Published : 15 Nov 2020 21:33 IST

నాన్నకు ప్రేమతో...ఆలయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: నవ మాసాలూ మోసి తల్లి ప్రాణం పోస్తే.. నడక, నడత నేర్పించి జీవితాన్ని తీర్చిదిద్దుతాడు తండ్రి. అన్ని విషయాలు చెబుతూ అమ్మ ఆది గురువైతే.. ఆశయ సౌధాన్ని నిర్మించుకోవటంలో అడుగడుగునా తోడుంటాడు తండ్రి. అలాంటి అమ్మనాన్నల రుణాన్ని తీర్చుకోవడం కడుపున పుట్టిన బిడ్డలకు సాధ్యమవుతుందా? నిలువెత్తు బంగారం వారి ఎదుటపోసినా ఆ గుండెల్లోని ప్రేమకు సమానమవుతుందా? ఎన్ని జన్మలు ఎత్తినా వారి రుణం తీర్చుకోవటం కష్టం. అలాంటి ఆ కన్నపేగు బంధాన్ని కాటికి పంపాలనుకునే బిడ్డలున్న రోజులివి. అవసాన దశలో అపురూపంగా చూసుకోవాల్సింది పోయి.. అమ్మనాన్నలను అనాథాశ్రమాల పాల్జేస్తున్న కాలమిది. కానీ.. ఆ వ్యక్తి మాత్రం తన తండ్రిపై ఉన్న ప్రేమకు ప్రతీకగా గుడినే కట్టాడు. అతడే దాసు.

దాసుది విశాఖలోని ఎంవీపీ కాలనీ. ఆర్మీ రిజర్వ్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి వాసుపల్లి దేముడు గుండెపోటుతో మరణించారు. దాంతో ఆయనకు ఆలయాన్ని కట్టించారు దాసు. అందులో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. నిత్యం పూజలు చేస్తూ స్మరించుకుంటున్నారు. విగ్రహం ఏర్పాటు చేసేందుకు తన తోబుట్టువులు ఎంతగానో ప్రోత్సహించారని చెబుతున్నారు. ‘‘మా నాన్న ఎన్నో కష్టాలు అనుభవించారు. పదేళ్ల ప్రాయంలో అనాథగా మారిన ఆయన మత్స్యకారుడిగా జీవితం నెట్టుకొచ్చారు. ఏడుగురు సంతానాన్ని పోషించారు. అల్లారు ముద్దుగా పెంచారు. మా అందరినీ ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. ఆయన జ్ఞాపకార్థం ఏదో ఒకటి చేయాలని అనిపించింది. అందుకే ఈ విధంగా గుడికట్టాం. చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని ఎంతో ప్రేమగా చూస్తారు. మనం పెద్దయ్యాక వారిని కూడా అలాగే ప్రేమతో చూసుకోవాలి. వాళ్లను భారం అనుకోకూడదు. వారున్నంత కాలం మనకు గౌరవం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మా లాగా గుడి కట్టాలని చెప్పట్లేదు. తల్లిదండ్రులు బతికున్నంత కాలం.. వారిని బాగా చూసుకోవాలని కోరుతున్నాం’’ అని దాసు పేర్కొన్నారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts