Published : 05/12/2021 12:59 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

1. విశాఖ ఆర్కే బీచ్‌లో ముందుకొచ్చిన సముద్రం

విశాఖ నగరంలోని ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకొచ్చింది. దీంతో ఆర్కే బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. మరోవైపు భూమి కోతతో సమీపంలోని చిల్డ్రన్‌పార్కులో ప్రహరీ గోడ కూలిపోయింది. అక్కడ ఉన్న బల్లలు విరిగిపోయాయి. సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి.

2. రైతుల పాదయాత్ర రాష్ట్రం కోసం..స్వప్రయోజనాలకు కాదు: లక్ష్మీనారాయణ

అమరావతి రైతులు వారి ప్రయోజనాల కోసం ‘మహాపాదయాత్ర’ చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారని.. ఇందులో ఎటువంటి సత్యం లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్ర భవిషత్తు, రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులు పోరాటం చేస్తున్నారని ఆయన వివరించారు. అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతుల చేస్తున్న పాదయాత్ర 35వ రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది.

3. దేశంలో మరో ఒమిక్రాన్‌ కేసు

దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు కేసులు వెలుగులోకి రాగా.. తాజాగా దిల్లీలో మరో కేసు నిర్ధారణ అయ్యింది. ఇటీవల టాంజానియా నుంచి భారత్‌కు వచ్చిన వ్యక్తి(37)కి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం బాధితుడు నగరంలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

4. భారీగా నమోదైన కొవిడ్‌ మరణాలు.. ఎందుకంటే?

దేశంలో కరోనా వ్యాప్తి స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. అయితే మరణాల సంఖ్య మాత్రం ఇటీవల ఎప్పుడు చూడని విధంగా 2,796గా నమోదైంది. ఇందుకు కారణం పలు రాష్ట్రాలు ఆ సంఖ్యను సవరించడమే. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 12,26,064 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,895 కేసులు వెలుగులోకి వచ్చాయి.

5. మిలిటెంట్ల ఏరివేత ఆపరేషన్‌ గురితప్పి.. 13 మంది మృతి

నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లా ఓటింగ్‌ అనే ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం సాయంత్రం భద్రతాబలగాలు మిలిటెంట్లుగా భావించి పౌరులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 13 మంది మృతి చెందగా.. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

6. అమెరికాలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్‌ కేసులు!

అమెరికాలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. శనివారం న్యూయార్క్‌లో మరో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. సామాజిక వ్యాప్తి ప్రారంభమైన సంకేతాలు కనిపిస్తున్నాయని ఆ రాష్ట్ర హెల్త్‌ కమిషనర్‌ మేరీ బాసెట్‌ తెలిపారు. 

7. యాంకర్‌ అనసూయ ఇంట విషాదం!

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి సుదర్శన్‌ రావు(63) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తార్నాకలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. పరిస్థితి విషమించి ఇవాళ తుదిశ్వాస విడిచారు. సుదర్శన్‌ రావు కాంగ్రెస్‌ పార్టీలో చాలాకాలం పాటు పనిచేశారు. రాజీవ్‌ గాంధీ హయాంలో యూత్‌ కాంగ్రెస్‌ పబ్లిసిటీ సెక్రటరీగా వ్యవహరించారు.

8. కేసుల సత్వర పరిష్కారంతోనే  అక్రమ కార్యకలాపాల నియంత్రణ

ప్రతి ఒక్క కేసును వివేచనతో పరిష్కరించి, వేగంగా శిక్షలు పడేటట్లు చేస్తేనే.. అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిలో భయం ఏర్పడుతుందని ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. తద్వారా అక్రమ రవాణా సహ పలు ఆర్థిక నేరాలను నియంత్రించవచ్చని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) 64వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో ఆమె చెప్పారు.  

9. కొత్త ఫ్రంట్‌ వైపు ఎస్పీ చూపు

ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కొత్త సమీకరణాలకు తెరలేస్తోంది. ఇంతవరకు కాంగ్రెస్‌తో కలిసి అడుగులు వేస్తుందని భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఆకస్మికంగా మాట మార్చింది. కాంగ్రెస్‌ కూటమికి ప్రత్యామ్నాయంగా కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్న పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతకు చేయూతనందించాలని ఎస్పీ భావిస్తోంది. 

10. రూ.4 లక్షల పరిహారానికి కాంగ్రెస్‌ ఆన్‌లైన్‌ ఉద్యమం

దేశంలో కరోనా కారణంగా చనిపోయినవారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.4 లక్షల వంతున పరిహారాన్ని అందించాలనే డిమాండుతో కాంగ్రెస్‌ పార్టీ ఆన్‌లైన్‌ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ శనివారం ఈ ఉద్యమాన్ని ట్విటర్లో ప్రారంభిస్తూ.. ప్రజలంతా తీవ్ర కష్టనష్టాలు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం నిద్రమత్తులో ఉందని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తట్టి లేపాల్సిన అవసరం ఉందన్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని