ వానలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. వరదల దృష్ట్యా కడప జిల్లాలోని అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 

6. ఒమిక్రాన్‌లో 30కిపైగా మ్యుటేషన్లు..!

అత్యంత ప్రమాదకర వేరియంట్‌గా భావిస్తోన్న ఒమిక్రాన్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ (Spike Protein)లో 30కిపైగా ఉత్పరివర్తనాలు సంభవించినట్లు ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నాయి. అందుకే దీనికి రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని పొందగలుగుతుందన్నారు. ఈ మ్యుటేషన్లే (Mutations) ప్రమాదకరంగా మారవచ్చని.. ఇదే జరిగితే టీకా సామర్థ్యం కూడా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

7. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కేంద్రం పునరాలోచన!

అంతర్జాతీయ విమాన రాకపోకలపై కేంద్రం పునరాలోచనలో పడింది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాల నేపథ్యంలో పరిస్థితి సమీక్షించాకే ప్రయాణాలను పునరుద్ధరించనుంది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్‌ 15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని కేంద్రం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే.

8. రక్తదానం చేయండి: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

ఆర్టీసీ యాజమాన్యం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రజలు, ఆర్టీసీ సిబ్బంది రక్తదానం చేసి ఇతరులను ఆదుకోవాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. తలసేమియా, క్యాన్సర్‌ రోగులు సహా గర్భిణులకు రక్తం చాలా అవసరం ఉన్నట్టు ఆయన వెల్లడించారు.

9. లావైపోతున్న భారత్‌.. పెరిగిపోతోన్న ఊబకాయం

దేశంలో ఊబకాయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా ఊబకాయ సమస్య అందరినీ వేధిస్తోంది. చిన్నారులను సైతం వీడటం లేదు. ఐదేళ్లలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్​ఎఫ్​హెచ్​ఎస్​) తాజాగా వెల్లడించింది. దేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వయసుకు మించి బరువు ఉన్న చిన్నారుల సంఖ్యలో పెరుగుదల నమోదైనట్లు ఎన్​ఎఫ్​హెచ్​ఎస్ ఐదో సర్వేలో పేర్కొంది. 

10. నాలుగో రోజు భారత్‌దే ఆధిపత్యం

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు ఆట ముగిసింది. 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ ఆట ముగిసేసమయానికి వికెట్‌ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్‌లో రాణించిన టీమ్‌ఇండియా.. ఆఖర్లో కివీస్‌ వికెట్ తీసి నాలుగో రోజు ఆటలో ఆధిపత్యం కనబరిచింది. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని