Published : 07/12/2021 12:57 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

1. లోక్‌సభలో నల్లచొక్కాలతో తెరాస ఎంపీల నిరసన

ధాన్యం కొనుగోళ్ల అంశంపై తెరాస ఎంపీలు లోక్‌సభలో ఆందోళన కొనసాగించారు. నల్లచొక్కాలు ధరించి సభలో నిరసన తెలిపారు ధాన్యం, బియ్యం ఎంత సేకరిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సభ నుంచి బయటకు వచ్చి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ధాన్యం సేకరణకు సమగ్ర జాతీయ విధానం తేవాలని.. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని తెరాస ఎంపీలు డిమాండ్‌ చేశారు.

2. పీఆర్సీ నివేదిక బయటపెట్టేందుకు ఎందుకు జంకు?: బొప్పరాజు
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) తదితర సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి తలపెట్టిన తొలిదశ ఉద్యమం ప్రారంభమైంది. కర్నూలు, ఏలూరు, పాడేరు తదితర ప్రాంతాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. కర్నూలులో ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పీఆర్సీ నివేదిక బయటపెట్టేందుకు ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. 

3. సీఎం సహాయ నిధికి ప్రభాస్‌ రూ. కోటి విరాళం!

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వచ్చిన వరదల కారణంగా పలు జిల్లాల్లో తీవ్ర నష్టం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ప్రజలు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. కాగా.. వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. తాజాగా రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళంగా అందజేశారు.

4. ఎంపీల సస్పెన్షన్‌పై రాజ్యసభలో అదే రగడ.. మళ్లీ వాయిదా

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో మంగళవారం కూడా అదే గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేతకు విపక్షాలు పట్టుబట్టడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రశ్నోత్తరాల గంట చేపట్టారు. అయితే ఎంపీల సస్పెన్షన్‌ సహా పలు అంశాలపై చర్చ జరపాలంటూ విపక్ష ఎంపీలు తమ సీట్ల నుంచి లేచి ఆందోళనకు దిగారు. 

5. రేపటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. మంగళవారం పొడి వాతావరణం ఉంటుంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా నల్లవెల్లి(సంగారెడ్డి జిల్లా)లో 13 డిగ్రీలుగా నమోదైంది.

6. రాష్ట్రంలో జరిగేవి షెకావత్‌కు తెలియవనుకుంటున్నారా?: సోము

కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోవడాన్ని ప్రస్తావించినందుకు కేంద్ర మంత్రి షెకావత్‌ను రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టడం విడ్డూరంగా ఉందని ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో జరిగే విషయాలు షెకావత్‌కు తెలియదన్న భ్రమలో ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోకుండా విమర్శలు చేయడం ఎంతవరకూ సబబో ఆలోచించాలన్నారు.

7. చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన రైతుల ‘మహాపాదయాత్ర’

న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది. 37వ రోజు పాదయాత్ర నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ప్రారంభమైంది. ఇవాళ సుమారు 16 కిలోమీటర్ల మేర సాగే యాత్ర చింతలపాలెం వరకు సాగనుంది. ఈ ఉదయం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం జగ్గరాజపల్లెలోకి యాత్ర ప్రవేశించగానే రైతులకు స్థానికులు ఘనస్వాగతం పలికారు.

8. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు సూచీలకు  దన్నుగా నిలుస్తున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఆసియా సూచీలు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఒమిక్రాన్‌ భయాల నుంచి సూచీలు నెమ్మదిగా బయటకు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

9. సామాజిక మార్పుతోనే వరకట్న సమస్య దూరం: సుప్రీంకోర్టు వ్యాఖ్య 

వరకట్నం సామాజిక సమస్య అని, సంఘంలో మార్పు వస్తేనే ఇది పరిష్కారమవుతుందని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో కోర్టులకు పరిమితులు ఉంటాయని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం తెలిపింది. వరకట్నం సమస్య నిరోధానికి మూడు సూచనలు చేస్తూ కేరళకు చెందిన సబు సెబాస్టియన్‌ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తూ పై వ్యాఖ్యలు చేసింది.

10. మోదీ, ప్రియాంక చోప్రా, అక్షయ్‌ కుమార్‌.. బిహార్‌లో టీకా తీసుకున్నారట..!

అదేంటీ.. ప్రధాని మోదీ దిల్లీలో ఉంటారు.. అక్షయ్‌ కుమార్‌ ఉండేది ముంబయిలో.. ప్రియాంక చోప్రా చాన్నాళ్ల నుంచి అమెరికాలోనే ఉంటున్నారు కదా.. మరి వీరంతా బిహార్‌లో ఒకే చోట ఎలా కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు అనుకుంటున్నారా..? అక్కడి కంప్యూటర్‌ ఆపరేటర్ల నిర్వాకం వల్ల ఇలా జరిగింది. బిహార్‌లోని ఓ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో జరిగిన కొవిడ్ టీకా డేటా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని