Published : 02/12/2021 20:57 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా

పోలవరంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ రూ.120కోట్ల జరిమానా విధించింది. పోలవరం ప్రాజెక్టుతో పాటు పర్యావరణ అనుమతులు లేకుండా కట్టిన మరో 3 ప్రాజెక్టులకు కూడా జరిమానా విధించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు సంబంధించి రూ.24.56 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి రూ.24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు సంబంధించి రూ.73.6 కోట్లు జరిమానా విధించింది. జరిమానాను 3 నెలల్లో చెల్లించాలని రాష్ట్రానికి ఎన్జీటీ ఆదేశించింది.

2. ఉప్పల్‌ భగాయత్‌లో గజం రూ.లక్ష

ఉప్పల్‌ భగాయత్‌లో 44 ప్లాట్ల విక్రయానికి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) నిర్వహించిన ఇ-వేలం తొలిరోజు ముగిసింది. 19,719 గజాల విస్తీర్ణం గల 23 ప్లాట్లకు అధికారులు ఈ-వేలం నిర్వహించారు. ప్లాట్ల ఈ-వేలం ద్వారా ప్రభుత్వానికి ఇవాళ రూ.141.61 కోట్ల రాబడి వచ్చింది. గజానికి అత్యధికంగా రూ.1.01లక్షల ధర పలికింది. అత్యల్పంగా రూ.53వేలు, సగటున గజం ధర రూ.71,815 ధర పలికినట్టు అధికారులు వెల్లడించారు. 

3. 11 మంది వైకాపా అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ఎన్నిక

స్థానిక సంస్థల కోటాలో 11 మంది వైకాపాకు చెందిన అభ్యర్థులు శాసనమండలి సభ్యులుగా ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్‌ అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేశారు. మొత్తం 8 జిల్లాల్లోని స్థానిక సంస్థల నుంచి వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొంది. అనంతపురం నుంచి యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురామ్‌, మొండితోక అరుణ్‌ కుమార్‌లు ఎన్నికైనట్టు తెలిపింది.

4. చర్చిద్దాం రండి.. ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు

పీఆర్సీ సహా సంబంధిత అంశాలపై కార్యదర్శుల కమిటీతో చర్చించేందుకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. ఇందుకోసం జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో భాగస్వాములైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరుకావాల్సిందిగా  ఆర్థికశాఖ మానవ వనరుల విభాగం ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ నుంచి పిలుపు వచ్చింది. రేపు మధ్యాహ్నం 2గంటల నుంచి సచివాలయం మొదటి బ్లాక్‌ లోని సీఎం సమావేశ మందిరంలో కార్యదర్శుల కమిటీ సమావేశం అవుతుందని అందులో పేర్కొన్నారు.

5. వాట్సాప్‌లోనూ ఉబర్‌ క్యాబ్‌ బుకింగ్‌!

క్యాబ్‌ సేవలు అందిస్తోన్న ఉబర్‌ క్యాబ్స్‌ సంస్థ.. తమ ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా వాట్సాప్‌ ద్వారా కూడా క్యాబ్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటును తీసుకొచ్చింది. ఇందుకోసం వాట్సాప్‌ మాతృసంస్థ మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది.

6. చిన్నారుల టీకా.. తొలుత ఆ 7 రాష్ట్రాల్లోనే..!

దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో చిన్నారులకు టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఇందులోభాగంగా జైడస్‌ క్యాడిలా రూపొందించిన జైకోవ్‌-డీ టీకాను తొలుత 7 రాష్ట్రాల్లో అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో త్వరలోనే బిహార్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో అందించనున్నారు. 

7. ఒమిక్రాన్‌ కలకలం.. కేంద్ర ఆరోగ్యమంత్రితో కర్ణాటక సీఎం భేటీ!

దేశంలోనే తొలిసారి కర్ణాటకలో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో భేటీ అయ్యారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. మంత్రితో సమావేశమై కొత్త వేరియంట్‌ వ్యాప్తి కట్టడిపై చర్చించారు. అనంతరం బొమ్మై మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్‌ డోసు పంపిణీ అంశంపై మాండవీయతో చర్చించానన్నారు.

8. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పై సీబీఐ కేసు నమోదు

నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన కంపెనీ.. బ్యాంకును మోసం చేసిన అభియోగంపై సీబీఐ కేసు నమోదు చేసింది. నంది గ్రెయిన్‌ డెరివేటివ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కంపెనీ డైరెక్టర్లు సురేష్‌ కుమార్‌ శాస్త్రి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, ఎం.శశిరెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌పై హైదరాబాద్‌ సీబీఐ విభాగం కేసు నమోదు చేసింది. రుణాల పేరిట రూ.61.86 కోట్లు మోసం చేశారంటూ బ్యాంక్‌ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. 

9. ఒమిక్రాన్‌లో డెల్టా కంటే రెట్టింపు మ్యుటేషన్లు..! 

దేశంలో సెకండ్‌ వేవ్‌ సృష్టించిన విలయం కారణంగా వేల మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ పరిస్థితికి ప్రమాదకర డెల్టా వేరియంట్‌ కారణమని నిపుణులు ఇప్పటికే తేల్చారు. ఇదే సమయంలో ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌లో డెల్టా రకం కంటే రెట్టింపు మ్యుటేషన్లు చోటుచేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

10. ఒమిక్రాన్‌.. ఏ దేశంలోకి ఎప్పుడు?

ఒమిక్రాన్‌ వేరియంట్‌ దావానలంలా వ్యాపిస్తుండటంతో ప్రపంచం మళ్లీ భయం గుప్పిట్లోకి జారుకుంటోంది. రోజుల వ్యవధిలోనే ఈ కొత్త వేరియంట్‌ దాదాపు 30 దేశాలకు పాకేసింది. డెల్టా రకం కంటే ఆరు రెట్లు వేగంతో వ్యాప్తి చెందే లక్షణం కలిగిన ఈ ఆందోళనకర వేరియంట్‌ భారత్‌లోనూ వెలుగుచూడటం కలకలం రేపుతోంది. విదేశాల నుంచి కర్ణాటకకు వచ్చిన ఇద్దరు పురుషుల్లో ఒమిక్రాన్‌ వెలుగుచూసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

ఇవీ చదవండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని