TG News: డిసెంబరులోపే హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ పనులు: మంత్రి కోమటిరెడ్డి

డిసెంబరులోపే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ -65) విస్తరణ పనులు పూర్తయ్యేలా చూస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

Updated : 19 Jun 2024 19:12 IST

హైదరాబాద్‌: డిసెంబరులోపే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ -65) విస్తరణ పనులు పూర్తయ్యేలా చూస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రహదారులపై సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్టులు కాంగ్రెస్‌ హయాంలోనే వచ్చాయి. ఔటర్‌ రింగ్‌రోడ్డు, శంషాబాద్‌ విమానాశ్రయంతో హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోయాయి. నల్గొండ బైపాస్‌ రోడ్డు గురించి కేంద్రమంత్రి గడ్కరీతో చర్చించా. ఆర్‌ఆర్‌ఆర్‌ను కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్ర మంత్రి చెప్పారు. 

యుటిలిటి ఛార్జీలు భరించేందుకు భారాస ప్రభుత్వం ఇష్టపడలేదు. దీంతో ఆ ప్రాజెక్టు కొంతకాలం ఆగింది. యుటిలిటి ఛార్జీలు భరిస్తామని మేం చెప్పడంతో మళ్లి కదలిక వచ్చింది. ఈసారి రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)పై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారించింది. నాగ్‌పూర్‌-మంచిర్యాల హైవే నిర్మాణంపై కూడా కేంద్రంతో చర్చించాం. విజయవాడ- హైదరాబాద్‌ హైవేను డెత్‌ రోడ్డు అని కేంద్రమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. ఎన్‌హెచ్‌-65పై 17 బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి మరమ్మతులు చేపట్టాం. విజయవాడ-హైదరాబాద్‌ హైవేను ఆరు లేన్లుగా మార్చే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాం. డిసెంబరులోపే ఎన్‌హెచ్‌ 65 విస్తరణ పనులు పూర్తయ్యేలా చూస్తాం’’ అని మంత్రి తెలిపారు. ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు నత్తనడకన సాగడంపై మంత్రి ఆరా తీశారు. కాంట్రాక్టర్‌ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెప్పగా.. ఈ అంశాన్ని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్టర్‌ను మార్చడం లేదా, పనులు వేగవంతం చేయించాలని అధికారులకు సూచించారు. అంబర్‌పేట ఫ్లైఓవర్‌ పనులు తుది దశకు చేరాయని, మరో నెలరోజుల్లో ట్రాఫిక్‌కు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని