Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Published : 09 Dec 2021 13:01 IST

1. హెలికాప్టర్‌ దుర్ఘటనపై రాజ్‌నాథ్‌ ప్రకటన

భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి పట్ల పార్లమెంట్ ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనపై కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంట్ ఉభయసభల్లో నేడు ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదం చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. 

వీవీఐపీ ప్రమాదాలకూ కేరాఫ్‌గా ఎంఐ-17..!

2. లైఫ్‌ సపోర్ట్‌పై గ్రూప్‌ కెప్టెన్‌  

3.  రక్షణ భాగస్వామ్యంలో బిపిన్‌ రావత్‌ది కీలక పాత్ర: అమెరికా

భారత సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ మృతి పట్ల అమెరికా సంతాపం తెలిపింది. భారత్‌-అమెరికా రక్షణ భాగస్వామ్యంలో ఆయన బలమైన ప్రతినిధి అని, ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో ఆయన విశేషంగా కృషి చేశారని కొనియాడింది. సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ మృతి పట్ల అమెరికా రక్షణ రంగం తరఫున సంతాపం తెలియజేస్తున్నట్లు పెంటగాన్‌ ప్రెస్‌ సెక్రటరీ జాన్‌ కిర్బీ వెల్లడించారు. అలాగే అమెరికాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు సైతం బిపిన్‌ రావత్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు.

4. సాయితేజ స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో విషాదఛాయలు..

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన చిత్తూరు జిల్లా వాసి సాయితేజ స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన నివాసం వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరోవైపు స్థానిక పోలీసు అధికారులు సాయితేజ కుటుంబసభ్యులను పరామర్శించారు. సాయితేజ అంత్యక్రియల కోసం గ్రామంలో ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు.

5. కోలుకున్నవారి కంటే కొత్త కేసులే ఎక్కువ..!

దేశంలో ఒమిక్రాన్ కలవరం మొదలైనప్పటికీ.. ప్రస్తుతానికి కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. గత కొద్ది కాలంగా కొత్త కేసులు 10 వేలకు దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా 12,89,983 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9,419 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే 11 శాతం అదనంగా కేసులు వెలుగుచూశాయి. అందులో 23 మంది ఒమిక్రాన్‌తో బాధపడుతున్నారు.

6. సరిగ్గా 75ఏళ్ల క్రితం ఇదే రోజున తొలిసారి..

దేశ రాజ్యాంగ చరిత్రలో డిసెంబరు 9వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజునే చరిత్రాత్మక రాజ్యాంగ పరిషత్‌ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నేటికి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌ వేదికగా నాటి అరుదైన ఫొటోలను పంచుకున్నారు. నాటి సమావేశాల గురించి ఈ తరం యువత ఎంతగానో తెలుసుకోవాలన్నారు.

7. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌.. రెండు కళ్లూ చాలవ్‌..!

సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు ఎట్టకేలకు వచ్చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌- రౌద్రం రణం రుధిరం’ (RRR) ట్రైలర్‌ గురువారం ఉదయం విడుదలైంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైలర్‌ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. 

8. ఊగిసలాటలో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు గురువారం ఊగిసలాట ధోరణిలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగానే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. కానీ దేశీయంగా దిగ్గజ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఒత్తిడికి గురవుతున్నాయి. 

9. ఒమిక్రాన్‌ బాధితులకు ప్రత్యేక చికిత్సలు

దేశంలో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బారిన పడినవారికి కొవిడ్‌ ప్రత్యేక ఆసుపత్రుల్లోనే చికిత్స అందించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బాధితులను ప్రత్యేకంగా ఐసొలేషన్‌ ప్రాంతాల్లో ఉంచాలని.. వారి నుంచి ఇతర రోగులకు గానీ, వైద్య సిబ్బందికి గానీ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. 

10. టీమ్‌ఇండియాకు సువర్ణవకాశం: హర్భజన్‌

దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్‌ఇండియాకు బంగారు అవకాశం ఉందని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ అన్నాడు. మరికొద్ది రోజుల్లో భారత జట్టు అక్కడికెళ్లి మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్న నేపథ్యంలో స్పిన్‌ దిగ్గజం యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇప్పటివరకు టీమ్‌ఇండియా ఆ దేశంలో ఒక్క టెస్టు సిరీస్‌ కూడా గెలవలేదని.. ఈసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని