Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం... 

Published : 25 Jan 2022 20:58 IST

1. బిపిన్‌ రావత్‌కు పద్మవిభూషణ్‌

పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నలుగురికి పద్మవిభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన ప్రభా ఆత్రే, రాధేశ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్‌సింగ్‌ (మరణానంతరం)లకు పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది.

2. పీఆర్సీపై వెనక్కి తగ్గని ప్రభుత్వం.. మరోసారి ఆర్థిక శాఖ ఉత్తర్వులు

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నా ఏపీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఓ వైపు చర్చలకు రావాలని చెబుతూనే తన పని తాను చేసుకుపోతోంది. తాజా జీతాల,పెన్షన్‌ బిల్లులను ప్రాసెస్‌ చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, పెన్షన్‌ బిల్లులను ప్రాసెస్‌ చేయాలని స్పష్టం చేసింది.

3. విజయవాడ - హైదరాబాద్‌ మధ్య తగ్గనున్న బస్సు ఛార్జీలు

ప్రయాణికుల ఆదరణ పొందేందుకు కృష్ణాజిల్లా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. కృష్ణాజిల్లా - హైదరాబాద్  మధ్య ఛార్జీలు తగ్గించాలని నిర్ణయించారు. దీంతో కృష్ణాజిల్లాకు చెందిన ఇంద్ర, అమరావతి, గరుడ, నైట్ రైడర్, వెన్నెల స్లీపర్ బస్సుల్లో 20 శాతం వరకు ఛార్జీలు తగ్గిస్తామని ఆర్‌ఎం యేసు దానం వెల్లడించారు. కృష్ణాజిల్లా నుంచి హైదరాబాద్‌ వెళ్లేవారికి ఆదివారం, అలాగే హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లాకు వచ్చే వారికి శుక్రవారం రోజున ఈ రాయితీ వర్తించదు.

4. ఆఫీసుల్లో ఆ ఇద్దరి ఫొటోలుచాలు.. సీఎంలు సహా ఇంకెవరివీ పెట్టొద్దు!

దేశ రాజధాని నగరం దిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింట్లోనూ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌, భగత్‌సింగ్‌ ఫొటోలు తప్ప మరే ఇతర రాజకీయ నేతల చిత్రపటాలు ఉండరాదని సీఎం కేజ్రీవాల్‌ ఆదేశించారు. దిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రుల ఫొటోలూ అవసరంలేదన్నారు.

5. ఏపీలో లక్షదాటిన కరోనా యాక్టివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 46,929 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 13,819 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ వల్ల తాజాగా చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో  ఇద్దరేసి మృతి చెందగా, ప్రకాశం, పశ్చిమగోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

6. తెలంగాణలో కొవిడ్‌ కేసులు మళ్లీ 4వేలకు పైనే

తెలంగాణలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా మళ్లీ 4వేలకు పైగా నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు పెద్ద సంఖ్యలోనే కొత్త కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 1,13,670 టెస్టులు చేయగా.. 4,559మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 1961మంది కోలుకోగా.. ఇద్దరు మరణించారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 36,269కి పెరిగింది.

7. డీజీపీ నేతృత్వంలోనే భాజపా నేతలపై దాడులు : బండి సంజయ్‌

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ దుయ్యబట్టారు. డీజీపీకి తెలిసే ఎంపీ అర్వింద్‌పై దాడి జరిగిందని అన్నారు. డీజీపీ నేతృత్వంలోనే భాజపా నేతలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపీపై దాడి జరిగిన తర్వాత డీజీపీ మహేందర్‌రెడ్డికి, ఎస్పీకి ఫోన్‌ చేసినా స్పందించడం లేదన్నారు. 

8. వైకాపారూలింగ్‌ పార్టీ కాదు.. ట్రేడింగ్‌ పార్టీ : సోము వీర్రాజు

సంక్రాంతి ఎలా ఉంటుందో తెలియజేసేందుకే గుడివాడ వెళ్లామని ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. సంక్రాంతి అంటే క్యాసినో డ్యాన్సులు కాదని ఎద్దేవా చేశారు. అలాంటి డ్యాన్సులంటే మంత్రికి ఇష్టమేమో అని వ్యాఖ్యానించారు. గుడివాడ వెళ్తున్న మమ్మల్ని  పోలీసులు ఏ దృష్టితో అరెస్టు చేశారని ప్రశ్నించారు.

9. నీరజ్‌ చోప్రాకు అరుదైన గౌరవం.. విశిష్ట సేవా పురస్కారంతో సత్కారం

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన జావెలిన్‌ త్రో వీరుడు నీరజ్​ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. నీరజ్‌ను కేంద్ర ప్రభుత్వం.. ‘పరమ విశిష్ట సేవా పతకం’తో సత్కరించనుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చోప్రాకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఈ అవార్డును అందజేయనున్నారు.

10. మహీంద్రా షోరూంలో రైతుకు అవమానం.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..?

కర్ణాటకలో కారు కొనేందుకు మహీంద్రా షోరూంకు వెళ్లిన రైతుకు అవమానం జరిగిన ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆ సంస్థ ఛైర్మన్‌ ఆనంద్ మహీంద్రా స్పందించారు. కస్టమర్లకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కిచెప్పారు. బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని