Revanth Reddy: రెండు నెలల్లో హైదరాబాద్‌-విజయవాడ రహదారి విస్తరణ పనులు

తెలంగాణలోని రహదారులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రహదారులకు భూసేకరణ ఎందుకు జాప్యమవుతోందని కలెక్టర్లను సీఎం ప్రశ్నించారు.

Updated : 10 Jul 2024 21:16 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రహదారుల నిర్మాణంపై బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రహదారులకు భూసేకరణ ప్రక్రియలో ఎందుకు జాప్యం జరుగుతోందని కలెక్టర్లను ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్‌, మార్కెట్‌ ధరల మధ్య భారీ వ్యత్యాసంతో రైతులు ముందుకు రావట్లేదని కలెక్టర్లు వివరణ ఇచ్చారు. దీంతో భూసేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించాలని, నిబంధనల ప్రకారం రైతులకు ఎక్కువ పరిహారం దక్కేలా చూడాలని సీఎం సూచించారు. భూములు కోల్పోతున్న రైతులను పిలిచి కలెక్టర్లు మాట్లాడాలని, ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ, ఉత్తర భాగాలకు ఒకే నంబర్‌ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌హెచ్‌ఏఐ త్రైపాక్షిక ఒప్పందానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు.  

ఆర్మూర్‌-నాగ్‌పూర్‌ కారిడార్‌కు ప్రభుత్వ భూములను కేటాయించాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. హైదరాబాద్‌-మన్నెగూడ పనులు త్వరగా ప్రారంభించాలని, హైదరాబాద్‌-విజయవాడ రహదారి విస్తరణ వెంటనే చేపట్టాలని సూచించారు. కాగా.. హైదరాబాద్‌-విజయవాడ రహదారి విస్తరణ పనులు 2 నెలల్లో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన ఈ సమీక్షలో సీఎంతోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని