WFH: మరో ఐదేళ్లు ఇలాగే కొనసాగితే అనారోగ్యమే!

కరోనా.. లాక్‌డౌన్‌ కారణంగా అనేక సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని(వర్క్‌ ఫ్రమ్‌ హోం) చేసే అవకాశాన్ని కల్పించాయి. దీంతో ఉద్యోగుల జీవనశైలి మారిపోయింది. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే గంటల తరబడి కూర్చొని పని చేయడం, తినడం, నిద్రపోవడం ఇదే దినచర్యగా

Updated : 04 Jul 2021 17:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా.. లాక్‌డౌన్‌ కారణంగా అనేక సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని(వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) చేసే అవకాశాన్ని కల్పించాయి. దీంతో ఉద్యోగుల జీవనశైలి మారిపోయింది. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే గంటల తరబడి కూర్చొని పని చేయడం, తినడం, నిద్రపోవడం.. ఇదే దినచర్యగా మారింది. అయితే, మరో ఐదేళ్లు ఉద్యోగులు ఇలాగే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తే వారి శరీరం, ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని లాయిడ్స్‌ ఫార్మసీ డాక్టర్స్‌ అనే ఆన్‌లైన్‌ డాక్టర్‌ కన్సల్టెన్సీ సంస్థ వెల్లడించింది.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల ఉద్యోగులు ఇంట్లోనే హాయిగా కూర్చొని పనిచేస్తున్నారు. అయితే, ఎక్కువ సేపు ఒకే చోట కంప్యూటర్‌ ముందు కూర్చోవడం.. సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల శారీరక నొప్పులతో పాటు ఇతర సమస్యలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆఫీసుకు వెళ్లే అవసరం లేకపోవడంతో ఆలస్యంగా నిద్రలేస్తూ వ్యాయామం చేయడానికి కొంతమంది బద్దకిస్తున్నారు. చిరు తిండ్లు, జంక్‌ ఫుడ్స్‌ ఎక్కువగా తింటూ పనిచేస్తున్నారు. దీని వల్ల బరువు పెరుగుతున్నారు. బయటకు వెళ్లకపోవడం వల్ల సూర్యరశ్మి శరీరంపై పడక విటమిన్‌ డి లోపం ఏర్పడుతోంది. ఇలా అనేక ఆరోగ్య సమస్యలు ఉద్యోగులను చుట్టుముట్టనున్నట్లు తెలిపారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న ఉద్యోగులు ఇలాంటి అనారోగ్య జీవనశైలినే మరో ఐదేళ్లపాటు కొనసాగిస్తే.. ఎలా ఉంటుందో తెలియజేస్తూ లాయిడ్‌ ఫార్మసీ డాక్టర్స్‌ ఒక విజువల్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనారోగ్య జీవనశైలి వల్ల చర్మం పాలిపోవడం, శరీరం వంకర్లుగా మారడం, గూని ఏర్పడటం, బరువు పెరగడం వంటివి జరుగుతాయని వైద్యులు తెలిపారు. జుట్టు పలచబడటంతోపాటు కంటిచూపు మందగిస్తుందని పేర్కొన్నారు.

అలా అని, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ మంచి విధానం కాదని తాము చెప్పట్లేదని, కేవలం అనారోగ్య జీవనశైలి వల్ల మాత్రమే సమస్యలు ఉత్పన్నమవుతాయని స్పష్టం చేశారు. కాబట్టి.. ఉద్యోగులు గంటల తరబడి ఒకే చోట కూర్చొకుండా అప్పుడప్పుడు చిన్న విరామం తీసుకోని వ్యాయామం చేయాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా మంచం, సోఫాలో కూర్చొని పనిచేయకూడదని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని