Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Published : 28 Jan 2022 12:56 IST

1. మరో కొత్త వైరస్ ‘నియో కోవ్‌’‌.. సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి..!

ఓవైపు సార్స్ ‌- కోవ్ ‌- 2 (కరోనా మహమ్మారి)లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రపంచాన్ని వణికిస్తోన్న వేళ.. మరో కొత్త వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దక్షిణాఫ్రికాలో బయటపడిన ‘నియో కోవ్‌ (NeoCoV)’ అనే కొత్త రకం వైరస్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటు మరణాల రేటు కూడా అధికంగానే ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు వుహాన్ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేయడం భయాందోళనకు గురిచేస్తోంది.

Budget 2022: చైనాపై బడ్జెట్‌ గురి..! 

2. రాజంపేటలో ఆందోళనలు.. ఎక్కడికక్కడ పోలీసుల ఆంక్షలు

ఏపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనపై పలు ప్రాంతాల్లో అసంతృప్తి చెలరేగుతోంది. ప్రస్తుత కడప జిల్లాలోని రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలంటూ ఆ ప్రాంతవాసులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజంపేటను కాదని.. రాయచోటిలో తమను కలపడమేంటని ప్రశ్నిస్తున్నారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. నిరసనకారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు

నిర్మలమ్మ బడ్జెట్‌ టీం ఇదే..!

3. 31 నుంచి పాఠశాలలు తెరుస్తున్నారా?: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

వారాంతపు సంతల్లో కొవిడ్‌ నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టారని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని.. ఈనెల 31 నుంచి తెరుస్తారా? అని ఉన్నత న్యాయస్థానం ఆరా తీసింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. సమ్మక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

ఒమిక్రాన్‌ భయం.. బడ్జెట్‌ ‘హల్వా’ లేదు

4. కేసులు తగ్గినా.. మరణాలు పెరిగాయి..!

దేశంలో వరుసగా నాలుగోరోజు మూడు లక్షల దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులు 35 వేల మేర తగ్గి..2.51 లక్షలకు చేరాయి. కేసులు తగ్గినా.. మరణాలు మాత్రం పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 627 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 153 కేరళ నుంచి వచ్చినవే. ఈ రెండేళ్ల కాలంలో 4,92,327 మంది మహమ్మారికి బలయ్యారు. నిన్న 3,47,443 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.

5. లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. వడ్డీ రేట్ల పెంపునకు ఫెడ్‌ సంకేతాలివ్వడంతో గురువారం భారీ నష్టాలు చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో కనిష్ఠాల వద్ద నేడు పరిమిత స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం ఉంది. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి.

6. ఒకేసారి 20,000 స్క్రీన్స్‌పై ‘ఆదిపురుష్‌’

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్‌’ చిత్రం బడ్జెట్‌, రిలీజ్‌పై కొన్ని ఆసక్తికర విశేషాలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా మొత్తం బడ్జెట్‌ విలువ రూ.400 కోట్లని సమాచారం. దాదాపు 15 స్వదేశీ, అంతర్జాతీయ భాషల్లో.. ప్రపంచవ్యాప్తంగా 20,000 థియేటర్లలో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు.. ‘ఆదిపురుష్‌’ని పాన్‌ ఇండియా మూవీగా కాకుండా పాన్‌ వరల్డ్‌ మూవీగా పిలుస్తున్నారు.

7. సెషన్స్‌దాటి సభ్యుల్ని సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధం

12 మంది ఎమ్మెల్యేలను మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తప్పుపట్టింది. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధం, ఏకపక్షమంటూ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన సస్పెన్షన్ ఆదేశాలను పక్కన పెట్టింది. అప్పటి సమావేశాల వరకే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ‘సెషన్స్ దాటి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధం’ అని శుక్రవారం తీర్పునిచ్చింది.

8. దేవుడిపై నటి శ్వేతా తివారీ వ్యాఖ్యలు వివాదాస్పదం

ప్రముఖ బుల్లితెర, సినీ నటి శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తాను నటిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌ వివరాలను వెల్లడించేందుకు ఆమె బుధవారం భోపాల్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఆమె సరదాగా మాట్లాడుతూ.. తన లోదుస్తులకు, దేవుడికి ముడిపెడుతూ ఓ వ్యాఖ్య చేశారు. శ్వేత వ్యాఖ్యలు హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

9. కోహ్లీ సెంచరీ కొట్టకపోతే ఏమైంది..:షమి

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీకి ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమి మద్దతుగా నిలిచాడు. అతడు సెంచరీ కొట్టకపోతే ఏమైందని.. అతడెంత పెద్ద ఆటగాడనేది ఒక శతకం నిర్వచించలేదని అన్నాడు. ఇటీవలి కాలంలో కోహ్లీ శతకాలు సాధించకపోయినా అర్ధశతకాలు సాధిస్తున్నాడని గుర్తుచేశాడు. అలాంటప్పుడు అతడి బ్యాటింగ్‌ గురించి ఆలోచించడం అనవసరమని అభిప్రాయపడ్డాడు. 

10. థ్యాంక్యూ ఇండియా: సత్య నాదెళ్ల

‘భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్‌ అవార్డు స్వీకరించడం గౌరవంగా భావిస్తాను. భారత రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీ అందరితో కలిసి పనిచేసేందుకు, భారతీయులు మరిన్ని విజయాలు సాధించేలా సాంకేతికతను మీకు చేరువ చేసేందుకు ఎదురుచూస్తున్నా’ అంటూ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల (54) గురువారం ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని